104 కాల్‌ సెంటర్‌కు 300 మంది వైద్యులు

21 Apr, 2021 04:09 IST|Sakshi

కన్సల్టెంట్‌ సేవలకుగాను గంటకు రూ.400 చెల్లింపు 

సాక్షి, అమరావతి: కోవిడ్‌ నేపథ్యంలో 104 కాల్‌ సెంటర్‌ను ప్రభుత్వం మరింతగా బలోపేతం చేస్తోంది. కరోనా బాధితులకు ఫోన్‌ ద్వారా వైద్య సలహాలు ఇచ్చేందుకుగాను ప్రస్తుతం కొంతమేరకు వైద్యులు ఉండగా మరో 300 మంది వైద్యులను కన్సల్టెంట్‌లుగా నియమించనుంది. వీరికి గంటకు రూ.400 లెక్కన చెల్లించనుంది. కన్సల్టెంట్‌లుగా ఎంబీబీఎస్‌ లేదా స్పెషలిస్ట్‌లను నియమించనుంది. వచ్చిన ప్రతి ఫోన్‌ కాల్‌ను కాల్‌సెంటర్‌ నుంచి వైద్యుడికి కనెక్ట్‌ చేస్తారు.

బాధితుడికి వైద్యుడు సలహాలు, సూచనలను, లక్షణాలను బట్టి మందులను ఇస్తారు. కరోనా పెరుగుతున్న కారణంగా చాలా చోట్ల ఔట్‌పేషెంట్‌ సేవలు అందుబాటులో లేని నేపథ్యంలో 104 కాల్‌ సెంటర్‌ను బలోపేతం చేసి బాధితులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 21 నుంచే వైద్యులను అందుబాటులోకి తేవడానికి వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. 

మరిన్ని వార్తలు