ఏపీ: థర్డ్‌వేవ్‌కు 462 ప్రైవేటు ఆస్పత్రులు సిద్ధం

8 Aug, 2021 09:06 IST|Sakshi

వీటిలో 33 వేలకు పైగా డీటైప్‌ ఆక్సిజన్‌ సిలిండర్లు 

సాక్షి, అమరావతి: కరోనా థర్డ్‌వేవ్‌ వచ్చినా ధీటుగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. ఇందులో భాగంగా బోధనాస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాలతోపాటు 462 ప్రైవేటు ఆస్పత్రులను కూడా సిద్ధం చేస్తోంది. ప్రైవేటులో చాలావరకు 50 నుంచి 100 పడకలలోపు ఆస్పత్రులున్నాయి. 100 పడకలకంటే ఎక్కువ ఉన్న ఆస్పత్రులు 65 ఉన్నాయి. కరోనా సేవల్లో భాగంగా ఈ ప్రైవేటు ఆస్పత్రులు 33,793 డీటైప్‌ ఆక్సిజన్‌ సిలిండర్లను సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే 17,841 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను కూడా అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది.

సాధారణ పడకలతోపాటు ఆక్సిజన్‌ పడకలు కూడా సిద్ధం చేసి ఉంచాలని ఆదేశించింది. ఎలాంటి సమయంలో రోగులు వచ్చినా సేవలు అందించాలని కోరింది. ఈ నెల చివరి నాటికి అన్ని ఆస్పత్రుల్లో సౌకర్యాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటోంది. కాగా, అత్యధికంగా గుంటూరు జిల్లాలో 63, కృష్ణా జిల్లాలో 60 ప్రైవేటు ఆస్పత్రులు ఉన్నట్టు తేలింది. అత్యల్పంగా అనంతపురం జిల్లాలో 11 మాత్రమే ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చదువుతున్న నర్సింగ్, పారామెడికల్, ఫార్మసీ, ఎంబీబీఎస్, పీజీ వైద్య విద్యార్థులను సైతం కోవిడ్‌ సేవల్లో వినియోగించుకోనుంది.  

మరిన్ని వార్తలు