దసరాకు 4 వేల ఆర్టీసీ బస్సులు

7 Oct, 2021 04:27 IST|Sakshi

ఓవైపు బస్సులు ఖాళీగా వెళ్లాల్సి ఉంటుంది

అందుకే ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీలు

రెగ్యులర్‌ బస్సుల్లో అదనపు చార్జీలు ఉండవు

ఆర్టీసీ ఎండీ సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు

సాక్షి, అమరావతి: దసరా పండుగ రద్దీ దృష్ట్యా ప్రయాణికుల కోసం రేపటి (శుక్రవారం) నుంచి ఈనెల 18వ తేదీ వరకు 4 వేల ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ ఎండీ సీహెచ్‌ ద్వారకాతిరుమలరావు తెలిపారు. 14వ తేదీ వరకు 1,800 బస్సులు, 15 నుంచి 18వ తేదీ వరకు 2,200 బస్సులు తిప్పుతామని చెప్పారు. విజయవాడలోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయం బస్‌భవన్‌లో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దసరా సందర్భంగా ప్రయాణికులు తమ స్వస్థలాలకు సౌకర్యవంతంగా వచ్చి, పండుగ తరువాత మళ్లీ వెళ్లేందుకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుందన్నారు. హైదరాబాద్‌ నుంచి 1,383 బస్సులు, బెంగళూరు నుంచి 277 బస్సులు, చెన్నై నుంచి 97 బస్సులు, ఇతర ప్రాంతాల నుంచి 2,243 బస్సులను రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు నడుపుతామని వివరించారు. దసరా ప్రత్యేక బస్సులను ఓ వైపు ఖాళీగా అంటే సున్నా రాబడితో నడపాల్సి ఉంటుందన్నారు. డీజిల్‌ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని చెప్పారు. అందువల్ల అనివార్య పరిస్థితులతో దసరా ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీలు నిర్ణయించినట్లు తెలిపారు. ప్రయాణికులు సహృదయంతో అర్థం చేసుకోవాలని ఆయన కోరారు. రెగ్యులర్‌ బస్‌ సర్వీసుల్లో అదనపు చార్జీలు ఉండవని చెప్పారు. 

కారుణ్య నియామకాలకు ఆమోదం
గత సంవత్సరం జనవరి 1 తరువాత మృతిచెందిన ఆర్టీసీ ఉద్యోగుల వారసులకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని చెప్పారు. దీనిపై త్వరలోనే విధివిధానాలను విడుదల చేస్తామన్నారు. 2020 జనవరి 1 నుంచి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే కారుణ్య నియామకాలకు మార్గం సుగమమైందని పేర్కొన్నారు. అంతకుముందు అంటే ఆర్టీసీ కార్పొరేషన్‌గా ఉన్నకాలంలో చనిపోయిన సంస్థ ఉద్యోగుల పిల్లలకు కూడా కారుణ్య నియామకాలపై త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. 2020–21కి సంబంధించి ఆర్టీసీ ఉద్యోగులకు లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌ ఇస్తున్నామన్నారు. ఆర్టీసీ ఆదాయాన్ని పెంచేందుకు, ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు. పల్లెవెలుగు బస్‌ డిజైన్‌ మారుస్తామన్నారు. అన్ని బస్సులకు లైవ్‌ ట్రాకింగ్‌ సౌలభ్యం కల్పిస్తామని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులపై చర్యలు తీసుకునేందుకు రవాణా, పోలీసు అధికారులతో కలిపి ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తామని ఆయన తెలిపారు.  

మరిన్ని వార్తలు