అనాథ నివాసంలో రూ.10 లక్షలు 

18 May, 2021 16:05 IST|Sakshi

తిరుపతిలో టీటీడీ సత్రం స్వాధీనంతో బయటపడ్డ నోట్లు, నాణేలు

లెక్కించేందుకు 4.30 గంటల సమయం పట్టిన వైనం 

సాక్షి, తిరుపతి: తిరుమల కొండే ఆధారంగా బతికిన అనాథ వృద్ధుడి నివాసంలో ఏకంగా రూ.10 లక్షలు లభించిన ఉదంతం తిరుపతిలో చోటు చేసుకుంది. ఏడాది క్రితం మరణించిన వృద్ధుడి నివాసాన్ని స్వాదీనం చేసుకునేందుకు వచ్చిన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులకు సోమవారం ఇల్లంతా నోట్ల కట్టలు, నాణేలు కనిపించడంతో వారు బిత్తరపోయారు. వివరాల్లోకెళ్తే.. తిరుమల గుడి చుట్టూ కొన్ని వందల కుటుంబాలు ఉండేవి. తిరుమల విస్తరణలో భాగంగా అక్కడ ఉంటున్న వారికి తిరుపతి శేషాచలనగర్‌లో టీటీడీ వసతి గృహాలను నిర్మించి ఇచ్చింది. ఈ క్రమంలో శ్రీనివాసాచారి అనే వ్యక్తికి కూడా అక్కడే ఇల్లు కేటాయించింది.

ఆయన ఒంటరివాడు.. బంధువులు, వారసులు ఎవరూ లేరు. తిరుమలకు వచ్చే భక్తులకు స్వామి వారి పసుపు దారాలు, అక్షింతలు ఇచ్చి వారిచ్చిన నగదు తీసుకునేవాడు. ఈ నగదును తన నివాసంలోని ట్రంకుపెట్టెలో, చిన్న చిన్న లడ్డు కవర్లలో భద్రపరిచాడు. గతేడాది అనారోగ్యంతో శ్రీనివాసాచారి మరణించడంతో ఇరుగుపొరుగు అంత్యక్రియలు చేశారు. సోమవారం ఆయన ఇంటిని స్వాదీనం చేసుకోవడానికి వెళ్లిన టీటీడీ అధికారులు షాక్‌ తిన్నారు. ఇంటిలో ఎక్కడ చూసినా డబ్బులే. లడ్డు కవర్ల నిండా నోట్లు, నాణేలే. దీంతో అధికారులు ఆ నగదు మొత్తాన్ని లెక్కించగా ఇందుకు ఏకంగా 4.30 గంటల సమయం పట్టింది. సుమారు రూ.10 లక్షలు ఉన్నట్టు తేలింది. ఈ మొత్తాన్ని స్వామి వారి హుండీకి జమ చేయనున్నారు.  

చదవండి: ఆ చిన్నారుల అకౌంట్లలో రూ.10లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్

మరిన్ని వార్తలు