జేఎన్‌టీయూ(ఏ) పరిధిలో కొత్తగా 3 కళాశాలలు

19 May, 2023 04:55 IST|Sakshi

రెండు ఇంజినీరింగ్‌ కాలేజీలు, ఒక ఫార్మసీ కళాశాల 

విద్యార్థుల నమోదు శాతంతో సంబంధం లేకుండా నూతన కోర్సులకు అనుమతి  

బీఈ, బీటెక్‌లలో గరిష్ట సీట్ల సంఖ్య 300 నుంచి 360కి పెంపు 

ఇక నుంచి కంప్యూటర్‌ సైన్సెస్‌ కోర్సులు సైతం కోర్‌ బ్రాంచ్‌లుగా పరిగణింపు

అనంతపురం: జేఎన్‌టీయూ (ఏ) పరిధిలో నూతనంగా రెండు ఇంజినీరింగ్‌ కళాశాలలు, ఒక ఫార్మసీ కళాశాల మంజూరయ్యాయి. చిత్తూరు, రాయచోటిలో ఒక్కొక్క ఇంజినీరింగ్‌ కళాశాల, నెల్లూరులో ఒక ఫార్మసీ కళాశాల ఏర్పాటు కానున్నాయి. ఆలిండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ (ఏఐసీటీఈ) 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. నూతన జాతీయ విద్యావిధానం–2020ని దృష్టిలో ఉంచుకుని అనుమతుల ప్రక్రియలో వెసులుబాటుతోపాటు కొన్ని మార్పులు చేసింది.

ప్రొఫెషనల్‌ కోర్సులపై ఉన్న మారిటోరియాన్ని ఎత్తేసింది. దీంతో కొత్తగా ఇంజినీరింగ్‌ కళాశాలలు, సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో జేఎన్‌టీయూ(ఏ) పరిధిలో రెండు ఇంజినీరింగ్, ఒక ఫార్మసీ కళాశాల మంజూరయ్యాయి. ఇప్పటికే జేఎన్‌టీయూ(ఏ) పరిధిలో 98 అనుబంధ ఇంజినీరింగ్‌ కళాశాలలుండగా.. తాజాగా ఆ సంఖ్య 100కు చేరింది. ఫార్మసీ కళాశాలల సంఖ్య కూడా 34కు చేరింది. ఏఐసీటీఈ తాజా నిర్ణయం మేరకు బీటెక్‌ కోర్సుల్లో బీఈ, బీటెక్‌ గరిష్ట సీట్ల సంఖ్యను 300 నుంచి 360కి పెంచారు.

నూతన నిబంధనల ప్రకారం కంప్యూటర్‌ అప్లికేషన్‌ ప్రోగ్రామ్‌లలో ఇన్‌టేక్‌ను 180 నుంచి 300 వరకు పెంచుకునే అవకాశం కల్పించారు. తక్కిన 60 సీట్లు.. 30 సీట్లు చొప్పున సివిల్, మెకానికల్‌ వంటి కోర్‌ గ్రూప్‌లలో భర్తీ చేసుకోవచ్చు. కంప్యూటర్‌ సైన్సెస్‌ ప్రోగ్రామ్‌ను సైతం తాజాగా కోర్‌ గ్రూప్‌గా పరిగణించారు. విద్యార్థుల నమోదు శాతంతో సంబంధం లేకుండా అభివృద్ధి చెందుతున్న విభాగాలలో నూతన కోర్సులను ప్రారంభించేందుకు అనుమతించనున్నారు.  

యూసీఎస్‌ బకాయిలు చెల్లిస్తేనే ఎన్‌వోసీ  
వర్సిటీకి చెల్లించాల్సిన యూనివర్సిటీ కామన్‌ సర్విసెస్‌ (యూసీఎస్‌) ఫీజుల బకాయిలు చెల్లిస్తేనే నో అబ్జెక్షన్‌ సర్టీఫికెట్‌ (ఎన్‌వోసీ) జారీచేస్తామని జేఎన్‌టీయూ (ఏ) ఉన్నతాధికారులు గతంలో స్పష్టం చేశారు.

వర్సిటీ ఆయా ఇంజినీరింగ్‌ కళాశాలలకు ఎన్‌వోసీ జారీచేస్తేనే ఏఐసీటీఈ 2023–24 విద్యా సంవత్సరానికి గుర్తింపు ఇస్తుంది. ఈ నేపథ్యంలో జేఎన్‌టీయూ(ఏ) ఎన్‌వోసీ జారీకి యూసీఎస్‌ బకాయిలతో ముడిపెట్టింది. వర్సిటీ పరిధిలోని 98 ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఇప్పటికే 88 కాలేజీలు యూసీఎస్‌ బకాయిలు చెల్లించాయి. 10 ఇంజినీరింగ్‌ కళాశాలలు రూ.1.50 కోట్ల బకాయిలున్నాయి. వీటికి కూడా బకాయిలు చెల్లిస్తేనే ఎన్‌వోసీ ఇవ్వాలని వర్సిటీ అధికారులు నిర్ణయించారు.  

పోర్టల్‌లో వివరాలు  
ఏఐసీటీఈ నుంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయా ఇంజినీరింగ్‌ కళాశాలలు వర్సిటీ అనుబంధ హోదాకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. కళాశాలకు సంబంధించిన వివరాలన్నీ పోర్టల్‌లో నమోదు చేస్తారు. వాటి ఆధారంగా వర్సిటీ నిజనిర్ధారణ కమిటీలను నియమిస్తుంది. కమిటీ నివేదిక ఆధారంగానే ఆయా ఇంజినీరింగ్‌ కళాశాలలకు ఎన్ని సీట్లు కేటాయించాలనే అంశంపై స్పష్టత రానుంది. ప్రస్తుతం ఏపీ ఈఏపీసెట్‌ జరుగుతోంది. పరీక్ష పూర్తయి ర్యాంకులు ప్రకటించి కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ వచ్చేలోపు సీట్ల కేటాయింపు పూర్తికావాల్సి ఉంది.

అన్ని వసతులు ఉన్న కళాశాలలకే గుర్తింపు 
బోధన ప్రమాణాలు, మౌలిక వసతులు, అనుభవజు్ఞలైన ఫ్యాకల్టీ ఉన్న కళాశాలకే అనుబంధ గుర్తింపు జారీచేస్తాం. నిబంధనలకు లోబడి ఇంజినీరింగ్‌ సీట్లు కేటాయిస్తాం. గత ఐదేళ్ల పురోగతి, క్యాంపస్‌ ఇంటర్వ్యూల్లో కొలువులు తదితర అంశాలను బేరీజు వేసి కళాశాల స్థితిగతులను అంచనావేస్తాం. అన్ని రకాల సదుపాయాలున్న ఆయా ఇంజినీరింగ్‌ కళాశాలలనే పరిగణనలోకి తీసుకుంటాం.      – ప్రొఫెసర్‌ జింకా రంగజనార్ధన, వీసీ, జేఎన్‌టీయూ అనంతపురం  

మరిన్ని వార్తలు