వెలుగుల 'వ్యవసాయం'

30 May, 2022 06:08 IST|Sakshi

రైతన్న గ్రామం దాటకుండా ఊరిలోనే అన్నీ 

ఎన్నడూ ఊహించని మార్పులు సాకారం 

రైతు ముంగిటకు సాగు ఉత్పాదకాలు 

తొలగిన రవాణా చార్జీల భారం, వ్యయ ప్రయాసలు  

అంతర్జాతీయ స్థాయిలో ఆర్బీకేల ఖ్యాతి 

రెండేళ్లలో 1.38 కోట్ల మందికి సేవలు 

18 లక్షల వ్యవసాయ సర్వీసులకు పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్‌

సాక్షి, అమరావతి: వ్యవసాయ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం కల్పిస్తుండటంతో గ్రామసీమల్లో కలలోనూ ఊహించని మార్పులు సాకారమవుతున్నాయి. ఉచిత విద్యుత్‌ నుంచి ఆర్బీకేల దాకా అన్నదాతలకు సంపూర్ణ సహకారం అందుతోంది. రైతన్నలకు ఏది కావాలన్నా గ్రామాల్లోనే లభ్యమవుతున్నాయి. రెండేళ్లలో 1,38,39,396 మంది రైతులు ఆర్బీకేల సేవలను వినియోగించుకున్నారంటే ఏ స్థాయిలో ఆదరణ పొందుతున్నాయో ఊహించవచ్చు.

సాగు ఉత్పాదకాలను రైతుల ముంగిటకు తీసుకెళ్లాలన్న సంకల్పంతో 2020 మే 30వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా శ్రీకారం చుట్టిన 10,778 వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలు రెండేళ్లు కూడా పూర్తి కాకుండానే అంతర్జాతీయ ఖ్యాతి ఆర్జించాయి. వీటి సేవలపై పొరుగు రాష్ట్రాలతో పాటు అంతర్జాతీయ సంస్థలు అధ్యయనం చేస్తున్నాయి. బంగారు స్కోచ్‌ అవార్డు దక్కించుకోవడమే కాకుండా ప్రతిష్టాత్మక ఐక్యరాజ్య సమితి (ఐరాస) చాంపియన్‌ అవార్డుకు నామినేట్‌ కావడం రైతు భరోసా కేంద్రాల వ్యవస్థ పనితీరుకు అద్దం పడుతోంది.  

బయట కంటే తక్కువ రేటుకే.. 
గతంలో ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు తెచ్చుకునేందుకు ఒక్కో రైతుకు రూ.500 నుంచి రూ.1,000 చొప్పున ఖర్చయ్యేది. ఇప్పుడు ఏ ఒక్క రైతూ గ్రామం విడిచి వెళ్లడం లేదు. ఏది కావాలన్నా ఇలా ఆర్బీకేకి వెళ్లి అలా తెచ్చుకుంటున్నారు. మార్కెట్‌ రేటు కంటే 10 శాతం తక్కువకే  దొరుకుతున్నాయి. పొలంబడులతో పెట్టుబడి ఖర్చు తగ్గి దిగుబడులు పెరిగాయి.

పండిన ధాన్యమంతా ఆర్బీకేల ద్వారా విక్రయించుకుంటున్నారు. రైతు భరోసా, పంట రుణాలు, పంటల బీమా, పంట నష్టపరిహారం, సున్నా వడ్డీ రాయితీ.. ఇలా ప్రతి గ్రామానికీ లబ్ధి చేకూరుతోంది. ఆర్బీకేలో పశు సంవర్ధక సహాయకులు (వీహెచ్‌ఏ) పశువులకు ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తినా ఇంటికి వచ్చి మరీ సేవలందిస్తున్నారు. ఉచితంగా మందులిస్తున్నారు. నాణ్యమైన, ధ్రువీకరించిన మిశ్రమ దాణా, పశుగ్రాసం సరఫరా చేస్తున్నారు.  

