తల్లిదండ్రులూ జీవచ్ఛవాలై కూలిపోయారు..

19 Dec, 2020 08:40 IST|Sakshi

రెండో రోజు నాలుగు మృతదేహాలు లభ్యం 

ఆరుకు చేరిన మృతుల సంఖ్య

వెలుతురు లేని కారణంగా గాలింపు చర్యలు నిలిపివేత  

నెలలోపే తొమ్మిది మందిని పొట్టనపెట్టుకున్న పెన్నా

ఇది పెన్నమ్మ మిగిల్చిన గర్భశోకం.. ఎన్నో ఆశలు.. మరెన్నో ఆకాంక్షలు.. బిడ్డలతో పాటు గల్లంతయ్యాయి.. కన్నబిడ్డలపై కన్నవారు పెట్టుకున్న కోటి కలలు నీటిపాలయ్యాయి. సరదాగా ఇంటి నుంచి వెళ్లిన తమ గారాల బిడ్డ.. ఇక లేడు.. ఇక రాడని తెలిసిన క్షణం.. ఆ ఇంట తీరని పెను విషాదం నింపింది.. ఉన్నత చదువులు చదివించాలని.. ఉన్నతంగా చూసుకోవాలని.. మురిసిపోయిన ఆ తల్లిదండ్రులకు మరచిపోలేని చేదు నిజంగా మిగిలింది.. చెట్టంత కొడుకు.. శవమై పడిఉంటే.. తల్లిదండ్రులూ జీవచ్ఛవాలై కూలిపోయారు.. దేవుడా.. ఎందుకు మాకీ శిక్ష.. అంటూ దిక్కులు పిక్కటిల్లేలా రోదించారు.. దిక్కులేని వాళ్లమయ్యామంటూ.. గుండెలవిసేలా విలపించారు.. ఇది .. పెన్నమ్మ మిగిల్చిన గర్భశోకం..  

సాక్షి, కడప: వారంతా ఒకేచోట కలిసి చదువుకున్నారు...మంచి స్నేహితులయ్యారు. తోటి మిత్రుడు శివకుమార్‌ తండ్రి రామచంద్రయ్య చనిపోతే వారంతా తల్లడిల్లిపోయారు... అందరూ కలిసి 150 కిలోమీరర్లు ప్రయాణించి ఆయన వర్ధంతి కార్యక్రమంలోనైనా పాల్గొందామని తిరుపతి వద్ద ఉన్న కొర్లగుంట నుంచి సిద్దవటం వచ్చారు. కొందరు ఇంట్లో వాళ్లకు చెప్పి రాగా, మరికొందరు చెప్పకుండానే వచ్చారు. కార్యక్రమం పూర్తయిన తర్వాత సరదాగా పెన్నానదిలోకి దిగిన వారు ప్రవాహానికి కొట్టుకుపోయి గల్లంతయ్యారు.

కలిసిమెలసి వచ్చిన ఏడుగురు స్నేహితులు మరణంలోనూ స్నేహాన్ని వీడలేదు. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ సంఘటన చోటుచేసుకోగా అదేరోజు సాయంత్రానికి సోమశేఖర్, రాజేష్‌ మృతదేహాలు లభించాయి. శుక్రవారం ఉదయం 7.30 గంటలకు యశ్వంత్‌(16), సతీష్‌(18)ల మృతదేహాలు బయటపడగా, మధ్యాహ్నానికి షణ్ముగ శ్రీనివాస్‌(19), తరుణ్‌(17) మృతదేహాలు లభ్యమయ్యాయి. మొత్తం ఆరుగురి మృతదేహాలు లభించాయి. జగదీశ్వర్‌రెడ్డి(19)  ఆచూకీ  లభ్యం కాలేదు. వెలుతురు లేని కారణంగా శుక్రవారం సాయంత్రానికి గాలింపు చర్యలు నిలిపివేశారు.   చదవండి: (వివాహేతర సంబంధం: నడిరోడ్డుపై భార్యను చంపేశాడు)

ఒకే కుటుంబంలో ముగ్గురు
పెన్నానదిలో గల్లంతై చనిపోయిన వారిలో సోమశేఖర్, యశ్వంత్‌ అన్నదమ్ములు కాగా, మరో మృతుడు షణ్ముగ శ్రీనివాస్‌(18) వారి అత్త కుమారుడు కావడం విశేషం. ఒకే కుటుంబం నుంచి ముగ్గురు మృత్యువాత పడటంతో వారి కుటుంబ సభ్యులను ఓదార్చడం ఎవరివల్లా కాలేదు. షణ్ముగ శ్రీనివాస్‌ శ్రీ చైతన్య జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ పూర్తి చేశాడు. డిగ్రీలో చేరాల్సి ఉంది. ఇతని తల్లి జి. మునిపార్వతి టీటీడీలో పనిచేస్తుండగా, తండ్రి చెంగల్రాయుడు కూలి పనులుచేసి కుటుంబాన్ని పోషిస్తున్నారు.   చదవండి: (నవ జంట ఆత్మహత్య.. మొదటి భర్త అండమాన్‌లో..)

