22 రోడ్ల విస్తరణకు రూ.540 కోట్లు

23 Aug, 2022 03:58 IST|Sakshi

319 కి.మీ. మేర రోడ్ల నిర్మాణానికి ఆమోదం

సీఆర్‌ఐఎఫ్‌ నిధులతో చేపట్టేందుకు నిర్ణయం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రహదారుల అభివృద్ధి దిశగా మరో ముందడుగు పడింది. కేంద్ర రహదారుల మౌలిక వసతుల అభివృద్ధి నిధి (సీఆర్‌ఐఎఫ్‌) నుంచి రాష్ట్రంలో 22 రహదారులను విస్తరించి.. కొత్త రోడ్లు నిర్మించే ప్రణాళికను ఆమోదించారు. ఇందులో భాగంగా మొత్తం 319 కిలోమీటర్ల మేర రహదారులను అభివృద్ధి చేయనున్నారు. వాటిలో జిల్లా ప్రధాన రహదారులు 13, రాష్ట్ర హైవేలు 7, ఇతర రహదారులు 2 ఉన్నాయి. జిల్లా కేంద్రాలు, జాతీయ రహదారిని అనుసంధానించే ప్రధాన రహదారులను సీఆర్‌ఐఎఫ్‌ నిధులతో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది.

ఈ మేరకు ప్రతిపాదనలను రూపొందించి కేంద్ర ఉపరితల రవాణా శాఖకు సమర్పించింది. రాష్ట్ర ప్రభుత్వం తొలి దశలో 9 రహదారులు, మలి దశలో 13 రహదారుల నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపింది. కాగా, ఈ ప్రణాళికపై సంతృప్తి చెందిన కేంద్ర ప్రభుత్వం ఒకే దశ కింద మొత్తం 22 రహదారుల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఇందుకోసం ఏకంగా రూ.540 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో ఆ రహదారుల విస్తరణ, అభివృద్ధి పనులను ఆర్‌ అండ్‌ బీ శాఖ చేపడుతుంది. త్వరలో టెండర్ల ప్రక్రియ చేపట్టి ఏడాదిలో ఈ రహదారుల నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.  

మరిన్ని వార్తలు