ఎన్నికలకు 55,840 మంది సిబ్బంది

1 Mar, 2021 05:05 IST|Sakshi

పోలింగ్‌కు సన్నద్ధమవుతున్న పురపాలక శాఖ

మార్చి మొదటివారంలో రెండు విడతల్లో శిక్షణ 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 12 నగరపాలక సంస్థలు, 75 పురపాలక సంఘాలు/నగర పంచాయతీలకు మార్చి 10న నిర్వహించనున్న ఎన్నికల కోసం పురపాలక శాఖ సర్వసన్నద్ధమవుతోంది. రాష్ట్రంలో 9,308 పోలింగ్‌ కేంద్రాల్లో ఒకేసారి నిర్వహించనున్న ఈ భారీ పోలింగ్‌ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు అంతేస్థాయిలో ఎన్నికల సిబ్బందిని వినియోగించాలని నిర్ణయించింది. అందుకు వివిధ స్థాయిల్లో అధికారులు, సిబ్బంది కలిపి మొత్తం 55,840 మందిని భాగస్వాములను చేయనుంది. అందుకోసం జిల్లాల వారీగా, ఎన్నికలు జరగనున్న స్థానిక సంస్థల వారీగా ప్రతిపాదనలను రూపొందించి ఆమోదించింది. ఆ వివరాలు..

► మున్సిపల్‌ ఎన్నికల కోసం మొత్తం 55,840 మంది అధికారులు, సిబ్బందిని వినియోగించనున్నారు. వారిలో రిటర్నింగ్‌ అధికారులు, అదనపు రిటర్నింగ్‌ అధికారులు, సహాయ రిటర్నింగ్‌ అధికారులతోపాటు ఇతర అధికారులు, సిబ్బంది ఉంటారు.
► ఎన్నికలు జరగనున్న 12 నగరపాలక సంస్థల్లో మహా విశాఖపట్నం (జీవీఎంసీ) మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ 1,712 పోలింగ్‌ కేంద్రాల్లో మొత్తం 17.52 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందుకు రాష్ట్రంలోనే అత్యధిక సంఖ్యలో 10,271 మంది అధికారులు, సిబ్బందిని కేటాయించారు. 
► అలాగే, నగరపాలక సంస్థల్లో మచిలీపట్నంలో తక్కువ మంది పోలింగ్‌ సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. ఇక్కడ 133 పోలింగ్‌ కేంద్రాల్లో 1.33 లక్షల మంది మాత్రమే ఓటు హక్కువినియోగించుకోనున్నారు. ఇందుకు 799 మంది అధికారులు, సిబ్బందిని కేటాయించారు. 
► మరోవైపు.. ఎన్నికలు జరగనున్న పురపాలక సంఘాలు/నగర పంచాయతీల్లో నంద్యాలకు అత్యధికంగా ఎన్నికల సిబ్బందిని కేటాయించారు. 170 పోలింగ్‌ కేంద్రాల్లో 1.86 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇక్కడ 1,084 మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. అలాగే, కర్నూలు జిల్లా గూడూరులో తక్కువ మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వర్తించనున్నారు. 20 వార్డుల్లో 50,758 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్న ఈ నగర పంచాయతీలో కేవలం 120 మంది సిబ్బందిని మాత్రమే కేటాయించారు. 

సిబ్బందికి రెండు విడతలుగా శిక్షణ 
ఇక ఎన్నికల నిర్వహణకు అధికారులు, సిబ్బంది గుర్తింపు ప్రక్రియ దాదాపు కొలిక్కి వచ్చింది. పురపాలక శాఖతోపాటు ఇతర ప్రభుత్వ శాఖలు, వార్డు సచివాలయాల సిబ్బందిని ఎన్నికల విధుల కోసం వినియోగించనున్నారు. ఎన్నికలకు అవసరమని భావించిన మొత్తం 55,840 మందికి గాను ఆదివారం నాటికి 48,141 మందిని గుర్తించారు. వారిలో 43,012 మందిని విధుల్లో నియమించారు. మిగిలిన వారిని సోమవారం గుర్తించి నియామక ప్రక్రియ పూర్తిచేస్తారు. ఇక ఎన్నికల సిబ్బందికి రెండు విడతలుగా శిక్షణ ఇవ్వనున్నారు. మార్చి 1, 2 తేదీల్లో మొదటి విడత.. 6, 7 తేదీల్లో రెండో విడత శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు.   

మరిన్ని వార్తలు