YSR Jagananna Colonies: అవధులు లేని సంతోషం.. సీఎం జగన్‌ మేలు మరిచిపోలేం..

26 May, 2022 14:48 IST|Sakshi

ఒకప్పుడు పేదల కోసం ఇళ్లు నిర్మిస్తున్నారని అనేవారు.. ఇప్పుడు ఆ వాక్యం మారిపోయింది. వైఎస్ జగన్ పాలన ప్రారంభమైన తర్వాత పేదల కోసం ఇళ్లు కాదు.. ఏకంగా ఊళ్లు నిర్మిస్తున్నారు.. ఆ ఊళ్లు కూడా వేయి కాదు రెండు వేలు కాదు.. ఏకంగా 17 వేల దాకా రాబోతున్నాయి. దీన్నే పేదలందరికీ ఇళ్ల పథకం అంటారు.. అర్హులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా వాటిలో ఉచితంగా ఇళ్లు కట్టిస్తున్నారు. దాంతో ఈ పథకం రెండు దశలు పూర్తయ్యేలోగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 31 లక్షల కుటుంబాల సొంత ఇంటి కల నెరవేరబోతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ప్రతి విషయంలోనూ నాణ్యత వుండేలా చూస్తున్నారు. ఎక్కడికక్కడ చకచకా పనులు జరిగిపోతున్నాయి.
చదవండి: ఏపీ ప్రభుత్వ సంకల్పం.. పింఛను నుంచి ఇంటి పట్టాల దాకా

ప్రజా సంకల్ప యాత్రలో ఇల్లులేని నిరు పేదల కష్టాలు చూసిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాను అధికారంలోకి వస్తే అర్హులైన వారందరికీ ఇళ్లు కట్టిస్తానని హామీ ఇచ్చారు. చెప్పిన మాటను నిలబెట్టుకుంటూ.. అధికారంలోకి రాగానే పేదలందరికీ ఇళ్ల పథకం మొదలుపెట్టారు. ఇప్పటికే ప్రభుత్వం లక్షలాది మంది లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చింది. కేటాయించిన స్థలాల్లో ఇళ్ల నిర్మాణం పనులు జరిగిపోతున్నాయి. అద్దె ఇళ్లలో వుంటూ నెల నెలా అద్దెలు కట్టుకోలేక నానా ఇబ్బందులు పడుతున్నవారు, గుడిసెల్లో నివసిస్తూ పక్కా ఇంటి కోసం సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్నవారు ఇప్పుడు తమ తమ ఇంటి నిర్మాణాల్లో బిజీ అయిపోయారు. నిర్మాణం పూర్తి కాగానే శుభ ఘడియలు చూసుకొని గృహ ప్రవేశం చేస్తున్నారు.

అనకాపల్లి జిల్లా పల్లపు ఆనందపురంలో  ఇంతకాల అద్దె ఇంట్లో నివసిస్తున్న ప్రసాద్‌ దంపతులు ఈ మధ్యనే ఈ ఇంట్లోకి వచ్చారు. మేస్త్రీ పని చేసే ప్రసాద్‌ ఆ పని ద్వారా పది మందికి ఇళ్లు కట్టిస్తున్నారు తప్ప ఇంతకాలం ఈయనకంటూ సొంత ఇళ్లు వుండేది కాదు. ఇదే గ్రామంలో వేయి రూపాయలు అద్దె చెల్లిస్తూ అద్దె ఇంట్లో నివసిస్తూ వుండేవాడు. ఒక వైపు అద్దె బాధలు, మరో వైపు అనారోగ్య సమస్యలతో సతమతమవుతూ ఇక సొంతంగా ఇళ్లు కట్టుకోవడం కష్టమనుకుంటున్న దశలో వీరికి శుభవార్త అందింది.
చదవండి: విప్లవాత్మక నిర్ణయం.. వారి కళ్లలో ఆనందం

వివాహమైన తర్వాత ఎనిమిదేళ్లుగా నానా ఇబ్బందులు పడ్డ ఈ జంట ఇప్పుడు కాస్త ధైర్యంగా సంతోషంగా వుంది. పేదలు అందరికీ ఇళ్ల పథకం కింద గ్రామంలో ప్రధాన రహదారికి ఆనుకొని విలువైన స్థలం కేటాయించారని ...అందులో ఇళ్లు కట్టుకోవడానికి సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు అందరూ కలిసి చక్కగా సహకరించారని నాగిని చెబుతున్నారు. ప్రసాద్‌ స్వయంగా మేస్త్రీ కావడంతో నిర్మాణ పని కూడా చాలా సులువుగా, అందంగా జరిగిపోయింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమలు చేస్తున్న పథకాలు సమాజంలోని పేదలకు చక్కగా ఉపయోపడుతున్నాయని మహిళలు మరింత బాగా లబ్ధి పొందుతున్నారని నాగిని చెబుతోంది.

గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం చేబ్రోలు మంచాల గ్రామంలో వీర్ల వెంకయ్య, సామ్రాజ్యం దంపతులు జీవిస్తున్నారు. వీరిని  చూస్తే తెలుస్తుంది. వీరు ఎంత పేదవారో.. ఈ పేద దంపతులు ప్రస్తుతం నివసిస్తున్న ఈ గుడిసె శిథిలావస్థకు చేరుకుంది. కూలీ పనులు  చేసుకునే వీరయ్య దంపతులు  చెరువుకట్ట పక్కనే గుడిసె వేసుకొని దశాబ్దాలుగా ఇక్కడే జీవిస్తున్నారు. ఇదే గుడిసెలోనే కొడుకు కోడలు మనుమడు మనుమరాలు కూడా వీరితోనే వుంటున్నారు. వర్షం వస్తే గడిసెలోకి నీరు వస్తుంది. గట్టిగా గాలి వస్తే పై కప్పు ఎగిరిపోతుంది..అయినా సరే గత్యంతరం లేని పరిస్థితుల్లో నలభైసంవత్సరాలుగా ఇలాగే కాలం గడిపిన వీరయ్య దంపతులకు వైఎస్ జగన్ పాలనలో మంచిరోజులు వచ్చాయి. ఎందుకంటే వీరికోసం ఇదిగో మనం చూస్తున్న ఈ నాణ్యమైన విలువైన పక్కా గృహం సిద్దమవుతోంది.

గ్రామవార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ వచ్చిన తర్వాత ఇలాంటి పేదల జీవితాలు మారిపోతున్నాయనడానికి రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉదాహరణలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే వాలంటీర్లు  స్వయంగా వీరి దగ్గరకు వచ్చి వీరికొచ్చే పథకాలను వివరించి వీరికి మార్గదర్శనం చేస్తున్నారు. వీర్ల వెంకయ్య విషయంలో కూడా ఇదే జరిగింది.. మీకు స్థలమొస్తోంది. అందులో ఇళ్లు కడతారు అని గతంలో చెప్పినప్పుడు ఈ పేద దంపతులు నమ్మలేదు. కానీ చేతికి పట్టా రావడం, ఆ పట్టా తాలూకా స్థలంలో  ఇళ్లు కడుతుండడం చూసేసరికి వీరికి ఇది కలా నిజామా అనిపిస్తోంది.

ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో ఎంతో ఉన్నతమైన పథకం పేదలందరికీ ఇళ్ల పథకం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఏడున్నరదశాబ్దాలు అవుతున్న ఈ తరుణంలో ఇంకా గుడిసెల్లోనే నివసించే పేదలు కనిపించడం దురదృష్టకరం. వీరి జీవితాల్లో మార్పులు తేవాలని వీరు నాణ్యమైన జీవితాలు గడపాలనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మహా సంకల్పం. ఈ మంచాల గ్రామాన్నే తీసుకుంటే ఈ గ్రామంలో ఇళ్లు లేని పేద కుటుంబాలు 76 వున్నాయి. వీరికోసం కోటి రూపాయలు ఖర్చు చేసి  ఎకరం 86 సెంట్ల భూమిని కొనుగోలు చేసి ఆ తర్వాత అన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ ఇళ్లు నిర్మించారు. ప్రస్తుతం మౌలిక సదుపాయాలను కల్పించే పనిని చేస్తున్నారు. త్వరలో  వీర్ల వెంకయ్య కుటుంబంతోపాటు ఇతర లబ్ధిదారులు ఈ ఇళ్లలో గృహ ప్రవేశం చేయనున్నారు.

కూలీ పనులు చేసుకునేవారు  సంపాదించే  కూలీడబ్బులు ఏ రోజుకు  ఆ రోజు పొట్టపోసుకోవడానికే సరిపోతోంది.. ఎంతో కొంత మిగిలితే ఆ మిగిలిన డబ్బు అత్యవసర సమయాల్లో ఖర్చయిపోతుంటుంది. దాంతో ఇలాంటి వేలాది కుటుంబాలు సొంతంగా ఇళ్లు కట్టుకోవడమనేది కలలో జరిగే విషయమే. ఇలాంటప్పుడే ప్రభుత్వం అండదండలందించి పథకాలందించి వీరిని అన్ని విధాలా బలోపేతం చేయాలి. వీరి తలరాతలు మార్చాల్సి వుంటుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో అదే పని జరుగుతోంది. లక్షలాది కుటుంబాలు అభివృద్ధి బాటలో పడ్డాయి. అటు పథకాల ద్వారా ఇటు సొంతిళ్ల ద్వారా వేలాది కుటుంబాలు దారిద్య్ర రేఖను దాటబోతున్నాయి.

ఇంతకాలం పడ్డ కష్టాలు ఒక్కటొక్కటిగా తొలగిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా లక్షలాది రూపాయల విలువైన ఆస్తికి మహిళలు యజమానులవుతున్నారు.
మహిళా సాధికారతకు సరికొత్త నిర్వచనం ఇచ్చేలా ఆంధ్రప్రదేశ్‌  సర్కార్ వేస్తున్న అడుగులు లక్షలాది కుటుంబాల్లో వెలుగు దీపాలవుతున్నాయి.

