చదువుల విప్లవం.. విద్యా రంగంలో ఏపీ ఆదర్శం..

26 May, 2022 21:02 IST|Sakshi

ఎంత ఖర్చయినా సరే మీరు చదువుకోండి.. మీ చదువులకయ్యే ఖర్చు ప్రభుత్వానికి వదిలేయండి.. ఆర్థిక పరిస్థితులు సహకరించడం లేదని ఏనాడూ చింతించవద్దు.. మీ చదువుకు నాదీ గ్యారంటీ.. ఇవీ మొదటి నుంచీ విద్యార్థులను ఉద్దేశించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేస్తున్న ప్రకటనలు.. రాష్ట్రంలో చదువుల విప్లవం కోసం ఆయన ఎంతగానో తపిస్తున్నారు. లక్షలాది మంది విద్యార్థుల కోసం చేస్తున్న వేలాది కోట్ల రూపాయల ఖర్చు రాష్ట్ర బంగారు భవిష్యత్తుకే అనేది ఆయన ప్రగాఢమైన నమ్మకం.. ఈ నేపథ్యంలో ప్రారంభించిన అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా కానుక, మన బడి-నాడు నేడు, గోరు ముద్ద, వైఎస్సార్ పోషణ మొదలైన పథకాలు, కార్యక్రమాలు విద్యారంగంలో సమూల మార్పులకు కారణమవుతున్నాయి.
చదవండి: అవధులు లేని సంతోషం.. సీఎం జగన్‌ మేలు మరిచిపోలేం..

రాజమండ్రి తాడితోట ప్రాంతం చిన్న ఇంట్లో పార్వతి కుటుంబం నివసిస్తోంది. ఈమె ఇస్త్రీ పని చేసుకుంటూ ఇద్దరు పిల్లల్ని చదివిస్తోంది. నాలుగేళ్ల క్రితం భర్త చనిపోయాడు.. మొత్తం కుటుంబ భారం తన మీద పడడంతో ఏం చేయాలో దిక్కు తెలియని పరిస్థితి వుండేది. పిల్లల చదువులు ఎలా అని పార్వతి చింతిస్తున్న సమయంలో వైఎస్ జగన్ ప్రభుత్వ పాలన ప్రారంభమైంది. విద్యారంగ పథకాలు ఒక్కటొక్కటిగా అందుబాటులోకి వచ్చాయి.

విద్యారంగ పథకాలు ముఖ్యంగా అమ్మఒడి వీరికి అండగా నిలిచింది. పిల్లలను బడికి పంపే ప్రతి పేదతల్లికి ఏటా రూ. 15 వేల రూపాయలు ఇస్తానని  ఎన్నికలకు ముందు చెప్పిన వైఎస్ జగన్.. తన మాట నిలబెట్టుకున్నాడు. అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభించి పాఠశాల విద్యార్థులకేకాకుండా ఇంటర్‌ దాకా ఈ పథకాన్ని విస్తరించి ప్రతి ఏటా ఆర్థిక సాయం అందిస్తున్నారు. తండ్రి చనిపోయిన సమయంలో తల్లి నిస్సహాయంగా నిలిచిపోయిన కష్టకాలంలో మనం చూస్తున్న ఈ భువనేశ్వర్‌ అనే కుర్రాడికి అమ్మ ఒడి పథకం ఒక వెలుగు దివ్వెలాగా  అవతరించింది. ఆర్థిక కష్టాలు భరించలేక, ఎంతో కొంత ఆదాయం వస్తుంది కదా అని పిల్లల్ని బడికి పంపకుండా పనులకు పంపే తల్లిదండ్రుల్లో మార్పు వచ్చిందనడానికి ఈ కుర్రాడే నిదర్శనం. పార్వతి కుమారుడు భువనేశ్వర్‌ చదువు మధ్యలో ఆగిపోలేదు.

ఇరుకు గదుల్లో ఇబ్బందులు పడుతూ రేపటి బంగారు భవిష్యత్తు కోసం అలుపెరగని శ్రమ చేస్తున్న సామాన్య సాధారణ కుటుంబాల్లో విద్యా వెలుగులు విస్తరిస్తున్నాయి. దీనికి నిదర్శనమే రాజమండ్రి నగరంలో నివసిస్తోన్న ఈ కుటుంబం. ఈమె పేరు రామలక్ష్మి. ఈమె టైలర్‌ పని ద్వారా, ఈమె భర్త కూలీ పని ద్వారా ఉపాధి పొందుతున్నారు. రామలక్ష్మి దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు. ఇద్దరినీ చదివించడం కష్టమే అని గతంలో భావించిన రామలక్ష్మి ప్రస్తుతం ఇద్దరినీ చక్కగా చదివిస్తున్నారు.

చిన్న చిన్న వృత్తులను నమ్ముకొని బతుకు పోరాటం చేస్తున్న లక్షలాది కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు అండగా నిలుస్తున్నాయి. విద్యారంగ పథకాల కారణంగా సామాన్య పేద కుటుంబాల తల్లిదండ్రులు చదువులపట్ల మొగ్గు చూపుతున్నారు. దాంతో రాష్ట్రంలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మధ్యలోనే చదువులు మానేసేవారి సంఖ్య తగ్గిపోయి అదే సమయంలో చదువుల బాట పట్టిన వారి సంఖ్య పెరుగుతోంది. ఇది మన కళ్ల ముందే కనిపిస్తున్న మార్పు..

అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, విద్యా కానుక, మన బడి నాడు-నేడు, గోరుముద్ద, వైఎస్సార్ పోషణ, విదేశీ విద్యాదీవెన.. ఇవీ ఆంధ్రప్రదేశ్‌ విద్యారంగంలో అమలవుతున్న విశిష్ట పథకాలు.. ఒక్కొక్కటి ఒక్కో వైవిధ్యతతో రూపొంది విద్యార్థులకు అండగా నిలుస్తున్నాయి. ప్రతి పథకం విషయంలో ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచనల ప్రకారం అమలు చేస్తున్నారు. మనం మన పిల్లలకు ఇచ్చే అసలు సిసలైన ఆస్తి చదువే అనేది వైఎస్ జగన్ సందర్భం వచ్చినప్పుడల్లా చెబుతున్న మాట.. దానికి అనుగుణంగానే రాష్ట్రమంతా పలు విద్యారంగ పథకాలు అమలువుతున్నాయి.

ఇక్కడ ఇంటి పనులు చేస్తూ, తల్లికి చేదోడు వాదోడుగా వున్న ఈ అమ్మాయి పేరు సబ్బెళ్ల లక్ష్మీ.. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం గ్రామానికి చెందిన లక్ష్మీ ప్రస్తుతం బిటెక్‌ ఆఖరి సంవత్సరం పూర్తి చేసే పనిలో వుంది. తమ్ముడితో కలిసి విశాఖపట్టణంలోని ప్రైవేటు కాలేజీలో చదువుకుంటున్న ఈ అమ్మాయి చదువు పూర్తి కాకముందే ప్రముఖ కార్పొరేట్ సంస్థలో ఉద్యోగం సంపాదించుకుంది. వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు ఆదుకున్నాయని, కరోనా కారణంగా ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్న సమయంలో ఈ రెండు పథకాలు అండగా నిలిచాయని ఈ అమ్మాయి అంటోంది.

విద్యాదీవెన అంటే విద్యార్థులకు పూర్తి ఫీజులు చెల్లించే పథకం.. గతంలో చంద్రబాబు ప్రభుత్వం అరకొర ఫీజులు చెల్లిస్తే.. వైఎస్ జగన్ ప్రభుత్వం ఎంత ఫీజుంటే అంత ఫీజూ ఇస్తోంది.. ఇది ఈ పథకంలో ప్రత్యేకత. ఇక అంతటితో ఆగిపోకుండా వసతి దీవెన అనే మరో పథకాన్ని కూడా వైఎస్ జగన్‌ ప్రవేశపెట్టారు. ఊరుగాని ఊరిలో తల్లిదండ్రులకు దూరంగా హాస్టళ్లలో వుండి చదువుకునే పిల్లలకు అక్కడ వారి ఖర్చులకోసం ప్రతి ఏడాది ఇరవై వేల రూపాయలవరకు అందిస్తున్నారు. దాంతో విద్యార్థుల తల్లిదండ్రులపై హాస్టల్‌, మెస్‌  భారం తొలగిపోతోంది.

తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం కొమరిపాలెం గ్రామానికి చెందిన వీర వెంకట సత్యనారాయణ స్థానికంగా కిరాణా షాపు నడుపుకుంటున్నారు. ఈయనకు ఇద్దరు మగపిల్లలు. ఇద్దరిలో ఒకరు బిటెక్ చదువుతుండగా మరొకరు బీసీఏ చదువుతున్నారు. పిల్లలు తెలివైనవారు..లక్షలాది రూపాయలు ఖర్చు చేసి వారిని ప్రొఫెషనల్ కోర్సులు చదివించడం కష్టమే అని ఈయన అనుకుంటున్న సమయంలో ప్రభుత్వ విద్యారంగ పథకాలు చక్కగా అందుబాటులోకి వచ్చాయి.

రాజమండ్రిలో ఓ హాస్టల్లో వుంటూ చదువుకుంటున్న సత్యనారాయణ చిన్న కుమారుడు విఘ్నేష్‌ సెలవుల్లో ఇంటికి వచ్చినప్పుడు సాక్షి పలకరించింది. తన తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ప్రభుత్వం ఆదుకుంటోందని విద్యాదీవెన వసతి దీవెన పథకాలు తమకు అందుతున్నాయన్నారు.

ఎన్నికలకు ముందు ఒకలాగా, ఎన్నికలైపోయి అధికారం చేపట్టిన తర్వాత మరొకలా వ్యవహరించే రాజకీయ పార్టీల గురించి మనకు తెలుసు.. మేనిఫెస్టోను ఘనంగా ముద్రించి అవి చేస్తాం ఇవి చేస్తామని ఊరూవాడా ప్రచారం చేసి ఆ తర్వాత మేనిఫెస్టోను బుట్టదాఖలు చేసిన పార్టీలను మనం చూశాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తమది అలాంటి పార్టీ కాదని ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం ద్వారా ప్రజాభిమానం మరింత పొందుతున్నామని సగర్వంగా చెబుతున్నారు.

మరిన్ని వార్తలు