లేటు వయసులోనూ నీట్‌ రాశారు.. పేదలకు వైద్య సేవలు అందించాలని 69 ఏళ్ల విశ్రాంత ప్రొఫెసర్ సంకల్పం..

8 May, 2023 08:59 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: పేదలకు వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో 69 ఏళ్ల వయసులోనూ ఎంబీబీఎస్‌ చేసేందుకు సంకల్పించారు విశ్రాంత ప్రొఫెసర్‌ డీకేఏఎస్‌ ప్రసాద్‌. సేవాభావం ముందు వయసు ఎప్పుడూ చిన్నదేనంటున్న ప్రసాద్‌ విజయనగర్‌లోని కేంద్రీయ విద్యాలయం కేంద్రంలో ఆదివారం నీట్‌ పరీక్ష రాశారు. ఎంబీఏ, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌లో పట్టభద్రుడైన ప్రొఫెసర్‌ ప్రసాద్‌ అవంతి ఇంజనీరింగ్‌ కాలేజీలో అధ్యాపకునిగా పనిచేశారు. కరోనా సమయంలో అధ్యాపక వృత్తికి స్వస్తి చెప్పారు.

హోమియో వైద్యంపై కొంత అవగాహన ఉన్న ప్రొఫెసర్‌ ప్రసాద్‌ పేదలకు వైద్య సేవలందిస్తున్నారు. ప్రతి ఆదివారం ఉచిత హోమియో వైద్య శిబిరాలు నిర్వహిస్తూ.. హోమియో మందులను ఉచితంగా ఇస్తున్నారు. ఎంతో అభిమానం, అభిరుచి గల వైద్య వృత్తిని కొనసాగించాలంటే ఆయనకు పట్టా లేదు. ఎంబీబీఎస్‌ చదవకుండా వైద్య వృత్తి చేయడం ఇబ్బందికరంగా ఉంటుందన్న ఆలోచనతో ఆయన నీట్‌కు దరఖాస్తు చేశారు.  

వయో పరిమితి ఎత్తివేయడంతో..
నీట్‌ పరీక్ష రాయడానికి ఇప్పుడు వయసు నిబంధనలేవీ లేవు. గతంలో 21 సంవత్సరాలలోపు వయసు వారికి మాత్రమే నీట్‌ పరీక్షకు అనుమతి ఉండేది. నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ గతేడాది నీట్‌ అర్హత కోసం వయోపరిమితిని ఎత్తివేయడంతో.. వైద్యుడు కావాలన్న ఆ­కాంక్షను తీర్చుకునే గొప్ప అవకాశం ప్రొఫెసర్‌ ప్రసాద్‌కు లభించింది. ఆయన దరఖాస్తు చేసిన వెంటనే హాల్‌టికెట్‌ రాగా.. ఆదివారం పరీక్షకు హాజరయ్యారు.

పరీక్ష బాగా రాశానని.. తనకున్న అనుభవం వల్ల పరీక్షలో ర్యాంక్‌ సాధిస్తానన్న నమ్మకం ఉందని చెప్పారు. వైద్యం ఖరీదైన వ్యవహారంగా మారిపోయిన తరుణంలో.. తాను పట్టా తీసుకుంటే పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించే అవకాశం దక్కుతుందన్న ఆలోచనతో పరీక్ష రాశానన్నారు.
చదవండి: ఉన్నత విద్యే లక్ష్యం

మరిన్ని వార్తలు