జగనన్న మూడేళ్ల పాలన: పేదలకు ‘చేయూత’.. సంక్షేమ ‘బావుటా’

30 May, 2022 16:07 IST|Sakshi

వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసి మూడేళ్లవుతోంది.. మనది హామీలను నెరవేర్చే ప్రభుత్వమని ప్రమాణ స్వీకారం రోజు చెప్పిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌.. ఈ మూడేళ్లలో 95 శాతం హామీలను నెరవేర్చి తనది ప్రజా ప్రభుత్వమని చాటారు. పాదయాత్ర అనుభవాలే పునాదిగా, ప్రజల ఆశలు ఆకాంక్షల్ని నెరవేర్చడమే లక్ష్యంగా మేనిఫెస్టోను రూపొందించిన వైఎస్ జగన్.. దాన్ని అమలు చేయాలనే దృఢ సంకల్పంతో పక్కాగా అడుగులు వేశారు. దాంతో ఆయా పథకాలు అందుకుంటున్న లబ్ధిదారుల్లో సంతోషం కనిపిస్తోంది. వారి జీవితాల్లో మార్పులు కనిపిస్తున్నాయి. ప్రభుత్వమందించే  ప్రతి రూపాయిని సద్వినియోగం చేసుకుంటున్న ప్రజలు గతానికి ఇప్పటికి వున్న తేడాను స్పష్టంగా చెబుతున్నారు.
చదవండి: మూడేళ్ల సుపరిపాలనకు సాక్ష్యాలెన్నో!

పేద కుటుంబాలను పేదరికాన్నించి బైట పడేయాలనేది అసలైన లక్ష్యం.. అందుకోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనేక పథకాలను రూపొందించి అమల్లోకి తీసుకొచ్చారు. దాదాపుగా ఈ పథకాలన్నీ ప్రజాసంకల్ప పాదయాత్ర అనుభవాలతో రూపొందినవే.. వాటిలో చేయూత, కాపునేస్తం, ఈబీసీ నేస్తం పథకాలున్నాయి. నలభై ఐదునుంచి అరవై సంవత్సరాల మధ్య వయస్సున్న మహిళలకు ప్రతి ఏడాది ఆర్థిక సాయం చేస్తే వారు ఆ డబ్బుతో కుటుంబ ఆదాయాలను పెంచుకుంటారని తద్వారా వారు పేదరికాన్నించి బైటపడాలని ఈ పథకాలను తయారు చేశారు.

కాకినాడ రూరల్ తిమ్మాపురంలో చెరుకు రసం విక్రయిస్తు కుటుంబాన్ని నడిపిస్తోంది అనసూరి వెంకటలక్ష్మీ. వెంకటలక్ష్మీ, అప్పారావు దంపతులకు నలుగురు పిల్లలున్నప్పటికీ వారు ఉపాధి కోసం ఇతర ఊళ్ళకు వెళ్లిపోయారు. కరోనా లాక్ డౌన్ కారణంగా చాలా కష్టాలు పడ్డామని అలాంటి పరిస్థితుల్లో చేయూత పథకం ఆదుకున్నదని వీరు అంటున్నారు. చేయూత ద్వారా ప్రతి సంవత్సరం అందుతున్న 18,750 రూపాయలతో వీరు ఈ చిరు వ్యాపారం చేసుకుంటున్నారు.

వెంకటలక్ష్మి దంపతులకు సొంత ఇళ్లు లేదు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు వీరికి ఇళ్ల స్థలం లభించేలా చూశారు. చేయూతతోపాటు పలు పథకాలు వెంకటలక్ష్మి అప్పారావులాంటివారికి అందుబాటులోకి వచ్చి వీరి కష్టాలను తీరుస్తున్నాయి. నలభై ఐదు సంవత్సరాలు దాటిన పేద కుటుంబాల మహిళలకు ఆర్థిక భరోసా లభిస్తే వారు నిలదొక్కుకుంటారనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచన. అందుకోసం తయారు చేసిన పథకాలే చేయూత, కాపునేస్తం, ఈబీసీ నేస్తం. వీటిలో చేయూతను ఉపయోగించుకున్నవారిలో కాకినాడ జిల్లా గైగోలపాడుకు చెందిన మల్లేశ్వరి కూడా వున్నారు. ఈమె భర్త చాలా కాలం క్రితమే చనిపోయారు. నలుగురు పిల్లలుంటే వారికి వివాహాలైపోయి ఇతర ప్రాంతాల్లో సెటిలైపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో చేయూత పథకం ద్వారా లభిస్తున్న డబ్బుతో పచ్చళ్ల వ్యాపారం చేసి కొంతమేరకు ఆదాయం పొందుతున్నట్టు మల్లేశ్వరి అంటున్నారు.
చదవండి: మూడేళ్లు.. ఎన్నో మేళ్లు

బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు చెందిన పేద మహిళలకు చేయూత ఉపయోగపడుతోంది. అయితే అదే సమయంలో అగ్రవర్ణ పేద కుటుంబాల మాటేమిటి? వారిని కూడా ఆదుకోవాలంటే ఏం చేయాలి? అనే ప్రశ్నలు తలెత్తాయి.. దీనికి సమాధానంగా కాపునేస్తం, ఈబీసీ నేస్తం పథకాలను తీసుకొచ్చారు.. వీటిలో కాపునేస్తాన్ని ఉపయోగించుకొని కొంతమేరకు ఉపశమనం పొందిన వారిలో జగత జ్యోతి వున్నారు. ఈమె రెండు దశాబ్దాల క్రితమే భర్తను కోల్పోయారు. ఒక కుమార్తె వుంటే ఆమెకు వివాహమై వెళ్లిపోయిందని.. తాను మాత్రం నాలుగైదు ఇళ్లలో ఇంటి పనులు చేసుకొని బతుకుతున్నానని జ్యోతి చెబుతున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన ఈమె కాపులు పేరుకే అగ్రవర్ణమని కాపుల్లో తనలాంటి పేదలు చాలా మంది వున్నారని అంటున్నారు.

అగ్రవర్ణాల పేద కుటుంబాల్లో కాపులనే కాకుండా ఇతర అగ్రవర్ణాల పేద కుటుంబాలను ఆదుకోవడానికి ఈబీసీ నేస్తం రూపొందించి అమల్లోకి తెచ్చారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందినవారిలో మనం చూస్తున్న ఈ బ్రాహ్మణ కులానికి చెందిని శివరామజోగి శర్మ దంపతులున్నారు. కాకినాడ గైగోలపాడుకు చెందిన శివరామజోగిశర్మ డ్రైవర్‌గా పని చేస్తున్నారు. కరోనా సమయంలో ఆర్థికంగా చితికిపోయామని ఈ మధ్యనే ఈబీసీ పథకం అందిందని వీరు చెబుతున్నారు.

చేయూత, కాపునేస్తం, ఈబీసీ నేస్తం...ఈ మూడు పథకాలు నలభై ఐదునుంచి అరవై సంవత్సరాల మధ్యన వయస్సున్న పేద కుటుంబాల మహిళలకు వర్తించే పథకాలు. అరవై సంవత్సరాలు దాటిన మహిళలకు పింఛను వస్తుంది కాబట్టి అంతకంటే తక్కువ వయస్సు వున్న పేద కుటుంబాల మహిళల్ని ఆదుకుంటే అది వారి కుటుంబాల కష్టాలను తగ్గించడానికి ఉపయోగపడుతుందనేది వైఎస్ జగన్ ఆలోచన. పాదయాత్రలో ఆయనకు వచ్చిన ఈ ఆలోచన మూడు మానవీయ పథకాలుగా రూపొంది ఈ మహిళలకు ఆర్థిక భరోసా అందిస్తోంది.