టెస్టింగ్‌ ల్యాబ్స్‌ 
ఆర్బీకేలకు అనుబంధంగా నియోజకవర్గ స్థాయిలో 147, జిల్లా స్థాయిలో 13 వైఎస్సార్‌ ఇంటిగ్రేటెడ్‌ అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్స్‌తో పాటు నాలుగు రీజనల్‌ కోడింగ్‌ సెంటర్స్‌ ఏర్పాటు చేశారు. ఇక్కడ తనిఖీ చేసిన ఉత్పత్తులనే ఆర్బీకేల ద్వారా సరఫరా చేస్తున్నారు. ఆర్బీకేలను బలోపేతం చేసే లక్ష్యంతో రూ.16 వేల కోట్ల అంచనాతో గోదాములతో పాటు పెద్ద ఎత్తున మౌలిక వసతులతో బహుళ ప్రాయోజిత కేంద్రాలు, 10,250 వైఎస్సార్‌ యంత్ర సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. 

18 లక్షల సర్వీసులు.. 
రాష్ట్రంలో ప్రస్తుతం దాదాపు 18 లక్షల వ్యవసాయ సర్వీసులకు ఉచిత విద్యుత్‌ అందుతోంది. నాణ్యమైన విద్యుత్‌ సరఫరా కోసం ప్రత్యేక ఫీడర్లను రూ.1,700 కోట్లతో ఏర్పాటు చేశారు. 2022–23లో వ్యవసాయ విద్యుత్‌ సబ్సిడీ కోసం రూ.5 వేల కోట్లను ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయించింది. గత సర్కారు దిగిపోతూ అంటగట్టిన రూ.8,559 కోట్ల వ్యవసాయ విద్యుత్‌ సబ్సిడీ బకాయిలను సైతం చెల్లించింది.  

ఏపీ రూరల్‌ అగ్రికల్చర్‌ పవర్‌ సప్లై కంపెనీ లిమిటెడ్‌ (ఏపీఆర్‌ఏపీఎస్‌సీఎల్‌) పేరుతో వ్యవసాయానికి ప్రత్యేక డిస్కమ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. 30 ఏళ్ల పాటు వైఎస్సార్‌ ఉచిత వ్యవసాయ విద్యుత్‌ పథకాన్ని కొనసాగించేలా సోలార్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (సెకీ) నుంచి 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను కొనుగోలు చేస్తోంది. 

బాపట్ల జిల్లా పొన్నూరు నియోజకవర్గంలోని కుగ్రామం తొట్టెంపూడి. జనాభా 1,177. ఇక్కడ 650 ఎకరాలకు పైగా పంట భూములున్నాయి. ఆర్బీకేల రాకతో గ్రామంలో స్పష్టమైన మార్పు వచ్చినట్లు ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడైంది. గతంలో విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల కోసం 25 కి.మీ. దూరంలో ఉన్న గుంటూరు వెళ్లాల్సి వచ్చేది. సీజన్‌లో కనీసం నాలుగైదుసార్లు తిరగాల్సి రావడంతో ప్రయాణ చార్జీలు, రవాణా భారం తడిసిమోపెడయ్యేది. ఇప్పుడు గ్రామంలోనే అన్నీ దొరుకుతున్నాయి. 

ఆరెకరాల పొలంలో 
కూరగాయలు సాగు చేసే విజయనగరం జిల్లా రామభద్రపురానికి చెందిన రైతు తూముల తిరుపతి గత సర్కారు హయాంలో విద్యుత్‌ సక్రమంగా అందక నానా తిప్పలు పడ్డాడు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం వచ్చాక 9 గంటలు నిరంతరాయంగా పగటిపూట ఉచిత విద్యుత్‌ అందుతోందని సంతోషంగా చెబుతున్నాడు.  

మరిన్ని వార్తలు