పట్టణ పేదలకు ఆరోగ్య ధీమా

24 Nov, 2020 03:57 IST|Sakshi

111 పట్టణాల్లో 560 ఆరోగ్య కేంద్రాలు

ప్రతి 26,500 మందికి ఒక ఆస్పత్రి

ఒక్కోదాన్లో ఆరు పడకలు

ఫిబ్రవరి నుంచి అందుబాటులోకి 1.6 కోట్ల మంది పట్టణవాసులకు వరం

సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలే కాదు.. పట్టణ పేదలకూ సర్కారు ఆరోగ్య ధీమా ఇచ్చింది. పట్టణాల్లో పేదలు, మధ్యతరగతి వారు ఆస్పత్రుల ఖర్చు భరించలేనంతగా పెరగడంతో వారి ఆరోగ్యానికి భరోసా ఇస్తూ 560 పట్టణ ఆరోగ్యకేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఇవి అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో 1.60 కోట్ల మంది పట్టణాల్లో ఉన్నారు. అందులో 37 శాతంమంది మురికివాడల్లో ఉంటున్నారు. వైద్యం అవసరమైనవారు పెద్దాస్పత్రులకు వెళ్లడం ఇబ్బందిగా ఉంది. ప్రైవేటు డాక్టరు దగ్గరికి వెళితే ఫీజు, వ్యాధి నిర్ధారణ పరీక్షల బిల్లులు భరించలేనంతగా ఉంటున్నాయి. దీంతో వారు ఆరోగ్యపరంగాను, ఆర్థికంగాను మరింత చితికిపోతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం.. పట్టణాల్లో ఉన్న పేదలకు వైద్యం అందుబాటులో ఉండాలన్న లక్ష్యంతో పట్టణ ఆరోగ్యకేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న 260 పట్టణ ఆరోగ్యకేంద్రాలను, 71 కుటుంబ ఆరోగ్యకేంద్రాలను (మొత్తం 331) ఉన్నతీకరిస్తూ, కొత్తగా 229 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. భవనాల నిర్మాణం, మరమ్మతులు, పరికరాలు, ఫర్నిచర్‌ కోసం రూ.416.50 కోట్లు వెచ్చిస్తున్నారు. ఈ కేంద్రాల్లో వైద్యులు, ల్యాబ్‌టెక్నీషియన్లు, డేటాఎంట్రీ ఆపరేటర్లు, సహాయక సిబ్బంది 560 మంది వంతున, స్టాఫ్‌ నర్సులు 1,120 మంది ఉంటారు. 

దేశంలోనే మొదటిసారిగా..
దేశంలో ఇప్పటివరకు ఏ రాష్ట్రమూ పట్టణాల్లో ప్రాథమిక ఆరోగ్యంపై ఇంత భారీస్థాయిలో ఏర్పాట్లు చేసిన దాఖలాలు లేవు. తొలిసారిగా 111 మున్సిపాలిటీల్లో 560 ఆరోగ్యకేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది మన రాష్ట్రంలోనే. స్పెషాలిటీ వైద్యానికి ఎలాగూ బోధనాస్పత్రులున్నాయి. ప్రాథమిక ఆరోగ్యం అంటే.. చిన్న జ్వరాలు, గాయాలు వంటి వాటికి ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించకుండా భారీవ్యయంతో పట్టణ ఆరోగ్యకేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేకంగా 8,600కుపైగా వైఎస్సార్‌ హెల్త్‌క్లినిక్‌లు ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే.

పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో సేవలు ఇలా
► పట్టణాల్లో ఉన్న వారికి 15 నిమిషాల నడక దూరంలో ఆస్పత్రి ఉంటుంది.
► డాక్టరు, స్టాఫ్‌ నర్సుతో పాటు అత్యవసర వైద్యసేవలకోసం ఆరు పడకలుంటాయి.
► 63 రకాల రోగనిర్ధారణ పరీక్షలు అందుబాటులో..
► ప్రస్తుతం 260 వరకు పట్టణ ఆరోగ్యకేంద్రాలు పీపీపీ పద్ధతిలో నడుస్తున్నాయి.
​​​​​​​► వీటికోసం ఏటా రూ.150 కోట్లు ప్రైవేటు సంస్థలకు ఇస్తున్నారు.
​​​​​​​► ఇదే రూ.150 కోట్లతో అంతకంటే మెరుగ్గా 560 కేంద్రాల్లో సేవలు అందిస్తారు.
​​​​​​​► తాజా పట్టణ జనాభా ప్రకారం 26,500 మందికి ఒక ఆరోగ్యకేంద్రం ఉంటుంది.
​​​​​​​► గతంలో పీపీపీ కింద అమలవుతున్న ఆరోగ్యకేంద్రాలు 79 పట్టణాల్లో మాత్రమే ఉండేవి.
​​​​​​​► ఇప్పుడు 111 పట్టణాల్లోనూ ఆరోగ్యకేంద్రాల సేవలు అందుతాయి. 

మరిన్ని వార్తలు