బతికుండగానే తండ్రికి నరకం చూపిన 'పల్లె' ముఖ్య అనుచరుడు.. 67 ఏళ్ల వృద్ధుడి ఆత్మహత్య

29 Dec, 2022 13:16 IST|Sakshi

పున్నామనరకం నుంచి తప్పించువాడు పుత్రుడంటారు. కానీ ఊరందరికీ నీతులు చెప్పే ఓ పచ్చనేత తండ్రికి మాత్రం బతికుండగానే నరకం చూపించాడు. వేళకింత భోజనం కూడా పెట్టకుండా వేధించాడు. ప్రభుత్వం ఇచ్చే సామాజిక పింఛన్‌ కూడా లాగేసుకునే కుమారుడు.. తనను తీవ్రంగా వేధించడాన్ని భరించలేని ఆ 67 ఏళ్ల వృద్ధుడు పాఠశాల భవనం పైనుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. 

సాక్షి, పుట్టపర్తి అర్బన్‌: పుట్టపర్తి నగర పంచాయతీ పరిధిలోని ఎనుములపల్లికి చెందిన గుట్లపల్లి అంజినప్ప (67)కు ఒక్కగానొక్క సంతానం గుట్లపల్లి గంగాధర్‌. అంజినప్ప భార్య 15 ఏళ్ల క్రితమే మరణించగా...కుమారుడి వద్దే కాలం గడుపుతున్నాడు. పల్లె రఘునాథరెడ్డి ముఖ్య అనుచరుడైన గంగాధర్‌ ఆస్తి అంతా రాయించుకుని తండ్రి బాగోగులు పూర్తిగా విస్మరించాడు.

కనీసం వేళకింత భోజనం కూడా పెట్టేవాడు కాదు. చివరకు ప్రభుత్వం అందించే వృద్ధాప్య పింఛన్‌ డబ్బు కూడా లాగేసుకునేవాడు. దీంతో అంజినప్ప వృద్ధాప్యంలో తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవాడు. ఇటీవల కుమారుడు ఈసడింపులు ఎక్కువకావడంతో మనోవేదనకు గురైన అంజినప్ప బుధవారం రాత్రి 9 గంటల సమయంలో ఇంటి పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాల భవనం పైకెక్కి కిందకుదూకి ఆత్మహత్య చేసుకున్నారు.

అయితే దీన్ని సాధారణ మరణంగా చిత్రీకరించిన గంగాధర్‌... గుట్టు చప్పుడు కాకుండా తండ్రి మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చి ఆవరణలో ఉంచాడు. దీన్ని చుట్టుప్రక్కల వారు గమనించడంతో విషయం పోలీసుల వరకూ చేరింది. ఈ విషయంపై అర్బన్‌ సీఐ బాలసుబ్రహ్మణ్యంరెడ్డిని వివరణ కోరగా... సంఘటన గురించి తమకూ తెలిసిందని, కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి పంపుతామన్నారు.    

మరిన్ని వార్తలు