42,313 ఎకరాల్లో 5 పారిశ్రామిక పార్కులు 

14 Dec, 2020 04:57 IST|Sakshi

మూడు కారిడార్లలో మల్టీ ప్రొడక్ట్‌ పారిశ్రామిక పార్కుల అభివృద్ధి 

తొలిదశలో 13,292 ఎకరాల్లో అభివృద్ధికి ప్రణాళిక

నిక్‌డిట్‌ నిధులతో చేపట్టే విధంగా ఏపీఐఐసీ ప్రణాళిక

ఇప్పటికే కృష్ణపట్నం పార్కుకు రూ.1,314 కోట్లు విడుదల చేసిన నిక్‌డిట్‌

కొప్పర్తి, శ్రీకాళహస్తి, నక్కపల్లి పార్కులకు మాస్టర్‌ ప్లాన్‌ రూపకల్పన

డీపీఆర్‌ తయారీలో ఓర్వకల్లు పార్కు 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏర్పాటు చేసే పరిశ్రమలకు అన్ని రకాల వసతులు ఒకేచోట కల్పించే విధంగా అయిదు భారీ పారిశ్రామిక పార్కులను ఆంధ్రప్రదేశ్‌ ఇండ్రస్టియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ (ఏపీఐఐసీ) అభివృద్ధి చేస్తోంది. రాష్ట్రంలోని మూడు పారిశ్రామిక కారిడార్లలో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ నేషనల్‌ ఇండ్రస్టియల్‌ కారిడార్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఇంప్లిమెంటేషన్‌ ట్రస్ట్‌ (నిక్‌డిట్‌) నిధులతో అయిదు మల్టీ ప్రొడక్ట్‌ పార్కులను అభివృద్ధి చేసే విధంగా ఏపీఐఐసీ ప్రణాళిక సిద్ధం చేసింది. మూడు పారిశ్రామిక కారిడార్లలో వీటిని అభివృద్ధి చేస్తున్నారు. విశాఖ–చెన్నై ఇండ్రస్టియల్‌ కారిడార్‌ (వీసీఐసీ)లో ఏడీబీ రుణంతో చేపడుతున్న ప్రాజెక్టులకు అదనంగా మూడు పార్కులు, చెన్నై–బెంగళూరు కారిడార్, హైదరాబాద్‌–బెంగళూరు కారిడార్‌లలో ఒక్కొక్కటి వంతున అభివృద్ధి చేస్తున్నారు.

విసీఐసీలో నక్కపల్లి, శ్రీకాళహస్తి, కొప్పర్తి, చెన్నై–బెంగళూరు కారిడార్‌లో కృష్ణపట్నం, హైదరాబాద్‌–బెంగళూరు కారిడార్‌లో ఓర్వకల్లు పారిశ్రామిక పార్కులను 42,313 ఎకరాల్లో అభివృద్ధి చేయాలని ఏపీఐఐసీ ప్రణాళిక సిద్ధం చేసింది. దీన్లో తొలిదశగా 13,292 ఎకరాల్లో మల్టీ ప్రొడక్ట్‌ పారిశ్రామిక పార్కుల అభివృద్ధికి నిధులు మంజూరు చేసేందుకు నిక్‌డిట్‌ సూత్రప్రాయం అంగీకారం తెలిపింది. కృష్ణపట్నం పార్కులో 2,500 ఎకరాల్లో అభివృద్ధికి రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికకు ఆమోదం తెలపడమే కాకుండా రూ.1,314 కోట్లు మంజూరు చేసింది. త్వరలోనే కృష్ణపట్నం పార్కు పనులకు టెండర్లు పిలవనున్నట్లు ఏపీఐఐసీ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు. అదేవిధంగా శ్రీకాళహస్తిలో 2,500 ఎకరాల్లో, కొప్పర్తిలో 2,596 ఎకరాల్లో, నక్కపల్లిలో 3,196 ఎకరాల్లో పార్కులను అభివృద్ధి చేయడానికి నిక్‌డిట్‌ నిధులతో మాస్టర్‌ప్లాన్‌ రూపొందిస్తున్నట్లు, ఓర్వకల్లుకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారు చేస్తున్నట్లు వివరించారు.

24 గంటలూ నీరు 
నాణ్యమైన విద్యుత్, నీరు అందిస్తే ఎంత ధరైనా చెల్లించడానికి పారిశ్రామికవేత్తలు ముందుకువస్తున్నారు. రాయితీల కంటే మౌలికవసతులు ప్రధానమని సీఐఐ, ఐఎస్‌బీ, అసోచామ్‌ వంటి సంస్థలు రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేశాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఈ పారిశ్రామిక పార్కుల్లో ఉమ్మడి మౌలిక వసతుల కల్పనతోపాటు నాణ్యమైన విద్యుత్, నీరు నిరంతరాయంగా అందించే విధంగా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. కొప్పర్తి, శ్రీకాళహస్తి పారిశ్రామిక పార్కులకు సోమశిల జలాశయం నుంచి, ఓర్వకల్లుకు శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ నుంచి, విశాఖపట్నంలోని పరిశ్రమలకు పోలవరం ద్వారా నీరందించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ పారిశ్రామిక పార్కులను జాతీయ రహదారులకు అనుసంధానం చేస్తూ అంతర్గత రహదారుల అభివృద్ధి, ఉమ్మడి మురుగునీటి శుద్ధి వంటి ఇతర మౌలిక వసతులు కల్పించనున్నారు.  

మరిన్ని వార్తలు