ఇది పైలా అప్పారావు, భవాని దంపతుల ఇల్లు. పేదలందరికీ ఇళ్ల పథకం కింద వీరు నిర్మించుకున్న గృహమిది. విశాఖనగరం శ్రీనివాసనగర్‌లో రోడ్డు పక్కనే ఈ ఇల్లు వుంది. ఇంతకాలం అద్దె ఇంట్లో వున్న అప్పారావు దంపతులు ఇప్పుడు తమకంటూ సొంత ఇల్లు సంపాదించుకున్నారు. లక్షలాది రూపాయలు వెచ్చించి ఇల్లు కట్టుకోలేమో అనే బెంగతో చాలా కాలంపాటు తీవ్ర మానసిక వేదన అనుభవించిన వీరు ఇప్పుడు సంతోషంగా వున్నారు. విశాఖలాంటి మహానగరంలో ఒక చిన్న గూడు లభించదనే ఆనందం ఈ చిన్న కుటుంబంలో స్పష్టంగా కనిపిస్తోంది.

అప్పారావు భవానీలది కులాంతర వివాహం. దాంతో వీరు కొంతకాలంపాటు తమ పెద్దవాళ్ల కోపానికి గురయి ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఇరు వైపు కుటుంబాలనుంచి సమస్యలు లేవు. అదే సమయంలో ఈ జంటకు సొంత ఇల్లు సమకూరింది. పిల్లలకు అమ్మ ఒడి పథకం కూడా అందుతోంది. ఇంటినిర్మాణ సమయంలో వచ్చిన సమస్యల్ని వైఎస్సార్ సీపీ నేతలు, గ్రామవార్డు సచివాలయాల సిబ్బంది అందరూ కలిసి పరిష్కరించారని భవానీ కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

విశాఖ జిల్లా నుంచి చిత్తూరు జిల్లాకు వద్దాం..మనం చూస్తున్న ఈ జగనన్న ఇళ్ల కాలనీ తవణంపల్లి మండలం అరగొండలో వుంది. ఎటు చూసినా చకచకాఇళ్ల నిర్మాణం జరిగిపోతోంది. స్థానికంగా ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్న నూరుల్లా చాలా కాలంగా అద్దె ఇంట్లోనే వుండేవాడు. ఆటో మీద వచ్చే ఆదాయంనుంచే అద్దె కట్టుకుంటూ మిగిలిన డబ్బుతో కుటుంబాన్ని పోషించేవాడు. ఈ పేద కుటుంబం బతకడమే కష్టంగా వున్న తరుణంలో పేదలందరికీ ఇళ్ల పథకం అందుబాటులోకి వచ్చింది. నూరుల్లా భార్య హసీనా పేరు మీద స్థలం, ఇళ్లు వచ్చాయి.

అరగొండలోనే జయరాజ్‌, వనిత దంపతులు తమ ఇంటిని నిర్మించుకుంటూ కనిపించారు. వీరిది కూడా పేద కుటుంబమే ..జయరాజ్‌ పెయింటర్‌గా పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. పేదలందరికీ ఇళ్ల పథకంలో భాగంగా ఇళ్లు రావడంతో ఈ దంపతులిద్దరూ కలిసి తామే దగ్గరుండి కట్టుకుంటున్నారు.  కుదిరిన మేరకు పనులన్నీ చకచకా చేసుకుంటున్నారు.

ఇక్కడ ఇళ్ల నిర్మాణం పండగలాగా కొనసాగుతోంది. ప్రభుత్వం అన్నీ సమకూరుస్తుండడంతో, నిర్మాణానికి కావాల్సిన నీటి సౌకర్యం కూడా కల్పించడంతో ఎక్కడికక్కడ పనులు సులువుగానే జరిగిపోతున్నాయి. ఇక్కడ ఇళ్లు కట్టుకుంటున్న వారిలో కవిత కుటుంబం కూడా వుంది. కవిత భర్త సతీష్‌ తోపుడు బండి పెట్టుకొని ఉపాధిపొందుతున్నారు.

ఇలాంటి ఇళ్లు రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షలదాకా నిర్మాణమవుతున్నాయి. వీటిని కట్టడంలో ఆయా జిల్లాల కలెక్టర్లు, ఇతర ముఖ్య అధికారులు సమన్వయంతో పని చేస్తూ ఈ పనులు నాణ్యంగా కొనసాగేలా చూస్తున్నారు. వేలాది జగనన్న కాలనీల్లో మౌలిక వసతుల కల్పన కూడా చకచకా సాగిపోతోంది. ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున మొదలుపెట్టిన ఈ మహాయజ్ఞం కారణంగా వేలాది కుటుంబాలకు సొంత ఇళ్లు రావడమే కాకుండా లక్షలాదిమందికి ఉపాధి పనులు కూడా లభిస్తున్నాయి.
 

మరిన్ని వార్తలు