బాపట్లలో విషాదం.. నలుగురు ఇంజనీరింగ్‌ విద్యార్థుల గల్లంతు

20 Oct, 2022 18:20 IST|Sakshi

ఒకరి మృతదేహం లభ్యం..     మరో ముగ్గురి కోసం గాలింపు

అందరూ గుంటూరులోని జీవీఆర్‌ఎస్‌ ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థులు

బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం బీచ్‌లో ఘటన 

చీరాల టౌన్‌: విహారయాత్ర కోసం బీచ్‌కు వచ్చిన నలుగురు విద్యార్థులు సముద్రంలో గల్లంతయ్యా రు. వారిలో ఒకరి మృతదేహం లభించింది. మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. ఈ విషాద ఘటన బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం సముద్రతీరంలో గురువారం జరిగింది. చీరాల డీఎస్పీ పి.శ్రీకాంత్‌ తెలిపిన వివరాల మేరకు... గుంటూరుకు చెందిన జీవీఆర్‌ఎస్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఏడుగురు విద్యార్థులు రామాపురం బీచ్‌కు వచ్చా రు. వారు సముద్రంలో స్నానం చేస్తుండగా పెద్ద అలలు వచ్చాయి.

తెనాలికి చెందిన యడవల్లి రమణ (19), పులివర్తి గౌతమ్‌ (20), అమరావతి మండలం పరిమి గ్రామానికి చెందిన తాళ్లూరి రోహిత్‌ (20), హైదరాబాద్‌కు చెందిన తిరుణగిరి మహదేవ్‌ (18) అలల తాకిడికి నీటిలో మునిగిపోయారు. ఆ సమయంలో కేకలు వేస్తున్న విద్యార్థుల ను కాపాడేందుకు రామాపురం మత్స్యకారులు ప్రయత్నించినా, ఫలితం లేకపోయింది. కొద్దిసేపటి తర్వాత మహదేవ్‌ మృతదేహం ఒడ్డుకు కొట్టుకొ చ్చింది. మిగిలిన ముగ్గురు విద్యార్థుల కోసం గాలిస్తున్నారు. మహదేవ్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు.

తీరంలో మిన్నంటిన రోదనలు... 
గల్లంతైన విద్యార్థుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, సహచర విద్యార్థులు రామాపురానికి చేరుకున్నారు. కుమారులు సముద్రంలో గల్లంతుకావడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. కష్టపడి బిడ్డలను చదివించుకుంటున్న తమపై విధి కక్షగట్టి తీసుకెళ్లిందని, తమకు కడుపుకోత మిగిల్చిందని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నా రు. చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి అక్కడికి చేరుకుని విద్యార్థులు, డీఎస్పీ పి.శ్రీకాంత్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.  
 

మరిన్ని వార్తలు