332 మంది డిశ్చార్జ్‌

8 Dec, 2020 03:31 IST|Sakshi
విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో ఏలూరు బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్యులు

84 చోట్ల వైద్య శిబిరాలు

సాక్షి ప్రతినిధి, ఏలూరు/ఏలూరు టౌన్‌/లబ్బీపేట (విజయవాడ తూర్పు): ఏలూరులో అంతుచిక్కని వ్యాధి బారిన పడిన వారి సంఖ్య సోమవారం రాత్రి 10 గంటల సమయానికి 475కు చేరింది. వారిలో 332 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ కాగా.. 125 మంది ఏలూరులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో 18 మందిని మెరుగైన చికిత్స కోసం విజయవాడ తరలించారు. మొత్తం బాధితుల్లో 253 మంది పురుషులు కాగా.. 222 మంది మహిళలు ఉన్నారు. పెస్టిసైడ్, ఇ–కోలి పరీక్షల రిజల్ట్స్‌ రావాల్సి ఉంది. అధికార యంత్రాంగం మొత్తం ఏలూరులోనే మోహరించి వ్యాధి ఏమిటనేది తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రతినిధి బృందం సైతం చేరుకుంది.

ఈ బృందం మూడు రోజుల పాటు నగరంలో పర్యటించి వ్యాధిపై అధ్యయనం చేయనుంది. ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్‌ కాటంనేని భాస్కర్‌తోపాటు వైద్య శాఖ ఉన్నతాధికారులు, వైద్య నిపుణులు ఏలూరులోనే ఉంటూ పర్యవేక్షిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి, వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్‌ కాటంనేని భాస్కర్, కలెక్టర్‌ ఆర్‌.ముత్యాలరాజుతో కలిసి తాజా పరిస్థితిపై ప్రభుత్వాస్పత్రిలో సోమవారం రాత్రి సమీక్షించారు. ప్రభుత్వాస్పత్రిలో 9 వార్డుల్లో 250 బెడ్లు సిద్ధంగా ఉన్నాయని, మరో 50 బెడ్లు సైతం అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. 
చికిత్స పొందుతున్న బాలుడిని పలకరిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

అంతటా అప్రమత్తం
ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన వైద్య సేవలందిస్తూ భరోసా కల్పించేందుకు యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. నగరంలోని 62 వార్డు సచివాలయాలతోపాటు మొత్తం 84 చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ఏలూరు నుంచి విజయవాడ, గుంటూరు జీజీహెచ్‌లకు తరలించే రిఫరల్‌ కేసులను పర్యవేక్షించేందుకు ఒక నోడల్‌ అధికారిని నియమించారు. మంగళవారం నుంచి 32 డివిజన్లలో సూపర్‌ శానిటైజేషన్‌ చేసేలా చర్యలు తీసుకున్నారు. తాగునీటి పైపులు ఏమైనా లీకేజీలుంటే అరికట్టడం, డ్రైనేజీ వ్యవస్థలో లోపాలను సరిచేయడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. కేసులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో అంబులెన్సులు ఉండేలా ఏర్పాట్లు చేశారు. విజయవాడలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్యం నిలకడగానే ఉందని ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కె.శివశంకరరావు తెలిపారు.   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు