10th Class Exams: టెన్త్‌లో ఈ ఏడాదీ 7 పేపర్లే..

18 Dec, 2021 13:18 IST|Sakshi

సాక్షి, అమరావతి: వచ్చే మార్చిలో జరగనున్న 2021–22 విద్యాసంవత్సరపు పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలను 11 పేపర్లకు బదులు 7 పేపర్లలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్‌ శుక్రవారం జీవో నంబర్‌ 79ను విడుదల చేశారు.

కోవిడ్‌ కారణంగా పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలను ఈ ఏడాది కూడా ఏడు పేపర్లకు కుదిస్తున్నట్లు పేర్కొన్నారు. 2021–22 విద్యాసంవత్సరంలో టెన్త్‌ పరీక్షలకు 6 లక్షల మందికి పైగా హాజరుకానున్నారు. కరోనా ఉధృతి కారణంగా 2019–20, 2020–21లో టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలను 11 పేపర్లకు బదులు ఏడింటికి కుదించిన సంగతి తెలిసిందే. అయినా పరీక్షలను నిర్వహించలేకపోయారు. 2019–20 విద్యాసంవత్సరంలో విద్యార్థులను ఆల్‌పాస్‌గా ప్రకటించి మార్కులు, గ్రేడ్లు లేకుండా ధ్రువపత్రాలు ఇచ్చారు. దీనివల్ల విద్యార్థులు ఆపై తరగతుల్లో చేరేందుకు, కొన్ని ఉద్యోగాలకు దరఖాస్తు చేసేందుకు సమస్యలు ఎదుర్కొన్నారు. 

2020–21లో కూడా టెన్త్‌ పరీక్షలను నిర్వహించలేక విద్యార్థులను ఆల్‌పాస్‌గా పేర్కొన్నప్పటికీ..  వారి పైచదువులకు, ఉద్యోగాలకు ఇబ్బంది రాకుండా ఉండేందుకు వారి అంతర్గత మార్కులను అనుసరించి గ్రేడ్లు ప్రకటించారు. రిటైర్డ్‌ ఐఏఎస్‌ ఛాయారతన్‌ నేతృత్వంలోని హైపవర్‌ కమిటీ  సిఫార్సుల మేరకు టెన్త్, ఇంటర్‌ విద్యార్థులకు వారి అంతకు ముందరి తరగతుల్లోని అంతర్గత మార్కుల ఆధారంగా గ్రేడ్లు కేటాయించారు. 2020లో 6,37,354 మంది, 2021లో 6,26,981 మంది టెన్త్‌ విద్యార్థులకు ఇలా అంతర్గత మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇచ్చారు.    

మరిన్ని వార్తలు