ఏలూరు నగర పాలక సంస్థ పరిధిలోని శనగపప్పు బజార్‌లో దాసరి కిషోర్.. కుటుంబం నివసిస్తోంది. భార్య సత్య భారతి గృహిణి.. వీరికి పూజిత అనే కూతురు.. గతంలో లారీ యజమాని అయిన దాసరి కిషోర్ వ్యాపారంలో నష్టం రావడంతో దానిని అమ్మేసి ఆటో కొనుక్కున్నారు. ప్రతి రోజూ ఆటోను నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. దాసరి కిషోర్ కుటుంబానికి మొత్తం నాలుగు పథకాలు అందుతున్నాయి. తనకు వాహనమిత్ర, కూతురుకు అమ్మ ఒడి, తండ్రికి వైఎస్సార్ పింఛన్ కానుక, భార్యకు కాపునేస్తం పథకాలు వస్తున్నాయని.. ఇలా అందించే ప్రభుత్వం లభించడం సంతోషంగా వుందని అంటున్నాడు. కరోనా మహమ్మారితో దాదాపు రెండు సంవత్సరాలపాటు భారతదేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో కూడా పథకాలను అమలు చేసిన ఘనత వైఎస్ జగన్ ప్రభుత్వానికే దక్కుతుందని దాసరి కిషోర్ స్పందిస్తున్నారు.

అర్హత వుంటే చాలు పథకాలు అందించాలనేది ప్రభుత్వ సంకల్పం. అంతే తప్ప ఒక కుటుంబానికి ఒక పథకం అందిస్తే సరిపోతుందిలే అని చేతులు దులుపుకోవడం లేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న ఈ విధానపరమైన నిర్ణయం కారణంగానే రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది సామాన్య కుటుంబాలు తగిన విధంగా ఆర్ధిక అండదండలు పొందుతున్నాయి.

ఇక ఇదే ఏలూరులో మరో ఆటో డ్రైవర్ కుటుంబాన్ని సాక్షి టీవీ పలకరించింది.. ఈమె చిన్నప్పుడే తండ్రిని కోల్పోయింది. అన్నయ్య దివ్యాంగుడు.. తల్లికేమో వయస్సు మీద పడి తన పని చేసుకుంటే చాలు అన్నట్టుగా వున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో.. ఈ కష్టాలను తలుచుకొని ఈమె కన్నీళ్లు పెట్టుకొని కుంగిపోలేదు. జీవితం.. తాను అనుకున్నట్టుగా, ఆశించినట్టుగా లేదని  అదే పనిగా ఆందోళన చెందలేదు. కష్టమైన పనయినా సరే ఎలాంటి అదురు బెదురు లేకుండా ఆటో డ్రైవర్ పని చేపట్టింది. ఏలూరు నగరంలోని 43వ డివిజన్‌ ఏకే సెంటర్లో ఆటో డ్రైవర్ ఊట అంబిక కుటుంబం నివసిస్తోంది. అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డ ఆటో డ్రైవర్ గా మారి ఇంటికి అండగా నిలిచింది.. ఈ  పని కష్టమైనదైనప్పటికీ... తప్పనిసరి పరిస్థితుల్లో తన బిడ్డ ఈ పని చేస్తోందని..డిగ్రవీరకూ చదువుకుంది కాబట్టి ఏదైనా ఉద్యోగం వస్తే బాగుంటుందని ఈ పెద్దామె భావిస్తోంది. ప్రస్తుతం అంబికకు వాహనమిత్ర పథకం, అంబిక తల్లి ఊట నూకరత్నానికి వృద్ధాప్య పింఛన్‌, అంబిక అన్నయ్యకు దివ్యాంగుల పింఛన్‌ పథకాలు అందుతున్నాయి

ఇలాంటి లక్షలాది మంది ఆటో డ్రైవర్లందరిదీ దాదాపుగా ఒకటే పరిస్థితి...బండి తిరిగితేనే బతుకు బండి నడుస్తుంది. ఆటో మీటరు తిరిగితేనే...ఇంటిల్లిపాదీ భోజనం చేయగలుగుతారు. రాష్ట్ర వ్యాప్తంగా వున్న ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌ డ్రైవర్ల గాధలగురించి పాదయాత్రలో తెలుసుకున్న వైఎస్ జగన్ అదే సమయంలోనే వాహనమిత్ర పథకాన్ని ప్రకటించారు. వైఎస్సార్ సీపీ పాలన వచ్చిన తర్వాత ఆటో , ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌ డ్రైవర్లకు అండగా వుంటానని భరోసానిచ్చారు. అలా చెప్పిన మాటకు కట్టుబడి తన పాలన ప్రారంభమైన తర్వాత వాహన మిత్ర పథకాన్ని అమలు చేస్తూ ఈ సామాన్య కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. 

మరిన్ని వార్తలు