గజగజలాడించాయ్‌

3 Jun, 2021 12:49 IST|Sakshi
జోడిరచ్చల గ్రామ సమీపంలో సంచరిస్తున్న గజరాజులు   

పలమనేరు (చిత్తూరు జిల్లా): ఇన్నాళ్లూ తరచూ పంటలపై పడి ధ్వంసం చేస్తున్న కౌండిన్య అభయారణ్యంలోని ఏనుగులు ఇప్పుడు యథేచ్ఛగా రోడ్లపై నడుచుకుంటూ గ్రామాల్లోకి వచ్చేస్తున్నాయి. పలమనేరు మండలంలోని జోడిరచ్చల గ్రామంలోకి బుధవారం ఏకంగా 36 ఏనుగులు చొరబడ్డాయి. గజరాజుల ఘీంకారాలకు భయంతో గ్రామస్తులు పరుగులు పెట్టారు. కొద్దిసేపు గ్రామంలో హల్‌చల్‌ చేసిన ఏనుగుల గుంపు ఆ తర్వాత గ్రామానికి ఆనుకుని ఉన్న పలమనేరు–మండిపేట కొట్టూరు తారురోడ్డు మీదుగా వెళ్లి ఆపై అడవిలోకి చేరింది. ఆ సమయంలో ఆ మార్గంలో ద్విచక్రవాహనాలపై వెళ్తున్నవారు ఏనుగుల గుంపును చూసిందే తడవుగా వెనక్కి మళ్లి పలాయనం చిత్తగించారు.

సోలార్‌ ఫెన్సింగ్, ఎలిఫెంట్‌ ట్రెంచ్‌లు ఉన్నా..
కౌండిన్య ఎలిఫెంట్‌ శాంచ్యురీలో ఏనుగులు అడవిలోంచి బయటకు రాకుండా ఏర్పాటు చేసిన సోలార్‌ ఫెన్సింగ్, ఎలిఫెంట్‌ ట్రెంచ్‌ ఫలితాలనివ్వడం లేదు. షాక్‌ కొట్టని సోలార్‌ ఫెన్సింగ్‌ను ధ్వంసం చేసి, ట్రెంచ్‌లను మట్టితో పూడ్చి, బండలున్న చోట్ల అడవిని దాటుకుంటూ ఏనుగులు నిత్యం జనావాసాలవైపు గుంపులు గుంపులుగా వస్తున్నాయి. ఇప్పటిదాకా ఏనుగులు పంటలపై పడేవి. ఈ మధ్య కాలంలో ఇవి గ్రామాల్లోకి వస్తుండటంతో అటవీ సమీప గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తోంది. ఏనుగులకు ఒకసారి ఒక మార్గం అలవాటైతే అదే మార్గంలో మళ్లీ మళ్లీ వస్తాయని ఆ ప్రాంత వాసులు భయపడుతున్నారు. దీంతో రాత్రి పూట ఇళ్లలో నిద్రలేని రాత్రులను గడపాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ స్పందించి ఎలిఫెంట్‌ ట్రాకర్ల ద్వారా ఏనుగులను మోర్థన ఫారెస్ట్‌లోకి మళ్లించాలని వారు జోడిరచ్చల గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.

చదవండి: ప్రేమించి.. లోబర్చుకుని.. జాబ్‌ వచ్చాక కాదన్నాడు
‘నా కలల హారికా.. లేమ్మా..!’ కన్నీరు పెట్టిస్తున్న తండ్రి రోదన

మరిన్ని వార్తలు