జబ్బులు బాబోయ్‌! 

20 Nov, 2022 05:40 IST|Sakshi

దేశంలో ప్రతి వెయ్యి మందిలో 39 మందికి తీవ్రమైన అనారోగ్యం 

సాక్షి, అమరావతి: దేశంలో జబ్బులు తీవ్రంగా ఉన్నాయి. తీవ్ర అనారోగ్యం, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ఎక్కువగా ఉన్నారు. దేశంలో ప్రతి వెయ్యి మందిలో 39 మంది తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. 37 మంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు. 75వ జాతీయ నమూనా సర్వే ఈ విషయాన్ని వెల్లడించింది. దేశంలో, వివిధ రాష్ట్రాల్లో అనారోగ్య ప్రాబల్యంపై 75వ జాతీయ నమూనా సర్వేను కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల మంత్రిత్వ శాఖ నివేదిక రూపంలో విడుదల చేసింది.

దేశంలో ప్రతి వెయ్యి మందిలో ఏడుగురు జీవనశైలి జబ్బులు.. అంటే బీపీ, డయాబెటిస్, క్యాన్సర్‌ వంటి వ్యాధులు, నలుగురు గుండె, రక్తనాళాల జబ్బుల బారిన పడుతున్నట్లు నివేదిక తెలిపింది. ప్రతి వెయ్యి మందిలో ఆరుగురు వైకల్యంతో బాధపడుతున్నట్లు పేర్కొంది. కేరళ, పంజాబ్, ఒడిశా, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, హిమాచల్‌ ప్రదేశ్, మహారాష్ట్రలో ఎక్కువ శాతం తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలిపింది.

కేరళ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, గోవాల్లో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నట్లు వారు ఎక్కువ ఉన్నట్లు పేర్కొంది. బిహార్, అస్సోం, గోవా, నాగాలాండ్, మణిపూర్, మేఘాలయల్లో తీవ్ర అనారోగ్యంతో ఉన్న వారి సంఖ్య తక్కువగా ఉంది. దీర్ఘకాలికంగా అనారోగ్యంతో ఉన్న వారు బిహార్, ఉత్తరాఖండ్, ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో తక్కువగా ఉన్నట్లు పేర్కొంది. జీవనశైలి జబ్బులతో పాటు గుండె, రక్తనాళాల జబ్బులు, అంటువ్యాధులతో బాధపడుతున్న వారు కేరళలో అత్యధికంగా ఉన్నట్లు నివేదిక తెలిపింది. 

మరిన్ని వార్తలు