దొడ్డ మనస్సులు వారిని నడిపిస్తున్నాయ్‌

26 Jul, 2022 12:44 IST|Sakshi

600 మందికి జైపూర్‌ కృత్రిమ కాళ్లు, చేతుల ఏర్పాటు

రెడ్‌క్రాస్‌ సంస్థ సహకారంతో రూ.1.50 కోట్లతో ఉపకరణాలు

కొలతలు తీసుకున్న తయారీదారులు

వెల్లివిరుస్తున్న ఆనందం

విధి వారి జీవితాల్లో విషాదం నింపింది. దొడ్డ మనస్సులు వారిని నడిపిస్తున్నాయి. ప్రమాదాలు, అనారోగ్య పరిస్థితుల్లో కాళ్లు కోల్పోయి వీల్‌ చైర్లకు.. పాకడానికి పరిమితమైన వారిని కృత్రిమ కాళ్లు నడిపిస్తున్నాయి. జిల్లా రెడ్‌క్రాస్‌ సంస్థ ఎంతో మంది నిర్భాగ్యులకు జైపూర్‌ కృత్రిమ కాళ్లు, చేతులు అందిస్తోంది. మూడు రోజులుగా దివ్యాంగులు కృత్రిమ అవయవాల కోసం కొలతలు ఇచ్చేందుకు తరలివచ్చారు. తమ జీవితాల్లో కొత్త వెలుగులు రాబోతున్నాయని ఆనంద పరవశులు అవుతున్నారు.  

నెల్లూరు (అర్బన్‌): సేవకు ప్రతి రూపం పేరును సార్థకం చేస్తూ జిల్లా రెడ్‌క్రాస్‌ సంస్థ తమ కార్యకలాపాలు కొనసాగిస్తోంది. దివ్యాంగులకు నాలుగైదేళ్లకోసారి జైపూర్‌ కృత్రిమ కాలు, చేతులు అందిస్తోంది. కోవిడ్‌ నేపథ్యంలో రెండేళ్లకు పైగా కృత్రిమ అవయవాలు పొందేందుకు దివ్యాంగులకు బ్రేక్‌ పడింది.

దెబ్బతిన్న కృత్రిమ అవయవాలను మార్చుకోవాలనుకునే అభాగ్యులు, కొత్తగా ప్రమాదాలు, జబ్బుల కారణంగా కాలు, చేయి పోగొట్టుకున్న వారు కృత్రిమ అవయవాల కోసం ఎదురు చూస్తున్నారు. రెడ్‌క్రాస్‌ జిల్లా చైర్మన్‌ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి సారథ్యంలో కలెక్టర్‌ చక్రధర్‌బాబు సహకారంతో ఒకరికి కాదు.. ఇద్దరికి కాదు  సుమారు 600 మందికి పైగా దివ్యాంగులకు జైపూర్‌ కృత్రిమ కాలు, చేయి ఏర్పాటు చేసేందుకు పూనుకోవడం రెడ్‌క్రాస్‌ తొలిసారిగా ఈ బృహత్‌ కార్యానికి శ్రీకారం చుట్టి చరిత్ర సృష్టించింది. దివ్యాంగుల జీవితాల్లో కొంత మేరకైనా వెలుగులు ప్రసాదించేందుకు పూనుకుంది. ఈ శిబిరాన్ని కలెక్టర్‌ చక్రధర్‌బాబు ప్రారంభించి అభినందించారు.  

సుమారు 600 మందికి ఉపకరణాలు 
అనేక మంది దివ్యాంగులు కృత్రిమ అవయవాలను కావాలని అడుగుతుండడంతో రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ చంద్రశేఖర్‌రెడ్డి కమిటీ సభ్యులతో చర్చించారు. ఈ విషయాన్ని కలెక్టర్‌ చక్రధర్‌బాబు వద్దకు తీసుకెళ్లి 200 మంది దివ్యాంగులకు  కృత్రిమ అవయవాలు ఏర్పాటు చేయిస్తామన్నారు. దీనిపై స్పందించిన కలెక్టర్‌ 200 మంది కాదు కనీసం 500 మందికైనా కృత్రిమ అవయవాలు  ఇవ్వండి.. అంటూ ప్రోత్సహించారు. ఈ క్రమంలో 500 మందికి కృత్రిమ కాలు, చేతులను ఏర్పాటు చేసేందుకు ఈ నెల 23 నుంచి స్థానిక మద్రాస్‌ బస్టాండ్‌ వద్ద ఉన్న రెడ్‌క్రాస్‌ కార్యాలయంలో మూడు రోజుల పాటు కొలతలు తీసుకునేందుకు ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అయితే తొలి రోజే 540 మంది తమ పేర్లు రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. సుమారు 600 మించివచ్చని రెడ్‌క్రాస్‌ నిర్వాహకులు పేర్కొంటున్నారు.
   
సంస్థల సహకారం భేష్‌  
రెడ్‌క్రాస్‌ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి రాయచూరుకు చెందిన రాజ్మల్‌ కేమ్‌ భండారి ఫౌండేషన్, జైపూరుకు చెందిన భగవాన్‌ మహావీర్‌ వికలాంగుల సహాయతా సమితి తమ పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నాయి. తాము 1000 మందికైనా కృత్రిమ కాలు, చేయి అమర్చేందుకు సాయం చేస్తామంటూ ముందుకువచ్చాయి. వీరి సేవా నిరతికి దివ్యాంగులు తమ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు.  

రూ 1.50 కోట్ల ఖర్చు 
రెడ్‌క్రాస్‌ సంస్థ భోజనం, ఇతర వసతుల కోసం చేసే ఖర్చుతో పాటు ఫౌండేషన్‌ సంస్థలు అందించే కృత్రిమ కాలు, చేతుల ఏర్పాటుకయ్యే ఖర్చును పరిశీలిస్తే సుమారు రూ 1.50 కోట్లు ఖర్చు కానుందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ఊహించిన వారి కన్నా ఎక్కువ మంది వస్తుండటంతో ఖర్చు కూడా పెరిగే అవకాశముందని పేర్కొంటున్నారు.

రెడ్‌క్రాస్‌ సంస్థకు రుణపడి ఉంటా 
నేను నెల్‌కాస్ట్‌ కంపెనీలో కార్మికుడిని. డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తుండగా బైపాస్‌ రోడ్డులో జరిగిన ప్రమాదంలో 5 నెలల క్రితం నా కాలును డాక్టర్లు తొలగించారు. దీంతో ఇంటికే పరిమితమయ్యాను. జైపూర్‌ కాలు గురించి వినడమే తప్ప ఎవరి వద్దకు వెళ్లి ఏర్పాటు చేయించుకోవాలో తెలియలేదు. రెడ్‌క్రాస్‌ నా విషయం తెలుసుకుని కృత్రిమ కాలు ఏర్పాటు శిబిరానికి రావాలని నా ఫోన్‌కు మెసేజ్‌  పంపించారు. ఇప్పుడు వచ్చి కొలతలు ఇచ్చాను. నన్ను పిలిపించి కృత్రిమ కాలు ఏర్పాటు చేయిస్తున్న రెడ్‌క్రాస్‌ వారికి రుణపడి ఉంటా.                                
– కాకాణి రామకృష్ణ, బత్తలాపురం, ఓజిలి మండలం 

ఏడు నెలల క్రితమే ప్రణాళిక 
కొంత మంది తమకు కృత్రిమ చేయి, కాలు ఏర్పాటు చేయమని కోరారు. అవయవాలు కోల్పోయిన దివ్యాంగులకు జైపూర్‌ కాలు చేయి ఏర్పాటు చేయించాలని 7 నెలల క్రితమే అనుకున్నాం. తమ పాలకవర్గ సభ్యులతో చర్చించాను. అందరి సహకారంతో కలెక్టర్‌కు తెలిపాం. కలెక్టర్‌ వెన్నుతట్టి ప్రోత్సహించారు. రాజ్మల్‌ కేమ్‌ భండారి ఫౌండేషన్, భగవాన్‌ మహావీర్‌ వికలాంగుల సహాయతా సమితి సహకారంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయించాం.   
– పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, రెడ్‌క్రాస్‌ జిల్లా చైర్మన్‌ 

నాలాంటి పేదకు వరం కృత్రిమ కాలు  
నేను లారీ క్లీనర్‌ను. నాకు జరిగిన ప్రమాదంలో 2014లో ఆపరేషన్‌ చేసి డాక్టర్లు కాలు తీసేశారు. తర్వాత కొంత మంది దాతలు లోకల్‌గా తయారైన కాలును అమర్చారు. అయితే అది సెట్‌ కాలేదు. స్టీలు రాడ్‌ కూడా ఇచ్చారు. సెట్‌ కాలేదు. విధిలేని పరిస్థితుల్లో ఇంటికే పరిమితమయ్యాను. అయితే ఇప్పుడు రెడ్‌క్రాస్‌ ఖరీదైన, క్వాలిటీ ఉన్న జైపూర్‌ కాలును ఏర్పాటు చేసేందుకు కొలతలు తీసుకున్నారు. నాలాంటి పేదకు కృత్రిమ కాలు వరం.  
– ఎస్‌కే సందాని, వెంకటేశ్వరపురం, నెల్లూరు 

కందుకూరు రామమ్మ.. వైఎస్సార్‌ జిల్లా రైల్వే కోడూరుకు చెందిన ఈమె కూలి పని చేసుకునే నిరుపేదరాలు. దురదృష్టవశాత్తు ఆమెకు డయాబెటీస్‌ మిల్లిటస్‌ (షుగర్‌) వ్యాధికి గురైంది. షుగర్‌ కంట్రోల్‌ తప్పింది. కాలుకు గాయమై రక్త సరఫరా తగ్గిపోయింది. దీంతో రక్తసరఫరా తగ్గిన వరకు కాలును తీసేయాలని లేదంటే మిగతా కాలు కూడా పనికి రాదని డాక్టర్లు తెలిపారు. బాధాకరమైనప్పటికీ ఆమెకు డాక్టర్లు ఆపరేషన్‌ చేసి ఒక కాలును తొలగించారు. ఇది జరిగి రెండేళ్లు మించి పోయింది. అప్పటి నుంచి ఇంటికే పరిమితమైంది. నడిచేందుకు వీలులేకుండా పోయింది. రెడ్‌క్రాస్‌ ఏర్పాటు చేసిన కృత్రిమ అవయవాల శిబిరం గురించి ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు ప్రాంతం వెందోడుకు చెందిన రామమ్మ చెల్లెలు కుమార్తె పావనికి తెలిసింది. దీంతో పావని తమ పిన్నిని నెల్లూరు రెడ్‌క్రాస్‌ కార్యాలయానికి తీసుకువచ్చింది. కృత్రిమ కాలు ఏర్పాటుకు కొలతలు ఇచ్చింది. ఈ సంద్భంగా ఆమె మాట్లాడుతూ తనకు కృత్రిమ కాలు  కాలు ఏర్పాటు చేస్తే నడుస్తానని ఆనందంగా చెప్పింది.  

మరిన్ని వార్తలు