రాష్ట్రంలో ట్రాఫిక్‌ ఉల్లం‘ఘనులు’ 40 శాతం

30 Oct, 2020 19:00 IST|Sakshi

ట్రాఫిక్‌ ఉల్లంఘనలతో రోజుకు తొమ్మిదిమంది మృత్యువాత

డ్రైవింగ్‌ లైసెన్సు ఉన్నవారి వల్ల గతేడాది 15,303 రోడ్డు ప్రమాదాలు

ప్రతి వంద రోడ్డు ప్రమాదాల్లో 36 మంది మృతి

రోడ్డు ప్రమాదాల్లో గతేడాది మరణించింది 7,984 మంది.. వీరిలో 3,287 మంది ద్విచక్ర వాహనదారులు

ట్రాన్స్‌పోర్టు రీసెర్చి వింగ్‌ అధ్యయనంలో వెల్లడైన అంశాలివి

భారీ జరిమానాలతో రోడ్డు ప్రమాదాలు తగ్గే అవకాశం

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ట్రాఫిక్‌ రూల్స్‌ ఉల్లంఘించే వారు 40 శాతం మంది ఉన్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ తేల్చింది. గత నాలుగేళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదాలను విశ్లేషిస్తూ ట్రాన్స్‌పోర్టు రీసెర్చి వింగ్‌ ఓ నివేదిక వెల్లడించింది. మన రాష్ట్రంలో ప్రమాదాలు, కారణాలు తదితర అంశాలను ఈ నివేదిక విశ్లేషించింది. ట్రాఫిక్‌ ఉల్లంఘనల కారణంతో రోజుకు తొమ్మిదిమంది మృత్యువాత పడుతున్నారు. ప్రతి వంద రోడ్డు ప్రమాదాల్లో 36 మంది దుర్మరణం పాలవుతున్నారు. ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు చెక్‌ పెట్టేందుకు, రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రాణాలు కోల్పోకుండా నిరోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల భారీగా జరిమానాలు పెంచిన సంగతి తెలిసిందే. ఈ జరిమానాల పెంపుతో రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పడతాయని రవాణారంగ నిపుణులు పేర్కొంటున్నారు. 

-2019లో మొత్తం 21,992 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. వీటిలో 15,303 ప్రమాదాలు డ్రైవింగ్‌ లైసెన్సు ఉన్నవారి వల్ల, 1,262 ప్రమాదాలు లెర్నింగ్‌ లైసెన్సు ఉన్నవారి వల్ల, 2,576 రోడ్డు ప్రమాదాలు అసలు డ్రైవింగ్‌ లైసెన్సు లేనివారి వల్ల జరిగాయి. నిబంధనల ఉల్లంఘనల కారణంగా 2,851 ప్రమాదాలు జరిగాయి.
- ట్రాఫిక్‌ ఉల్లంఘనలపై రాష్ట్రంలో రోజూ 80 నుంచి 120 వరకు కేసులు నమోదవుతున్నాయి.
- డ్రైవింగ్‌ లైసెన్సు ఉండి ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడేవారికి పునశ్చరణ తరగతులు నిర్వహించడంపై రవాణా, పోలీస్‌శాఖలు ఆలోచిస్తున్నాయి. 

గతేడాది జరిగిన రోడ్డు ప్రమాదాలను విశ్లేషిస్తే..
- గతేడాది జరిగిన రోడ్డు ప్రమాదాలు: 21,992
- ఈ ప్రమాదాల్లో మృతుల సంఖ్య: 7,984
- తీవ్రంగా గాయపడినవారి సంఖ్య: 24,619
- మృత్యువాత పడిన ద్విచక్రవాహనదారుల సంఖ్య: 3,287
- వీరిలో మహిళల సంఖ్య: 399
- హెల్మెట్‌ ధరించనివారి సంఖ్య: 1,861
- పిలియన్‌ రైడర్స్‌ (వెనుక కూర్చున్న వారు) సంఖ్య: 775
- సీటు బెల్టు ధరించని కారణంగా ప్రాణాలు పోగొట్టుకున్నవారి సంఖ్య: 711
- ఓవర్‌ స్పీడ్‌ కారణంగా జరిగిన రోడ్డు ప్రమాదాలు: 15,383
- ఓవర్‌ స్పీడ్‌ వల్ల మరణించినవారి సంఖ్య: 5,530
- డ్రంకన్‌డ్రైవ్‌ వల్ల మృత్యువాత పడినవారి సంఖ్య: 43
- రాంగ్‌ రూట్లో వచ్చి మరణించినవారి సంఖ్య: 155
- హైవేలపై జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మృతుల సంఖ్య: 2,760

నిర్లక్ష్యంగా వాహనాలు నడిపేవారిపై కఠినచర్యలు
వాహనదారులు సామాజిక బాధ్యతగా తీసుకుంటే రోడ్డు ప్రమాదాలు తగ్గిపోతాయి. నిర్లక్ష్యంగా వాహనాలు నడిపితే తీవ్ర చర్యలుంటాయి. ప్రాణాల విలువ తెలియజేసేందుకే జరిమానాలు పెంచాం. జరిమానాల పెంపుతోనైనా కొంత మార్పు వస్తుందని ఆశిస్తున్నాం. భారీ జరిమానాలతో రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. జరిమానాలతో 40 శాతం ఉల్లంఘనలు సగానికి పైగా తగ్గుతాయని భావిస్తున్నాం. జరిమానాలతో ఆదాయం పెంచుకుందామనేది మా అభిమతం కాదు. - పేర్ని వెంకట్రామయ్య (నాని), రవాణా శాఖ మంత్రి

ఎన్‌ఫోర్సుమెంట్‌ కార్యకలాపాలు పెంచుతాం
వాహనదారులకు క్రమశిక్షణ నేర్పేందుకే ప్రభుత్వం జరిమానాలు పెంచింది. చెల్లుబాటయ్యే లైసెన్సు ఉన్నవారు కూడా రోడ్డు ప్రమాదాలకు కారకులవడం బాధాకరం. డ్రైవింగ్‌ లైసెన్సులు ఇచ్చేందుకు కూడా.. ఆటోమేటెడ్‌ డ్రైవింగ్‌ టెస్ట్‌ ట్రాక్‌లలో పరీక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇకపై ఎన్‌ఫోర్సుమెంట్‌ కార్యకలాపాలు పెరుగుతాయి. - పీఎస్సార్‌ ఆంజనేయులు, రవాణా శాఖ కమిషనర్‌

గత ఆరు నెలల్లో (ఏప్రిల్‌–సెప్టెంబర్‌) ట్రాఫిక్‌ ఉల్లంఘన కేసులు

జిల్లా ఓవర్‌ స్పీడ్‌ లైసెన్సు లేకుండా డ్రైవింగ్‌ చేసినవి
అనంతపురం  320 327
చిత్తూరు 8 269
తూర్పుగోదావరి 30 289
గుంటూరు 1 459
కృష్ణా 1 101
కర్నూలు 147 330
నెల్లూరు 1,926 603
ప్రకాశం 2 146
శ్రీకాకుళం     0 8
విశాఖపట్నం 3,446 302
విజయనగరం 0 42
పశ్చిమగోదావరి 7 722
వైఎస్సార్‌ కడప 0 231
మొత్తం 5,888 3,829

రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల కారణంగా సంభవించిన మరణాలు..
 

సంవత్సరం మరణాలు
2016     8,541
2017 8,060
2018 7,556
2019 7,984
2020 (సెప్టెంబర్‌ వరకు) 4,752

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా