ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 60 రైతుబజార్లు

6 Aug, 2021 02:57 IST|Sakshi

రూ.52.02 కోట్లతో నిర్మాణం

ఇప్పటికే ఆరు అందుబాటులోకి..

మిగిలినవి డిసెంబర్‌ నాటికి పూర్తి

ఆరు వేల మంది రైతులకు ప్రయోజనం

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రైతుబజార్లు వస్తున్నాయి. పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన నగరాలు, పట్టణాలతో పాటు మండల కేంద్రాల్లో కూడా వీటి ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఆరు రైతుబజార్లను వినియోగంలోకి తీసుకురాగా మిగిలిన వాటిని డిసెంబర్‌ కల్లా అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన నగరాలు, పట్టణాల్లో 107 రైతుబజార్లున్నాయి. వీటి ద్వారా ప్రతిరోజూ 11వేల మంది రైతులు జీవనోపాధి పొందుతున్నారు. ప్రతీరోజు 150 నుంచి 200 మెట్రిక్‌ టన్నుల కూరగాయలను రైతులు గిట్టుబాటు ధరలకు విక్రయిస్తున్నారు. ఒక్కో రైతుబజార్‌లో ప్రతిరోజు రూ.20 లక్షల నుంచి రూ.40లక్షల వరకు వ్యాపారం జరుగుతుందని అంచనా. బహిరంగ మార్కెట్లతో పోల్చుకుంటే తక్కువ ధరలకు నాణ్యమైన కూరగాయలు, నిత్యావసరాలు అందుబాటులో ఉండడంతో రైతుబజార్లకు ప్రజలు బాగా అలవాటుపడ్డారు. 

ఏళ్ల తరబడి ప్రతిపాదనలు పెండింగ్‌
పెరుగుతున్న జనాభాకనుగుణంగా కొత్త రైతుబజార్ల ఏర్పాటు ప్రతిపాదన ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంది. స్థలాలు అందుబాటులో లేకపోవడం.. ఆర్థిక పరిస్థితుల సాకుతో గత ప్రభుత్వం కొత్త రైతుబజార్ల ఏర్పాటుపై దృష్టి పెట్టలేదు. ఈ నేపథ్యంలో.. రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌ సర్కారు.. ఎక్కువ మందికి అందుబాటు ధరల్లో నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పంతో కొత్త రైతుబజార్లకు సంకల్పించింది. ఇందులో భాగంగా రూ.52.02 కోట్లతో 60 రైతుబజార్లను ఏర్పాటుచేస్తోంది.

వీటిలో ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాలో రాయవరం, ఆలమూరు, వైఎస్సార్‌ జిల్లాలోని ప్రొద్దుటూరు, కర్నూలు జిల్లాలోని పత్తికొండ, ఆత్మకూరు, ఆళ్లగడ్డలలో రైతుబజార్లను దివంగత మహానేత వైఎస్సార్‌ జయంతి రోజైన రైతు దినోత్సవం నాడు సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభించారు. మిగిలిన 54 రైతుబజార్లకు కూడా శంకుస్థాపన చేశారు. ఇప్పటికే వీటి కోసం అవసరమైన స్థలాలను గుర్తించారు. అత్యధికంగా తూర్పుగోదావరిలో 16, కృష్ణాలో 10, చిత్తూరులో 8, వైఎస్సార్‌ జిల్లాలో 5, ప్రకాశం, విశాఖ, విజయనగరం జిల్లాల్లో మూడేసి, అనంతపురంలో 2, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున ఏర్పాటుచేస్తున్నారు. కొత్తగా ఏర్పాటుచేస్తున్న ఈ రైతుబజార్ల ద్వారా కనీసం 6వేల మంది రైతులకు మేలు జరుగుతుందని అంచనా వేస్తున్నారు. 

మరిన్ని వార్తలు