AP: 66 మందికి డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి

14 Dec, 2022 12:54 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 66 మంది తహసీల్దార్లు, సెక్షన్‌ అధికారులు, సూపరింటెండెంట్‌ క్యాడర్‌ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ కలె­క్టర్లుగా పదోన్నతులు ఇచ్చింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌ మంగళవారం జీవోఎంఎస్‌ నంబర్‌ 747 జారీచేశారు. వివిధ శాఖల్లో డిప్యూటీ కలెక్టర్‌ క్యాడర్‌ అధికారుల అవసరం పెరగడం, కొత్తగా 24 రెవెన్యూ డివిజన్‌ కేంద్రాల ఏర్పాటు, జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ఇటీవల ప్రభుత్వం రెవెన్యూ శాఖలో 66 కొత్త డిప్యూటీ కలెక్టర్‌ పోస్టులను మంజూరు చేసింది.

ప్రస్తుతం జిల్లాల్లో పనిచేస్తున్న తహసీల్దార్లు, రాష్ట్ర సచివాలయం, రాష్ట్ర హెచ్‌వోడీ కార్యాలయాల్లో పనిచేస్తున్న సెక్షన్‌ అధికారులు, సూపరింటెండెంట్‌లకు పదోన్నతులు ఇచ్చి ఈ పోస్టుల్ని భర్తీచేసింది. పదోన్నతుల కోసం ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున అధికారుల పేర్లను ఎంపికచేసి 198 మందితో 2022–23 సంవత్సరం అడ్‌హాక్‌ ప్యానల్‌ తయారు చేసింది. 

ఈ నెల 8వ తేదీన జరిగిన డిపా­ర్ట్‌­మెంటల్‌ ప్రమోషన్‌ కమిటీ (డీపీసీ) సమావేశంలో ఈ జాబితా నుంచి 66 మందిని డిప్యూటీ కలెక్టర్లుగా ఎంపికచేశారు. ఆ జాబితాను ప్రభుత్వం ఆమోదించింది. పదోన్నతులు తాత్కాలికమని జీవోలో పేర్కొన్నారు. పదోన్నతులు పొందిన అధికారులంతా వెంటనే వెలగపూడి సచివాలయంలోని జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌లో రిపోర్టు చేయాలని జీవోలో స్పష్టం చేశారు.

ఒకేసారి ఇంతమంది తహ­సీల్దార్‌ క్యాడర్‌ అధికారులకు పదోన్నతులు రావడం రెవెన్యూ శాఖలో చర్చనీయాంశంగా మారింది. గత ఏడాది డిప్యూటీ తహసీల్దార్ల నుంచి తహసీల్దార్లుగా ప్రభుత్వం పెద్దఎత్తున పదోన్నతులు ఇచ్చింది. వీటికోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూడగా చివరికి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం వారి కోరిక నెరవేర్చింది. తాజాగా తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు ఇవ్వడం ద్వారా ఎంతోకాలంగా వాటికోసం ఎదురుచూస్తున్న వారి కలను నెరవేర్చింది.

మరిన్ని వార్తలు