తిరుపతి, రేణిగుంట మీదుగా 45 ప్రత్యేక రైళ్లు

11 Mar, 2021 05:19 IST|Sakshi

సాక్షి , న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో తిరుపతి, రేణిగుంటలను దేశంలోని వివిధ ప్రాంతాలకు కలిపేలా 45 ప్రత్యేక రైళ్లు (డైలీ, నాన్‌డైలీ) నడపుతున్నట్లు కేంద్రం తెలిపింది. ఇవి కాకుండా తిరుమల, తిరుపతి దర్శనానికి ఐఆర్‌సీటీసీ రైలు, రోడ్డు, విమానాల ద్వారా టూర్‌ ప్యాకేజీలు నిర్వహిస్తోందని వైఎస్సార్‌సీపీ సభ్యులు గొడ్డేటి మాధవి, విుథున్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయెల్‌ బుధవారం లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు. 

కొత్త ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ ప్రతిపాదన లేదు
దేశవ్యాప్తంగా ఎక్కడా కొత్త ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసే ప్రతిపాదన లేదని కేంద్రం పేర్కొంది. గడిచిన ఐదేళ్లలో దేశంలో ఎక్కడా ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయలేదని వైఎస్సార్‌సీపీ సభ్యుడు మాగుంట శ్రీనివాసులురెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీపాద నాయక్‌ లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు. 

ఏపీలో 13, తెలంగాణలో 30
డిజిటల్‌ విలేజ్‌ పథకంలో భాగంగా ఏపీలో 13, తెలంగాణలో 30 గ్రామాలు గుర్తించినట్లు కేంద్రం తెలిపింది. వైఎస్సార్‌సీపీ సభ్యుడు వైఎస్‌ అవినాష్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు ఐటీశాఖ సహాయ మంత్రి సంజయ్‌ ధోత్రే లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

ఏపీకి 20,28,899 ఇళ్లు మంజూరు
ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (అర్బన్‌) కింద, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి 20,28,899 ఇళ్లు మంజూరు చేశామని, ఈ ఏడాది మార్చి 1వ తేదీ నాటికి 3,60,325 ఇళ్ల నిర్మాణం పూర్తయిందని కేంద్రం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌కు మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణం కోసం రూ.89,377 కోట్ల పెట్టుబడిలో కేంద్ర వాటా రూ.30,731 కోట్లుగా ఉందని, అందులో ఇప్పటి వరకు కేంద్ర వాటా రూ.9,311 కోట్లు విడుదల చేశామని రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు ప్రశ్నకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. 

ఉడాన్‌లో సాగర్, ప్రకాశం బ్యారేజీలు
ఉడాన్‌ పథకంలో భాగంగా వాటర్‌ ఏరో డ్రోమ్‌ నిర్మాణానికి నాగార్జున సాగర్, ప్రకాశం బ్యారేజీలను గుర్తించినట్లు కేంద్రం వెల్లడించింది. టీఆర్‌ఎస్‌ ఎంపీ బండ ప్రకాశ్‌ ప్రశ్నకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పూరి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.  

మరిన్ని వార్తలు