సర్కారు స్కూళ్లకు 2,93,388 సీలింగ్‌ ఫ్యాన్లు

23 Mar, 2021 04:59 IST|Sakshi

నాడు–నేడు తొలిదశలో 15,715 స్కూళ్లలో ఇప్పటికే రూ.2,580 కోట్లు వ్యయం 

సాక్షి, అమరావతి: విద్యా రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పడుతోంది. రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు ఏ ప్రభుత్వాలూ ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాల కల్పన గురించి పట్టించుకోలేదు. తొలిసారిగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ‘మన బడి నాడు–నేడు’ కార్యక్రమం ద్వారా సర్కారు బడులను బాగు చేయడమే కాకుండా విద్యార్థులు, ఉపాధ్యాయులు కూర్చునేందుకు అవసరమైన ఫర్నిచర్‌ను పెద్దఎత్తున సమకూర్చుతున్నారు. ఒక పక్క స్కూలు భవనాల మరమ్మతులు నిర్వహిస్తూనే మరోపక్క బల్లలు, కుర్చీలు, టేబుళ్లతో పాటు సీలింగ్‌ ఫ్యాన్లు సమకూర్చుతున్నారు. అల్మారాలు, స్మార్ట్‌ టీవీలు, రక్షిత మంచినీటి సౌకర్యం, మరుగుదొడ్లు లాంటి సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకున్నారు. దీంతో దశాబ్దాల తరువాత రాష్ట్రంలో సర్కారు బడుల రూపురేఖలు మారుతున్నాయి. 

కార్పొరేట్‌ స్కూళ్లను తలదన్నేలా..
2019 నవంబర్‌ 14వ తేదీన తొలిదశలో 15,715 స్కూళ్లలో మన బడి  నాడు–నేడు పనులకు శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకు నాడు–నేడు తొలి దశ పనులకు రూ.2,580 కోట్లను వ్యయం చేశారు. పనులన్నీ శరవేగంగా సాగుతుండగా ఇప్పటికే çపనులు పూర్తయిన బడులు కార్పొరేట్‌ స్కూళ్లను తలదన్నేలా కనిపిస్తున్నాయి. తొలి దశ నాడు నేడు పనులకు రూ.3,437 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. అయితే ఎక్కడా రాజీలేకుండా పనులు చేస్తుండటంతో  అంచనాలు పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. 

ఈ నెలాఖరుకు తొలిదశ పనులు పూర్తి
ప్రభుత్వ పాఠశాలల దుస్థితి, విద్యార్థుల వెతలను పాదయాత్రలో స్వయంగా చూసిన ముఖ్యమంత్రి జగన్‌ అధికారంలోకి రాగానే మన బడి నాడు–నేడు ద్వారా చేపట్టాల్సిన పనులను నిర్దేశించారు. రూ.826.70 కోట్ల అంచనా వ్యయంతో రన్నింగ్‌ వాటర్‌తో కూడిన మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు. తొలిదశలో 14,293 మరుగుదొడ్ల పనులు మంజూరయ్యాయి. తొలి దశ నాడు–నేడులో రూ.325.19 కోట్ల వ్యయంతో 14,474 రక్షిత మంచినీటి పనులను చేపట్టారు. ఈ నెలాఖరుకు తొలి దశ నాడు–నేడు పనులు పూర్తి చేయాలని ఇటీవల స్పందన కార్యక్రమం సమీక్షలో కలెక్టర్లు, జేసీలను ముఖ్యమంత్రి ఆదేశించారు. 

మరిన్ని వార్తలు