‘జగనన్న తోడు’కు భారీగా దరఖాస్తులు

18 Oct, 2020 19:27 IST|Sakshi

వీధుల్లో చిరు వ్యాపారులకు రూ.10 వేల వడ్డీ లేని రుణం

వీరిని గుర్తించి ఆదుకోవాలని నిర్ణయించిన తొలి సర్కారు ఇదే

గుర్తింపు కార్డుల జారీకి ఆదేశం

జిల్లా స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశాలు

 నెలాఖరులోగా రుణాల మంజూరు పూర్తి - ఇప్పటిదాకా బ్యాంకులకు అందిన దరఖాస్తులు 3.58 లక్షలు- 1.70 లక్షల దరఖాస్తులకు ఆమోదం.. మిగతావి పరిశీలనలో

సాక్షి, అమరావతి : ఉదయం నుంచి సాయంత్రం వరకు వీధుల్లో తిరుగుతూ, వీధుల పక్కన కూర్చొని పూలు అమ్ముకోవడం లేదా తోపుడు బండిపై సరుకులు విక్రయిస్తే గానీ ఆ రోజు జీవనం గడవని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఎండనక, వాననక ప్రతి రోజు కష్టపడే వీరిని గుర్తించి, ఆదుకోవాలని ఆలోచిం‍చిన తొలి సర్కారు వైఎస్సార్‌సీపీనే. పాదయాత్రలో వారి కష్టాన్ని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా చూశారు. రోజువారీ వ్యాపారానికి వడ్డీ వ్యాపారి వద్ద అప్పు తెచ్చుకుని ఇక్కట్లు పడుతుండటాన్ని గమనించారు. అధికారంలోకి వచ్చాక వారందరికీ వడ్డీ లేకుండా పది వేల రూపాయలు రుణం ఇస్తానని ప్రకటించారు. 

-ఇందులో భాగంగానే ప్రభుత్వం ప్రస్తుతం 10 లక్షల మంది వీధి (చిరు) వ్యాపారులను గుర్తించాలని లక్ష్యంగా పెట్టుకుంది. వారందరికీ గుర్తింపు కార్డులు జారీ చేసి, వాటి ఆధారంగా ‘జగనన్న తోడు’ పథకం ద్వారా బ్యాంకులతో వడ్డీ లేకుండా పది వేల రూపాయలు రుణం ఇప్పించేందుకు రంగం సిద్ధం చేసింది.  
-ఇప్పటి వరకు రాష్ట్రంలో ఈ పథకం కోసం గ్రామ, వార్డు వలంటీర్లు 6,33,737 మంది వీధి వ్యాపారుల రికార్డులను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. ఇందులో ఇప్పటి వరకు 3,58,811 దరఖాస్తులను బ్యాంకులకు సమర్పించగా, 1,70,060 దరఖాస్తులకు ఆమోదం తెలిపాయి. మిగతావి పరిశీలనలో ఉన్నాయి.
-గుర్తింపు కార్డులు ఉన్న వారికి రూ.పది వేల వరకు రుణాలు విరివిగా ఇవ్వాలని ముఖ్యమంత్రి రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇందుకోసం జిల్లా స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది.
-అర్హుల జాబితాలను గ్రామ, వార్డు సచివాలయాల నోటీసు బోర్డుల్లో ఉంచి సామాజిక తనిఖీ నిర్వహిస్తారు. ఇప్పటి వరకు బ్యాంకు అకౌంట్‌ లేని వారికి కొత్తగా పొదుపు అకౌంట్‌ ప్రారంభించేలా వలంటీర్లే తోడ్పాటు అందిస్తారు.

వీళ్లందరూ అర్హులే.. 
- గ్రామాలు, పట్టణాల్లో సుమారు 5 అడుగుల పొడవు, ఐదు అడుగుల వెడల్పు స్థలంలో, అంతకంటే తక్కువ స్థలంలో శాశ్వత లేక తాత్కాలిక షాపులు ఏర్పాటు చేసుకుని ఉండాలి.
- రోడ్డు పక్కన, పుట్‌పాత్‌ల పైన, ప్రజా, ప్రైవేట్‌ స్థలాల్లో తోపుడు బండ్లపై వ్యాపారాలు చేసుకుంటున్న వారు,  తల మీద గంపలో వస్తువులు మోస్తూ అమ్ముకునే వారూ అర్హులే.
- సైకిల్‌, మోటార్‌ సైకిల్‌, ఆటోలపై వెళ్లి వ్యాపారం చేసుకునే వారు.
- చిరు వ్యాపారి వయస్సు 18 ఏళ్లు నిండి ఉండాలి. కుటుంబ ఆదాయం గ్రామాల్లో నెలకు రూ.10 వేల లోపు, పట్టణాల్లో రూ.12 వేల లోపు కలిగి ఉండాలి.
- ఆధార్, ఓటరు కార్డు లేదా ప్రభుత్వం జారీ చేసిన ఇతర గుర్తింపు కార్డు కలిగి ఉండాలి.

జిల్లా పేరు      లబ్ధిదారుల సంఖ్య (ప్రస్తుతానికి)
అనంతపురం 55,850
చిత్తూరు 44,709
తూర్పు గోదావరి 64,055
గుంటూరు     59,108
కృష్ణా 48,031
కర్నూలు     43,483
ప్రకాశం     33,418
నెల్లూరు     39,004
శ్రీకాకుళం 36,459
విశాఖపట్టణం     44,998
విజయనగరం     30,151
పశ్చిమ గోదావరి 87,784
వైఎస్సార్‌ కడప 46,687
మొత్తం     6,33,737

మరిన్ని వార్తలు