రివ్వున ఎగిరిపోతున్నారు.. 

1 Jun, 2022 05:33 IST|Sakshi

విశాఖ నుంచి 16.10 లక్షల మంది ప్రయాణికుల రాకపోకలు

విమాన సర్వీసుల్లో వృద్ధి సాధించిన 4 ఎయిర్‌పోర్టులు

ప్రయాణికుల రాకపోకల్లో 77 శాతం వృద్ధి సాధించిన తిరుపతి విమానాశ్రయం  

సాక్షి, విశాఖపట్నం: కోవిడ్‌ సంక్షోభం ఎదుర్కొన్న విమానయాన రంగం క్రమంగా కోలుకుంటోంది. రాష్ట్రంలో విమాన ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. తిరుపతి, విశాఖపట్నం ఎయిర్‌పోర్టుల ద్వారా సాగిన ప్రయాణికుల రాకపోకల్లో దాదాపు 50 శాతం వృద్ధి నమోదైంది. గతేడాది అక్టోబర్‌ నుంచి ఆంక్షలు లేని విమానయానానికి గ్రీన్‌ సిగ్నల్‌ లభించడంతో ప్రయాణికుల రాకపోకలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి.

రాష్ట్రంలోని ప్రధాన ఎయిర్‌పోర్టులైన విశాఖ, తిరుపతి, రాజమండ్రి, విజయవాడలలో ప్రతి చోటా వృద్ధి నమోదైంది. 2020–21తో పోలిస్తే.. 2021–22లో సాగిన ప్రయాణికుల రాకపోకలకు సంబంధించి తిరుపతిలో 77 శాతం వృద్ధి నమోదవ్వగా.. విశాఖలో 45 శాతం, రాజమండ్రిలో 35, విజయవాడలో 23 శాతం వృద్ధి నమోదైంది. విశాఖ నుంచి అత్యధికంగా 16.10 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. 

సర్వీసుల పెంపు, కార్గోలోనూ జోరు.. 
ప్రయాణికుల రాకపోకల్లోనే కాకుండా.. విమాన సర్వీసులు, కార్గో రవాణాలో కూడా ఎయిర్‌పోర్టులు పుంజుకున్నాయి. సర్వీసుల పెంపులోనూ తిరుపతి 43 శాతంతో ముందంజలో ఉండగా.. విశాఖ 28 శాతం వృద్ధి సాధించి రెండోస్థానంలో నిలిచింది. అత్యధిక విమాన సర్వీసులు నడుస్తున్న ఎయిర్‌పోర్టుగా మాత్రం విశాఖపట్నం మొదటి స్థానంలో నిలిచింది. డొమెస్టిక్, ఇంటర్నేషనల్‌ సర్వీసులతో కలిపి విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి 2021–22లో మొత్తం 14,852 విమానాలు రాకపోకలు సాగించాయి. కార్గో సర్వీసుల్లో విశాఖ ఎయిర్‌పోర్టు 13 శాతం వృద్ధితో మొదటిస్థానంలో నిలిచింది.  

మరిన్ని వార్తలు