కిలకిలారావాలు పెరిగాయి !

25 Apr, 2021 03:42 IST|Sakshi
చిన్న పసిరిక , నల్ల ఏట్రింత , నల్లంచి పిట్ట

సంతృప్తికరంగా పక్షుల వైవిధ్యం 

దేశంలో 965.. రాష్ట్రంలో 295 పక్షి జాతుల నమోదు 

ఉనికిలో ఉన్న జాతులలో.. దేశంలో 72 శాతం, రాష్ట్రంలో 60 శాతం రికార్డు

గ్రేట్‌ బ్యాక్‌ యార్డ్‌ బర్డ్‌ కౌంట్‌ సర్వే నివేదికలో వెల్లడి 

సర్వేలో భారత్‌కు రెండో స్థానం 

గతేడాది కంటే ఈ ఏడాది ఎక్కువ జాతులు నమోదు

సాక్షి, అమరావతి: జీవవైవిధ్యానికి ప్రతీకలుగా భావించే పక్షుల ఉనికి దేశంలో సంతృప్తికరంగా ఉంది. అక్కడక్కడా కొన్ని ప్రాంతాలు మినహా ఎక్కువ చోట్ల పక్షుల వైవిధ్యం బాగానే ఉన్నట్లు వెల్లడైంది. సాధారణంగా కనిపించే గోరింక, కాకి వంటి వాటితోపాటు కొన్నిచోట్ల అరుదైన పక్షులు కూడా కనిపిస్తున్నాయి. ప్రపంచంలోని పక్షి ప్రేమికులంతా కలిసి నిర్వహించే గ్రేట్‌ బ్యాక్‌ యార్డ్‌ బర్డ్‌ కౌంట్‌ (పక్షుల సందర్శన) సర్వేలో ఈ అంశం స్పష్టమైంది. ఈ ఏడాది ఫిబ్రవరి 12–15 తేదీల్లో ఈ సర్వే జరిగింది. మన దేశంలో బర్డ్‌ కౌంట్‌ ఆఫ్‌ ఇండియా పోర్టల్, మన రాష్ట్రంలో తిరుపతి ఐఐఎస్‌ఈఆర్‌ (ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌) ఈ సర్వేను సమన్వయం చేశాయి. సర్వే నివేదికను ఇటీవలే బర్డ్‌ కౌంట్‌ ఇండియా పోర్టల్‌ విడుదల చేసింది.
బర్డ్‌ కౌంట్‌ సర్వేలో పక్షులను రికార్డు చేస్తున్న బర్డ్‌ వాచర్లు 
 
2,954 బర్డ్‌ వాచర్లు.. 17 వేల గంటలు  
దేశంలో 965 రకాల పక్షి జాతులను ఈ సర్వేలో రికార్డు చేశారు. దేశంలో ఉన్న మొత్తం పక్షి జాతుల్లో ఇవి 72 శాతం. 2,954 బర్డ్‌ వాచర్లు 17 వేల గంటలు పరిశీలించి వీటిని రికార్డు చేశారు. రికార్డు చేసిన పక్షి జాతుల సంఖ్య ప్రకారం ఈ సర్వేలో ఈ సారి ఇండియా రెండో స్థానంలో నిలిచింది. 1,189 పక్షి జాతుల్ని రికార్డు చేసి కొలంబియా మొదటి స్థానంలో నిలిచింది. 2020 సంవత్సరంలో జరిగిన సర్వేలో ఇండియా నాలుగో స్థానంలో ఉంది. గతం కంటె ఈ సారి ఎక్కువ సంఖ్యలో బర్డ్‌ వాచర్స్‌ పాల్గొనడంతో ఎక్కువ జాతులు రికార్డయ్యాయి.

దేశంలో ఉత్తరాఖండ్‌లో అత్యధికంగా 426 పక్షి జాతులు, పశ్చిమ బెంగాల్‌లో 401, కర్నాటకలో 366 జాతుల్ని ఈ సర్వేలో రికార్డు చేశారు.
మన రాష్ట్రంలో 57 మంది బర్డ్‌ వాచర్లు 295 పక్షి జాతుల్ని రికార్డు చేశారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం పక్షి జాతుల్లో ఇవి 60 శాతం. గత సంవత్సరం జరిగిన సర్వేలో 279 పక్షి జాతుల్ని కనుగొన్నారు. ఈ సారి మన రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో ఎక్కువగా 180 జాతులు రికార్డయ్యాయి. తర్వాతి స్థానాల్లో తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాలు ఉన్నాయి. చిత్తూరు జిల్లా నుంచి ఎక్కువ మంది బర్డ్‌ వాచర్స్‌ పాల్గొన్నారు. ఈ సారి ఐఐటీ తిరుపతి, ఎస్వీయూ, ఆంధ్రా యూనివర్సిటీ వంటి 13 విద్యా సంస్థలు కూడా సర్వేలో పాల్గొన్నాయి. 

కర్నూలులో అరుదైన పక్షి జాతులు 
ఈ సారి సర్వేలో కర్నూలు జిల్లాలో రెండు అరుదైన పక్షి జాతులు నమోదు కావడం విశేషం. ప్రపంచంలో అత్యధిక ఎత్తులో ఎగిరే తెల్ల పెద్ద బాతుతో పాటు మంగోలియా, సైబీరియా నుంచి వచ్చే పొట్టి చెవుల గుడ్ల గూబను కర్నూలులో రికార్డు చేశారు. ఇక, రాష్ట్రంలో సాధారణంగా కనిపించే కాకి, సంటి కొంగ, గోరింక, నల్ల ఏట్రింత, నల్ల కాకి, చిలుక, పావురం, నల్ల గద్ద, పికిలి పిట్టలే సర్వేలో ఎక్కువగా నమోదయ్యాయి. దేశంలోని దక్షిణాది ప్రాంతమంతటా కాకి, గోరింక, నల్ల ఏట్రింత పక్షులు ఎక్కువగా కనిపించాయి. అద్భుతంగా శబ్దాలు చేసే ఈల గంటె పిట్టను కూడా ఈ సర్వేలో నమోదు చేశారు. 

పర్యావరణ మార్పుల్ని మొదట గుర్తించేది పక్షులే 
జీవ వైవిధ్యం ఎలా ఉందో తెలుసుకోవడంలో పక్షులు కీలకం. పర్యావరణంలో జరిగే మార్పుల్ని మొదట గుర్తించేది అవే. బర్డ్‌ వాచింగ్‌ వల్ల మన పర్యావరణం, వాతావరణ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది. అలాగే ఎన్ని జాతుల పక్షులున్నాయో తెలుస్తుంది. బర్డ్‌ వాచింగ్‌ కమ్యూనిటీలు పెద్దఎత్తున ఏర్పడి సర్వే చేస్తే పూర్తి స్థాయిలో వాస్తవ పరిస్థితి తెలుసుకునే అవకాశం ఉంటుంది.  
– బండి రాజశేఖర్, సిటిజన్‌ సైన్స్‌ కోఆర్డినేటర్, ఐఐఎస్‌ఈఆర్‌  

మరిన్ని వార్తలు