మంగళగిరిలో 51 అడుగుల పరమ శివుడి విగ్రహం.. ఆవిష్కరించిన దత్తన్న

22 Aug, 2022 19:19 IST|Sakshi
51అడుగుల పరమ శివుడి విగ్రహం

మంగళగిరి (గుంటూరు): మంగళగిరిలో గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి (శివాలయం) వద్ద దాతలు మాదల వెంకటేశ్వరరావు, గోపికృష్ణ, వెంకటకృష్ణ దంపతులు నిర్మించిన 51 అడుగుల పరమ శివుడి విగ్రహాన్ని హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో గవర్నర్‌ మాట్లాడుతూ సభలో పేర్లు చదివే సమయంలో ఒక్క మహిళ పేరు కూడా  లేకపోవడం బాధాకరమన్నారు.

తాను గతంలో మంగళగిరి విచ్చేసిన సందర్భంలో నృసింహస్వామి వారిని దర్శించుకోవడం జరిగిందన్నారు. 51 అడుగుల పరమశివుడి విగ్రహాన్ని నిర్మాణం చేసిన మాదల వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులు తనచేత ఆవిష్కరింపచేయడం సంతోషంగా ఉందన్నారు.   రెండు తెలుగు రాష్ట్రాలలో చేనేత పరిశ్రమ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించి సహకరిస్తానని తెలిపారు.  

తొలుత బీజేపీ నాయకుడు జగ్గారపు శ్రీనివాసరావు నివాసంలో అల్పాహారం స్వీకరించి అనంతరం లక్ష్మీనృసింహస్వామి వారిని, గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి వారిని దర్శించుకోగా ఆలయ ఈఓలు ఏ.రామకోటిరెడ్డి, జేవీ నారాయణలు ఆలయ మర్యాదలతో స్వాగతం పలకగా అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, మున్సిపల్‌ మాజీ  చైర్మన్‌ గంజి చిరంజీవి, మార్కెట్‌ యార్డు చైర్మన్‌ మునగాల భాగ్యలక్ష్మి, శివాలయం ట్రస్ట్‌ బోర్టు చైర్‌పర్సన్‌ నేరెళ్ల లక్ష్మీరాధిక, బోర్డు సభ్యులు కొల్లి ముసలారెడ్డి, కొల్లి వెంకటబాబూరావు, అద్దంకి వెంకటేశ్వర్లు, నక్కా సాంబ్రాజ్యం, రేఖా వకులాదేవి, జంపని చిన్నమ్మాయి తదితరులు పాల్గొన్నారు. 


పరమ శివుడి విగ్రహ ఆవిష్కరణ అనంతరం కొబ్బరికాయ కొట్టిన గవర్నర్‌ దత్తాత్రేయ

దేశం సుభిక్షంగా ఉండాలన్నదే ఆకాంక్ష.. 
గుంటూరు మెడికల్‌: ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా దేశంలోని ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేశారని, దేశం మొత్తం సుభిక్షంగా ఉండాలన్నదే తమ ఆకాంక్ష అని హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ అన్నారు. ఆదివారం గుంటూరు అమరావతి రోడ్డులోని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చందు సాంబశివరావు గృహంలో ఆయన విందు స్వీకరించారు.

పలువురు బీజేపీ నేతలు గవర్నర్‌ను కలిసి పూలమాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ దత్తాత్రేయ గుంటూరు నగర బీజేపీ నేతలతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తెలంగాణలో మాదిరిగా అలై బలై కార్యక్రమాన్ని ఏపీలో కూడా నిర్వహిస్తామన్నారు. గుంటూరులో ఉన్న శ్రేయోభిలాషులను కలిసేందుకు వచ్చినట్లు తెలిపారు. గవర్నర్‌ను కలిసిన వారిలో బీజేపీ నేతలు మాగంటి సుధాకర్‌ యాదవ్, జూపూడి రంగరాజు, యడ్లపాటి స్వరూపారాణి, మాధవరెడ్డి, రంగ, వెలగలేటి గంగాధర్, విజయ్, భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ, పారిశ్రామిక వేత్త అరుణాచలం మాణిక్యవేల్, విశ్రాంత డీఎస్పీ కాళహస్తి సత్యనారాయణ, ఉన్నారు.  

మరిన్ని వార్తలు