జగనన్న ప్రభుత్వం @3 ఏళ్లు: ఊరూవాడా ‘మూడేళ్ల’ పండుగ

31 May, 2022 03:54 IST|Sakshi
విశాఖలోని 39వ వార్డులో సీఎం వైఎస్‌ జగన్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న మహిళలు

వైఎస్‌ జగన్‌ మూడు సంవత్సరాల పాలన పూర్తితో రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు

వైఎస్సార్‌సీపీ పతాకాలు ఆవిష్కరించి.. కేక్‌ కట్‌చేసిన నేతలు, శ్రేణులు

భారీ ఎత్తున అన్నదానం, దుస్తుల పంపిణీ

సాక్షి, అమరావతి/నెట్‌వర్క్‌: ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా వేడుకలు జరిగాయి. డిప్యూటీ సీఎంలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఊరూవాడా మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించి.. వైఎస్సార్‌సీపీ పతాకాలను ఆవిష్కరించారు. బైక్‌ ర్యాలీలు నిర్వహించారు. మూడేళ్లలో సీఎం వైఎస్‌ జగన్‌ సాధించిన విజయాలను చాటిచెబుతూ సభలు నిర్వహించారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 95 శాతాన్ని మూడేళ్లలోనే సీఎం వైఎస్‌ జగన్‌ అమలుచేయడాన్ని ప్రజలకు వివరించారు. కరోనా ప్రతికూల పరిస్థితులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నా సంక్షేమ పథకాల ద్వారా పేదల ఖాతాల్లోకి రూ.1.41 లక్షల కోట్లు జమచేసి వారికి బాసటగా నిలవడాన్ని గుర్తుచేశారు. గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ.. జిల్లాల పునర్వ్యవస్థీకరణ ద్వారా కొత్త జిల్లాలు ఏర్పాటుచేసి సంస్కరణల ద్వారా సుపరిపాలన అందిస్తున్నారని నేతలు వివరించారు.

మంత్రివర్గం నుంచి స్థానిక సంస్థల వరకూ 70 శాతం పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చి సామాజిక న్యాయమంటే ఇదీ అని దేశానికి చాటిచెప్పారని గుర్తుచేశారు. వైఎస్సార్‌సీపీ నిర్వహించిన బైక్‌ ర్యాలీలు, సభలకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. సభల అనంతరం పేదలకు భారీ ఎత్తున వస్త్రాలను పంపిణీ చేశారు. అన్నదానం చేశారు. దాంతో ఊరువాడ పండగ వాతావరణం నెలకొంది. 

గన్నవరం ఎయిర్‌ పోర్ట్‌లో కేక్‌ కట్‌ చేస్తున్న మంత్రులు జోగి, వనిత, ఆదిమూలపు, మేరుగ

విమానాశ్రయంలో మంత్రుల కేక్‌ కటింగ్‌
ఇక సామాజిక న్యాయభేరి బస్సుయాత్రలో పాల్గొన్న మంత్రులు తానేటి వనిత, జోగి రమేష్, ఆదిమూలపు సురేష్, మేరుగ నాగార్జున సోమవారం బెంగళూరు నుంచి విమానంలో విజయవాడ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ పార్టీ శ్రేణులు ఏర్పాటుచేసిన కేక్‌ను మంత్రులు కట్‌ చేశారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయని వారు ఈ సందర్భంగా తెలిపారు.

చంద్రబాబుకు 2024 ఎన్నికలే ఆఖరు : పెద్దిరెడ్డి
టీడీపీ అధినేత చంద్రబాబుకు 2024 ఎన్నికలే ఆఖరని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. సీఎం వైఎస్‌ జగన్‌ మూడేళ్లు పాలన పూర్తిచేసిన నేపథ్యంలో తిరుపతిలోని తన కార్యాలయం వద్ద ఆయన సంబరాలు నిర్వహించారు. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి నివాళుర్పించారు. పార్టీ జెండా ఆవిష్కరించి కేక్‌ కట్‌ చేశారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ.. మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీల్లో ఇప్పటికే 96 శాతం పూర్తిచేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. 2024 ఎన్నికల్లో గతంలో కంటే అధిక సీట్లు సాధిస్తామన్నారు. మహానాడులో కొందరు టీడీపీ నేతలు ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా సీఎం జగన్‌ను వాడు, వీడు, ఒరేయ్‌ అంటూ సంబోధించారన్నారు.  

మరిన్ని వార్తలు