పంజాబ్‌ పర్యటనకు 50 మంది ఏపీ విద్యార్థులు 

2 Aug, 2022 03:07 IST|Sakshi
జెండా ఊపి విద్యార్థుల పర్యటనను ప్రారంభిస్తున్న విజయవాడ స్టేషన్‌ డైరెక్టర్‌ ప్రసాద్, పీఆర్‌వో నస్రత్‌ మండ్రూప్కర్‌ తదితరులు

రైల్వేస్టేషన్‌ (విజయవాడ పశ్చిమ): 75 ఏళ్ల స్వతంత్ర భారత ప్రస్థానం సందర్భంగా ప్రధాని మోదీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ప్రజలు ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఎంపిక చేసిన విద్యార్థులు ఇతర రాష్ట్రాలను సందర్శించేలా కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ‘ఏక్‌ భారత్‌–శ్రేష్ట భారత్‌’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం రూపొందించింది. ఈ మేరకు సమగ్ర శిక్ష, ఏపీ విద్యాశాఖ 13 జిల్లాలలోని జెడ్పీ హైస్కూల్స్‌ నుంచి 25 మంది విద్యార్థులతో పాటు, కేంద్రీయ విద్యాసంస్థలు, నవోదయా విద్యాలయాలు, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు, ఏపీ మోడల్‌ స్కూల్స్‌ నుంచి మరో 25 మంది విద్యార్థులను పంజాబ్‌ రాష్ట్ర పర్యటనకు ఎంపిక చేసింది.

5 రోజుల పాటు సాగే ఈ పర్యటనలో విద్యార్థులు అక్కడి మ్యూజియాలు, స్మారక కట్టడాలు సందర్శించి, అక్కడి సంస్కృతి, చరిత్రకు సంబంధించిన విషయాలను నేరుగా సందర్శించి తెలుసుకుంటారు. పలు క్రీడా పోటీల్లో పాల్గొంటారు. దేశ సంస్కృతి, సంప్రదాయాలు, ఆహార అలవాట్లపై జరిగే సెమినార్‌లో పాల్గొంటారు. సోమవారం రైలులో పంజాబ్‌కు బయలుదేరిన విద్యార్థులను విజయవాడ రైల్వే స్టేషన్‌ డైరెక్టర్‌ ప్రసాద్, పీఆర్‌వో నస్రత్‌ మండ్రూప్కర్‌ అభినందించారు. పచ్చజెండా ఊపి జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో విద్యార్థులను సాగనంపారు.  

మరిన్ని వార్తలు