పట్టణ ప్రజారోగ్యానికి జవసత్వాలు 

15 Feb, 2022 04:45 IST|Sakshi

344 వైఎస్సార్‌ అర్బన్‌ హెల్త్‌ సెంటర్లకు కొత్త భవనాలు 

మరో 184 భవనాలకు మరమ్మతులు 

రూ.293.60 కోట్ల నిధుల కేటాయింపు  

ఈ నెలాఖరుకు 105 భవనాలు అందుబాటులోకి.. 

సాక్షి, అమరావతి: పట్టణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ఉద్దేశించిన వైఎస్సార్‌ అర్బన్‌ హెల్త్‌ సెంటర్లకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త భవనాలను అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతం ఉన్న యూహెచ్‌సీ భవనాలకు మెరుగులు దిద్దడంతో పాటు కొత్త సెంటర్ల ఏర్పాటు కోసం భవనాలను నిర్మిస్తోంది. అందుకనుగుణంగా పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ మునిసిపల్‌ ఇంజినీరింగ్‌ విభాగం ఆధ్వర్యంలో 528 భవనాలను సిద్ధం చేస్తున్నారు. ఇందులో 344 కొత్తగా నిర్మించే భవనాలు కాగా, మరో 184 భవనాలకు మరమ్మతులు చేయనున్నారు.

ఈ పనుల కోసం రూ.293.60 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించగా, కొత్త భవనాలకు రూ.275.20 కోట్లు, పాత భవనాల పునరుద్ధరణ కోసం రూ.18.40 కోట్లు ఖర్చు చేయనున్నారు. కాగా ప్రస్తుతం పునరుద్ధరణ చేపట్టిన యూహెచ్‌సీలలో 182 భవనాల పనులు పూర్తవగా, మిగిలిన రెండు భవనాలను ఫిబ్రవరి 15 నాటికి అందుబాటులోకి తేనున్నారు. కొత్త భవనాలలో ఫిబ్రవరి చివరినాటికి అన్ని వసతులతో 105 కొత్త యూహెచ్‌సీ భవనాలను అందుబాటులోకి తేవాలని, మార్చి చివరినాటికి మొత్తం 344 కొత్త భవనాలను వినియోగంలోకి తెచ్చే లక్ష్యంతో పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ మునిసిపల్‌ ఇంజినీరింగ్‌ విభాగం పనులు చేస్తోంది.  

ప్రతి రెండు కి.మీ.కి ఒక భవనం 
రాష్ట్రంలోని అన్ని మునిసిపాటీల్లోనూ ప్రతి రెండు కిలోమీటర్లకు ఒక వైఎస్సార్‌ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ను నిర్మించి పట్టణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు అందుబాటులోకి తేవాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అందుకు అనుగుణంగా అధికారులు ఈ ఆరోగ్య కేంద్రాల నిర్మాణం చేపట్టారు. కొత్తగా ఒక్కో సెంటర్‌ భవన నిర్మాణానికి రూ.80 లక్షలు కేటాయించగా, పాత భవనాల పునరుద్ధరణ, మరమ్మతులకు రూ.10 లక్షల చొప్పున ఖర్చు చేస్తున్నారు.   

మరిన్ని వార్తలు