పంటల్లో పంట పండుతోంది

15 Sep, 2022 11:55 IST|Sakshi

పెరవలి(తూ.గో.జిల్లా): కృషితో నాస్తి దుర్భిక్షం అన్న సూక్తి ఈ అభ్యుదయ రైతులకు అక్షరాలా సరిపోతుంది. పుడమి తల్లిని నమ్ముకుని సాగు చేయటమే ఈ రైతులకు నిన్నటి వరకూ తెలుసు. కానీ నేడు రైతుల కోసం ప్రభుత్వం చేస్తున్న కృషికి ఫిదా అయిన వీరు అంతర పంటల సాగుతో వినూత్న రీతిలో దిగుబడులు సాధిస్తూ నాలుగు కాసులు వెనకేసుకుంటున్నారు. అంతర పంటలు సాగు చేయాలంటే పెరవలి రైతులే చేయాలనే రీతిలో ముందుకు “సాగు’తున్నారు.

ఏ పంట వేస్తే లాభాలు ఆర్జించవచ్చో, ఎప్పుడు వేస్తే మంచి దిగుబడి పొందవచ్చో ఇక్కడి రైతులు బాగా ఒంట పట్టించుకున్నారు. వాణిజ్య పంటల దిగుబడి అందే సమయంలో మార్కెట్‌లో గిట్టుబాటు ధర లేకపోవడం, ప్రకృతి వైపరీత్యాల వంటి వాటితో తీవ్రంగా నష్టపోతున్న రైతులను అంతర పంటలు ఆర్థికంగా ఆదుకుంటున్నాయి. జిల్లాలో 5 వేల ఎకరాల్లో అంతర పంటలు సాగు చేస్తుండగా.. ఒక్క పెరవలి మండలంలోనే సుమారు 1,500 ఎకరాల్లో ఈ సాగు జరుగుతోంది. అంతర పంటలు వేసే వారిలో ఎక్కువగా కౌలు రైతులే ఉండటం విశేషం. రైతులతో పాటు కూలీలు, వాహనదారులు, సంచుల వ్యాపారులు కలిపి సుమారు 60 వేల మంది అంతర పంటల ద్వారా జీవనం సాగిస్తున్నారు. 

పండించుకుంటున్నారిలా.. 

►  మెట్ట ప్రాంతంలోని కొబ్బరిలో అరటి, కూరగాయలు, పూలు సాగు చేస్తుంటే, డెల్టాలో పూలు, అరటి, కూరగాయలు, పండ్లు పండిస్తున్నారు. 

►  గతంలో వాణిజ్య పంటలైన కొబ్బరిలో అరటి, కోకో వేస్తే ఇప్పుడు కోకోతో పాటు పూలు, వరి, కొత్తిమీర, బీర, అరటి వంటివి సాగు చేస్తున్నారు. 

► అరటిలో గతంలో ఆకుకూరలు సాగుచేస్తే ఇప్పుడు పిలక నాటిన నుంచి ఏదో ఒక పంట వేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా బంతి, ఆకుకూరలు, పచ్చిమిర్చి, కూరగాయలు సాగు చేస్తున్నారు. 

►  బొప్పాయిలో పూలసాగు, కొబ్బరిలో కంది, జామలో బొప్పాయి వంటి పంటలు వేస్తూ మంచి ఫలసాయం పొందుతూ లాభాలు ఆర్జిస్తున్నారు. 

►  అరటి పంట 9 నెలలకు కానీ చేతికి రాదు. ఇతర వాణిజ్య పంటల ద్వారా 11 నెలలకు కానీ ఆదాయం రాదు. అప్పటి వరకూ పెట్టుబడి పెట్టాల్సిందే. ఇదే సమయంలో స్వల్పకాలిక అంతర పంటల ద్వారా రైతులు 40 నుంచి 90 రోజుల్లోనే ఫలసాయం పొందుతున్నారు. 

► వాణిజ్య పంటలకు ఏడాది పొడవునా పెట్టుబడి పెట్టాల్సి ఉండగా, ఈ పంటలకు స్వల్పంగా అంటే రూ.వందల్లో పెట్టుబడి పెడితే నిత్యం అధికంగా ఆదాయం లభిస్తోంది. దీనిని వాణిజ్య పంటలకు వినియోగించడంతో ఆర్థిక భారాన్ని రైతులు తగ్గించుకుంటున్నారు. 

►  అంతర పంటల్లో కలుపు అంతంత మాత్రంగానే ఉండటం రైతులకు కలిసివస్తోంది.  

మరిన్ని వార్తలు