రైతులకు ప్రభుత్వం మరో తీపి కబురు

7 Aug, 2020 13:37 IST|Sakshi
రుణాల నియమ నిబంధనలపై చర్చిస్తున్న చలపతిరావు

40 శాతం రాయితీతో వ్యవసాయ యంత్రాలు 

డీసీఎంఎస్‌ చైర్మన్‌ చలపతిరావు  

కొడవలూరు: రైతులకు ప్రభుత్వం మరో తీపి కబురు అందించిందని డీసీఎంఎస్‌ చైర్మన్‌ వీరి చలపతిరావు తెలిపారు. స్థానిక ఏఓ కార్యాలయంలో వ్యవసాయాధికారులతో రుణాల నియమ నిబంధనలపై గురువారం  చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల అభ్యున్నతి కోసం అనేక పథకాలు అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం రాయితీ, 50 శాతం రుణం, పది శాతం రైతు వాటాతో రుణాలు మంజూరు చేస్తోందని తెలిపారు. ఈ రుణాలు పొందేందుకు ఒక్కో రైతు భరోసా కేంద్రం పరిధిలో 5 నుంచి 6 మంది రైతులు గ్రూపుగా ఏర్పడాలన్నారు.

వీరంతా ఆర్బీకే పరిధిలో పొలమున్న రైతులు అయి ఉండాల్సి ఉంటుందన్నారు. ఈ నెల 15 లోగా ఆర్బీకేలో రిజిస్టర్‌ చేయించుకోవాలని చెప్పారు. ఒక్కో గ్రూపుకు రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు విలువైన యంత్రాలను అందజేస్తోందన్నారు. ఈ రుణంతో ట్రాక్టర్లు, రోటో వేటర్లు, సీడ్‌ ట్రిల్లర్‌ తదితర యంత్ర పరికరాలు కొనుగోలు చేసి ఆర్బీకే ద్వారా రైతులకు అద్దెకివ్వచ్చన్నారు. తద్వారా వచ్చిన రాబడితో రుణం చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. రుణం మొత్తంలో ప్రభుత్వం 40 శాతం రాయితీగా వస్తే 50 శాతం ఎన్‌డీసీసీబీ రుణమిస్తుందని చెప్పారు. రైతులు వ్యవసాయ యంత్ర పరికరాలను ఎంపిక చేసుకునేందుకు సెప్టెంబరు 2న నెల్లూరు, కావలి, గూడూరు తదితర ప్రాంతాల్లో వివిధ కంపెనీల ఉత్పత్తులతో ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సెప్టెంబరు 15 తేదీ కల్లా ఎన్‌డీసీసీబీ రుణాలు మంజూరు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. అక్టోబరు 2 కల్లా ఆర్బీకేల్లో వ్యవసాయ యంత్రాలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఆసక్తి ఉన్న రైతులు గ్రూపుల రిజిస్టర్‌ చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ ఎల్‌. జ్యోతిరెడ్డి, ఏఓ సీహెచ్‌ఎస్‌ లక్ష్మి, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ గంధం వెంకటశేషయ్య పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు