వ్యవసాయ పరికరాలపై 40 శాతం రాయితీ

1 Aug, 2020 04:21 IST|Sakshi

వ్యవసాయ పరికరాలపై ఇవ్వనున్న ప్రభుత్వం

ఉత్పత్తిదారుల సంఘాలు, సహకార సంఘాలకు ప్రాధాన్యత 

సంఘాల ఏర్పాటుకు గడువు తేది ఆగస్టు 15 

బ్యాంకుల లింకేజి ద్వారా రుణాలు

సాక్షి, అమరావతి: ఉత్పత్తిదారుల సంఘాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు 40 శాతం రాయితీపై వ్యవసాయ పరికరాలను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆప్కాబ్‌ (ఆంధ్రప్రదేశ్‌ సహకార బ్యాంకు) ఆర్ధిక సహకారంతో ఈ సంఘాలు పరికరాలను సమకూర్చుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించనుంది. పరికరం విలువలో 10 శాతం నిధులను సంఘాలు సమకూర్చుకుంటే, బ్యాంకులు 50 శాతం రుణం ఇస్తాయి. మిగిలిన 40 శాతం రాయితీని ప్రభుత్వం అందించనుంది. గత ప్రభుత్వ హయాంలో వ్యవసాయపరికరాల పంపిణీలో జరిగిన అక్రమాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం అనేక మార్పులు, చేర్పులు చేసి కొత్త విధానాన్ని అమలులోకి తీసుకొస్తోంది. వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించేందుకు ఆప్కాబ్‌ తొలుత పేర్కొన్న సంఘాలకు రాయితీపై పరికరాల పంపిణీకి నిధులు కేటాయించనుంది. ఈ మేరకు శుక్రవారం మార్గదర్శకాలను విడుదల చేసింది.

► ఆసక్తికలిగిన రైతులు ఈనెల 15లోగా సంఘాలను ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ సంఘాలను గ్రామస్ధాయి కమిటీలు గుర్తించాల్సి ఉంటుంది.
► పరికరాల కొనుగోలుకు దరఖాస్తు చేసుకునే సంఘాలు గతంలో ఏ బ్యాంకులోనూ రుణ ఎగవేతదారుగా ఉండకూడదు.
► కనిష్టంగా రూ. 12 లక్షల నుంచి రూ. 15 లక్షలు, గరిష్టంగా రూ. 1.20 కోట్ల నుంచి రూ. 1.30 కోట్లను ఆప్కాబ్‌ రుణంగా మంజూరు చేయనుంది.
► గ్రూపులకు యాంత్రిక పరికరాలను సరఫరా చేసిన తరువాతనే ఉత్పత్తిదారులకు రాయితీ మొత్తాలను ప్రభుత్వం జమ చేయనుంది.
► ఈ ఏడాదికి సంబంధించి ఒక గ్రామంలో ఒక సంఘానికే రాయితీపై రుణం అందించనుంది.
► గ్రూపులు తమకు అవసరమైన యాంత్రిక పరికరాలను ఎంపిక చేసుకునేందుకు ఉత్పత్తిదారులతో మండల, జిల్లాస్ధాయిలో ప్రదర్శనలు ఏర్పాటు కానున్నాయి. వీటిని ఈ నెల నాలుగో వారం నుంచి వచ్చేనెల 2 వారం వరకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
► యాంత్రిక పరికరాలను రాయితీపై పొందిన గ్రూపులు.. కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసుకుని అక్కడి ఇతర రైతులకు ఆ పరికరాలను అద్దెకు ఇచ్చుకోవచ్చు. 

మరిన్ని వార్తలు