కుటుంబానికొక్కరు మృత్యువాత  
►తిరుపతికి చెందిన పార్థసారధి, రుక్మిణి కుమారుడు చెన్నకోణం యశ్వంత్‌(16). మృతిచెందిన వారందరిలో చిన్నవాడు. సోమశేఖర్‌కు ఇతను తమ్ముడు. తిరుపతిలోని రాయలసీమ హైస్కూల్‌లో పదో తరగతి చదువుతున్నాడు. ఒకే కుటుంబానికి చెందిన వీరిద్దరూ మృతిచెందడంతో వారి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. 
►మిగతా కుటుంబాల్లో ఇద్దరేసి కుమారులు ఉండగా వారిలో ఒకరు మృత్యువాత పడడం గమనార్హం. జి. మునిపార్వతి, చెంగల్రాయుడు దంపతులకు బాలాజీ, షణ్ముగ శ్రీనివాస్‌ ఇద్దరు కుమారులు కాగా వారిలో చిన్నవాడైన షణ్ముగ శ్రీనివాస్‌ మరణించాడు.  
►తిరుపతి సమీపంలోని అశోక్‌నగర్‌కు చెందిన కర్ణ సుబ్రమణ్యం మురళీ, దేవనాయకి దంపతులకు శ్రీనివాస్,  సతీష్‌ అనే ఇద్దరు కుమారులు. వీరిలో చిన్నకుమారుడైన తరుణ్‌ స్నేహితులతోపాటు వచ్చి మృత్యువాత పడ్డాడు.  
►తిరుపతి ఆటోనగర్‌కు చెందిన శివకుమార్‌(ఆటోడ్రైవర్‌), సుహాసిని దంపతులకు సాయిశంకర్, తరుణ్‌ కుమారులు కాగా వారిలో చిన్నవాడైన తరుణ్‌ మృతిచెందిన వారిలో ఉన్నాడు.  


►తిరుపతి సమీపంలోని కొర్లకుంటకు చెందిన బాలక్రిష్ణారెడ్డి(ఆటోడ్రైవర్‌), లక్ష్మిలకు కూడా ఇద్దరు కుమారులే. వీరిలో జగదీశ్వర్‌రెడ్డి (19) పెద్దవాడు. చిన్నవాడు వేణు దివ్యాంగుడు. జగదీశ్వర్‌రెడ్డి శ్రీ చైతన్య జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీయట్‌ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఇతని ఆచూకీ లభించాల్సి ఉంది. ఓఎస్‌డీ దేప్రసాద్, రాజంపేట సీసీఎస్‌ డీఎస్పీ ఎంపీ రంగనాయకులు, ఆర్‌ఐ సోమశేఖర్‌నాయక్, ఒంటిమిట్ట సీఐ హనుమంత నాయక్, రాజంపేట రూరల్‌ సీఐ వై. నరేంద్రరెడ్డి, ఫైర్‌ ఆఫీసర్‌ హనుమంతరావు, సిద్దవటం ఎస్‌ఐ రమేష్‌బాబు మృతదేహాల వెలికితీత కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. వైఎస్‌ఆర్‌సీపీ సిద్దవటం ఇన్‌చార్జి మేడా మధుసూదన్‌రెడ్డి సంఘటనా స్థలికి చేరుకొని బాధితులను ఓదార్చారు. అగ్నిమాపక సిబ్బంది, స్పెషల్‌పార్టీ పోలీసులు, గజ ఈతగాళ్లు, జాలర్లు రెండు బోట్లు, రెండు పడవలు, ట్యూబ్‌లు, వలలతో  ఆచూకీ కోసం గాలించారు. 

