‘చిగు’రిస్తున్న ఆశలు!

22 Feb, 2023 05:33 IST|Sakshi

అన్నమయ్య జిల్లాలో 37 వేల హెక్టార్లలో మామిడి సాగు 

2.60 లక్షల మెట్రిక్‌ టన్నుల కాయలు దిగుబడి 

సీజన్‌తోపాటు ఇప్పుడు కూడా చెట్లకు కనిపిస్తున్న పూత 

మార్చి నుంచి జూన్‌ వరకు మామిడి మార్కెట్‌ కళకళ  

సాక్షి రాయచోటి: మామిడి రైతుల ఆశలు చిగురిస్తున్నాయి. తొలి విడతలో వచ్చిన పూతకు కాయలు కనిపిస్తుండగా.. ప్రస్తుతం రెండో విడతలో కూడా పూత కనిపిస్తుండడంపై ఆశలు కొత్తగా చిగురిస్తున్నాయి. ఎక్కడ చూసినా పూత, పిందెతో చెట్లు కనిపిస్తుండడం.. గతేడాది కంటే ఈసారి ధర కూడా బాగానే ఉండే అవకాశాలు ఉండడంతో కొత్త ఆశలు మొలకెత్తాయి. అన్నమయ్య జిల్లాలో సుమారు 37 వేల హెక్టార్ల వరకు మామిడి తోటలు సాగులో ఉన్నాయి. అందులో సరాసరిన 20 వేల హెక్టార్లలో పెద్ద చెట్లు (కాయలు కాచే) ఉండవచ్చని ఉద్యానశాఖ అంచనా వేస్తోంది. 

ఒకవైపు కాయలు.. మరోవైపు పూత 
అన్నమయ్య జిల్లాలో మామిడి పంటకు సంబంధించి రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి, పీలేరు నియోజకవర్గాల్లో పంట విస్తారంగా సాగులో ఉంది. ముందుగా రైల్వేకోడూరు ప్రాంతానికి చెందిన కాయలు మార్కెట్‌కు వస్తాయి. తర్వాత మిగతా ప్రాంతాల్లోని కాయలు కూడా అందుబాటులోకి రానున్నాయి. జిల్లాలో ప్రస్తుతం పిందెలతో కూడిన కాయలు కనిపిస్తుండగా మరోవైపు పూత కూడా ఇప్పుడే విరివిగా కనిపిస్తోంది.

గత ఏడాది నవంబరు, డిసెంబరు నెలల్లో శీతాకాలంలో పూత విపరీతంగా వచ్చినప్పటికీ శీతల ప్రభావానికి కొంతమేర ముసురుకుంది. అయితే మంచుకు తట్టుకుని నిలబడిన తోటల్లో ప్రస్తుతం కాయలు కూడా కనిపిస్తున్నాయి. ఇదే వరుసలో రెండవ విడతగా పూత కూడా విస్తారంగా రావడంతో ఈసారి కూడా భారీగా మామిడి కాయలు అన్నమయ్య జిల్లా నుంచి మార్కెట్‌కు రానున్నాయి.  

మార్చి నుంచి జూన్‌ వరకు మార్కెట్‌లో కాయలు 
మామిడి పంటకు సంబంధించి కాయలు మార్చి నెల నుంచి అందుబాటులోకి రానున్నాయి. మనకు తొలుత కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల నుంచి మార్చి నెలలో ఇక్కడి మార్కెట్లకు కాయలు రానున్నాయి.  తర్వాత రైల్వేకోడూరుతోపాటు చిత్తూరు జిల్లాకు చెందిన మామిడి పంట మార్కెట్‌ను ముంచెత్తనుంది.

ఏప్రిల్‌ నెలనుంచి జూన్‌ వరకు అన్నమయ్య జిల్లాలోని రాజంపేట, రాయచోటి, పీలేరు నియోజకవర్గాల్లో పలు మండలాల నుంచి భారీగా మామిడి కాయలు అందుబాటులోకి రానున్నాయి. జిల్లాలో మామిడికి సంబంధించి బెంగుళూర, బేనీషా, నీలం, ఇమామ్‌ పసంద్, లాల్‌ బహార్, ఖాదర్, చెరుకు రసం, మల్లిక, సువర్ణ రేఖ, దసేరి, మల్గూబా తదితర రకాల కాయలను సాగు చేశారు. మార్చి రెండవ వారం నుంచి జూన్‌ నెలాఖరు వరకు కాయలు ఇక్కడి మార్కెట్లలో కళకళలాడనున్నాయి. 

రెండుమార్లు పూత 
మామిడి పంటకు సంబంధించి ప్రస్తుతం పూత విరివిగా కనిపిస్తోంది. గత నవంబరు, డిసెంబరు నెలల్లో వచ్చిన పూతకు లేలేత కాయలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మళ్లీ వచ్చిన పూత కూడా నిలబడింది. దిగుబడి కూడా ఈసారి అనుకున్న మేర ఆశాజనకంగా ఉంటుంది.

అన్నమయ్య జిల్లాలో ప్రధానంగా నాలుగు నియోజకవర్గాల్లో మామిడి పంట సాగులో ఉంది. జిల్లా వ్యాప్తంగా 37 వేల హెక్టార్లలో పంట సాగులో ఉండగా...సరాసరిన 20 వేల హెక్టార్లలో కాయలు కాసే చెట్లు ఉన్నాయి. ఈసారి దిగుబడి కూడా బాగా వస్తుందని అంచనా వేస్తున్నాం. 
– రవిచంద్రబాబు, జిల్లా ఉద్యాన అధికారి, రాయచోటి, అన్నమయ్య జిల్లా  

మరిన్ని వార్తలు