పోలీసుల స్పందనతో 693 మందికి ఊపిరి

8 May, 2021 04:09 IST|Sakshi
విజయవాడ జీజీహెచ్‌ ఆస్పత్రిలోని ఆక్సిజన్‌ ప్లాంట్‌లోకి ప్రాణవాయువును నింపుతున్న ట్యాంకర్‌

గ్రీన్‌చానల్‌తో విజయవాడకు ఆక్సిజన్‌ ట్యాంకర్‌

సాక్షి, అమరావతి/సాక్షి, అమరావతి బ్యూరో: రాష్ట్ర పోలీసులు సకాలంలో.. వేగంగా స్పందించి 693 మందికి ఊపిరి అందేలా చేశారు. విజయవాడ గవర్నమెంట్‌ జనరల్‌ ఆస్పత్రి (జీజీహెచ్‌)లో ఆక్సిజన్‌ విభాగంలో చికిత్స పొందుతున్న 693 మందికి ముప్పు తప్పించారు. ఆక్సిజన్‌ ట్యాంకర్‌ను వేగంగా రప్పించి వారిని ఆదుకున్నారు. ఈ ఆస్పత్రికి 18 టన్నుల ఆక్సిజన్‌తో ఒడిశాలోని జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ ఫ్యాక్టరీ నుంచి వస్తున్న ట్యాంకర్‌కు గురువారం అర్ధరాత్రి దాటాక ట్రాకింగ్‌ వ్యవస్థతో సంబంధాలు తెగిపోయాయి. ట్యాంకర్‌ సకాలంలో రాకపోతే ఆస్పత్రిలోని 693 మందికి ప్రాణాపాయమని కలవరపడిన వైద్యులు.. విజయవాడ నగర పోలీస్‌ కమిషనర్‌ బి.శ్రీనివాసులుకు సమాచారం అందించారు. వెంటనే ఆయన ఒడిశా నుంచి విజయవాడ వరకు అన్ని జిల్లాల ఎస్పీలను అప్రమత్తం చేశారు.

ఒడిశా నుంచి వస్తున్న ఆక్సిజన్‌ ట్యాంకర్‌ తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు సమీపంలోని ధర్మవరం వద్ద ఓ దాబాలో ఉన్నట్టు ఆ జిల్లా పోలీసులు గుర్తించారు. ఇక్కడ ఎందుకు ఆపేశావని ట్యాంకర్‌ డ్రైవర్‌ను ప్రశ్నించారు. తాను బయలుదేరిన చోటునుంచి విజయవాడ దాదాపు 878 కిలోమీటర్ల దూరం ఉందని, ఏకధాటిగా డ్రైవింగ్‌ చేయడం వల్ల తీవ్రంగా అలసిపోయి ఆపినట్లు డ్రైవర్‌ తెలిపారు. అరక్షణం ఆలస్యం చేయకుండా మెరుపువేగంతో స్పందించిన పోలీసులు డ్రైవింగ్‌ అనుభవం ఉన్న హోంగార్డుతో ట్యాంకర్‌ను అక్కడి నుంచి విజయవాడకు పంపించారు.

ఆ ట్యాంకర్‌ సకాలంలో విజయవాడ చేరుకునేలా తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో పోలీసులు ప్రత్యేక బందోబస్తుతో గ్రీన్‌చానల్‌ ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు. ట్యాంకర్‌ విజయవాడ చేరుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సకాలంలో స్పందించి ఆక్సిజన్‌ ట్యాంకర్‌ వేగంగా వచ్చేలా చేసి వందలమంది ప్రాణాలు కాపాడిన పోలీసులకు సెల్యూట్‌ చేస్తున్నట్లు డీజీపీ డి.గౌతమ్‌ సవాంగ్‌ చెప్పారు. రాష్ట్ర పోలీసులు కోవిడ్‌ ఆస్పత్రులకు సకాలంలో ఆక్సిజన్‌ అందేలా గ్రీన్‌ చానల్‌ ఏర్పాటు, ఎస్కార్ట్‌ వంటి సేవల్ని అందిస్తున్నారని అభినందించారు. 

మరిన్ని వార్తలు