ఆశలపై నీళ్లు
రాజంపేట టౌన్‌ : గల్లంతయిన బిడ్డలను ఆ భగవంతుడు ఏదో రూపంలో కాపాడతాడని ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రుల ఆశలు అడియాశలయ్యాయి. సిద్దవటం పెన్నానదిలో గురువారం ఏడుగురు యువకులు గల్లంతు కాగా వారిలో అదే రోజు సాయంత్రానికి ఇద్దరు విగతజీవులైన విషయం విధితమే. అయితే మిగిలిన ఐదురుగురి ప్రాణాలపై వారి తల్లిదండ్రులు అనేక ఆశలు పెట్టుకున్నారు. యువకులు గల్లంతైన విషయం తెలియగానే తల్లిదండ్రులు, బంధువులు కొంతమంది అదే రోజు రాత్రికి సిద్దవటం చేరుకున్నారు. పోలీసులు వారికి ఆశ్రయం కల్పించారు. గజ ఈతగాళ్లు దొరికిన మృతదేహాలను ఒక్కొక్కటిగా ఒడ్డుకు చేర్చిన సమయంలో తల్లిదండ్రులు పరుగు పరుగున బిడ్డల మృతదేహాలపై పడి గుండెలు బాదుకొని రోదించసాగారు.   

మృతులంతా విద్యార్థులే 
పెన్నానదిలో గల్లంతై మృతి చెందిన వారందరూ విద్యార్థులే. ఇందులో సోమశేఖర్, రాజేష్, సతీష్‌లు ఇటీవలే డిగ్రీ ప్రథమ సంవత్సరంలో చేరారు. అలాగే తరుణ్, షణ్ముఖ ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతుండగా, యశ్వంత్‌ ఇంటర్మీడియట్‌లో చేరే ప్రయత్నంలో ఉన్నాడు.  జగదీష్‌ డిగ్రీ చదువుతున్నాడు. 

అబద్ధంచెప్పి.. ఇంటి నుంచి వచ్చి
మృతిచెందిన యువకులందరూ ఇళ్లలో తల్లిదండ్రులకు అబద్ధం చెప్పి శివకుమార్‌ తండ్రి రామచంద్ర వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు. నిజం చెప్పివుంటే తల్లిదండ్రులు మృతులను సిద్దవటం వెళ్లకుండా మందలించేవారు. ఫలితంగా అందరూ మృత్యుఒడికి దూరమయ్యే వారని పెన్నానదికి చేరుకున్న మృతుల్లోని కొంతమంది బంధువులు వాపోయారు.   

ఎవరికీ ఈత రాదు..
మృతి చెందిన వారిలో ఏ ఒక్కరికి కూడా ఈతరాదు. నీళ్లు లోతుగా ఉన్న ప్రాంతం నుంచి విద్యార్థులు బయట పడలేక పోయారు. నీటి ప్రవాహం ఉధృతంగా లేనందున కొంత మాత్రం ఈత వచ్చి ఉన్నా ప్రాణాలతో బయటపడేవారు. 

అందరూ బెస్ట్‌ఫ్రెండ్స్‌ 
పెన్నా నదిలో గల్లంతై మృతి చెందిన వారందరు చిన్నప్పటి నుంచి ఒకరికొకరు బెస్ట్‌ఫ్రెండ్స్‌ అని కొర్లగుంట వాసులు తెలిపారు. ప్రమాదం నుంచి బయటపడి బతికిన శివకుమార్‌తో పాటు మృతి చెందిన ఆరుగురితో పాటు గల్లంతయిన జగదీష్‌ ఒకే వీధికి చెందిన వారు. కొంతమందికి వయస్సు రీత్యా తేడా ఉన్నప్పటికి మంచి స్నేహితుల్లా మెలిగేవారని గ్రామస్తులు చెప్పారు. 

తరలి వచ్చిన కొర్లగుంట యువత
పెన్నానదిలో గల్లంతై మృతి చెందిన వారి కోసం తిరుపతి సమీపంలోని కొర్లగుంటవీధికి చెందిన యువకులు గురువారం అర్ధరాత్రి పెద్ద ఎత్తున సిద్దవటం తరలి వచ్చారు.  వీరందరూ మృతులకు స్నేహితులు కావడం విశేషం.  ఘటన గురించి తెలియగానే మనసు మనసులో లేక రాత్రికి రాత్రే సిద్దవటం చేరుకున్నట్లు వారు తెలిపారు. మృతి చెందిన ఏడుగురు తమకు  స్నేహితులని, వారి మృతి తీవ్రంగా కలచివేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన చేదుజ్ఞాపకంలా మిగిలిపోతుందని పలువురు కంటతడి పెట్టారు. 

మరిన్ని వార్తలు