పుడమికి ప్రాణాంతకంగా ప్లాస్టిక్‌

26 Jul, 2022 04:43 IST|Sakshi

నేలను, నీటిని, గాలిని కలుషితం చేస్తున్న ప్లాస్టిక్‌  టఒక్కసారి వాడి పారేసే వస్తువులే అధికం

దేశంలో ఏడాదికి ఒక వ్యక్తి సగటున 

కిలోల ప్లాస్టిక్‌ వినియోగం

దేశంలో 2019–20లో 35 లక్షల టన్నులకు పైగా ప్లాస్టిక్‌ వ్యర్థాలు ఉత్పత్తి 

మొత్తం వ్యర్థాల్లో 12 శాతం మాత్రమే రీసైక్లింగ్‌.. 

చట్ట ప్రకారం ఉత్పత్తి సంస్థలు 70 శాతం వ్యర్థాలను రీసైక్లింగ్‌ చేయాలి

రాష్ట్రంలో ఏటా 70 వేల టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు

సాక్షి, అమరావతి: నేలను, నీటిని, గాలిని కలుషితం చేస్తూ అత్యంత ప్రమాదకరంగా మారిన ప్లాస్టిక్‌ ప్రపంచాన్ని వదలనంటోంది. మన దేశంలో ఒక వ్యక్తి ఏడాదికి సగటున నాలుగు కిలోల ప్లాస్టిక్‌ను వాడి పారేస్తున్నాడు. ఈ ప్లాస్టిక్‌ భూమిలో కలిసిపోవడానికి 1000 సంవత్సరాలు పడుతుందని అంచనా. ప్లాస్టిక్‌ బాటిళ్లకు 450 ఏళ్లు, సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ సంచులు కుళ్లిపోవడానికి 30 ఏళ్లకు పైగా పడుతుందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. కానీ అది మట్టిలో కలిసే లోపు అపార నష్టాన్ని కలిగిస్తుంది. ఇలా వాడి పారేసే ప్లాస్టిక్‌ ఇంటింటా, వీధుల్లో, రోడ్లపైన, చెత్తకుప్పల్లో, కాలువల్లో, చెరువుల్లో, నదుల్లో, చివరికి సముద్ర తీరాల్లో కూడా పేరుకుపోతోంది.

సమస్త జీవరాశికి ప్రాణాంతకంగా పరిణమించింది. ప్లాస్టిక్‌ వాడకంపై నిషేధం ఉన్నప్పటికీ, అమలు, ఆచరణలో వైఫల్యం వల్ల రోజురోజుకు దీని బెడద పెరిగిపోతోంది. గతేడాది దేశంలో 35 లక్షల టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు వెలువడినట్టు కేంద్ర ప్రభుత్వం లెక్క తేల్చింది. గత ఐదేళ్లలో వీటి ఉత్పత్తి రెట్టింపయిందని, సగటు వార్షిక పెరుగుదల 21.8 శాతంగా ఉందని కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. 2015–16లో 15.89 లక్షల టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు ఉత్పత్తయితే, 2018–19లో 30.59 లక్షల టన్నులు, 2019–20లో 35 లక్షల టన్నులకు పైగా ఉత్పత్తి అయ్యాయని కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రి ఇటీవల పార్లమెంట్‌లో చెప్పారు.

ప్రపంచంలో ఉత్తమ నియంత్రణ దేశాలు
ప్రపంచంలో ప్లాస్టిక్‌ బ్యాగులు, సీసాలు, కట్లర్స్, స్ట్రాలు, కాఫీ స్టిరర్స్‌ వంటి వాటిని నిషేధించిన మొట్టమొదటి దేశం కోస్టారికా. ఇది యూఎన్‌వో అందించే అత్యున్నత పర్యావరణ పురస్కారం ‘ఛాంపియన్స్‌ ఆఫ్‌ ది ఎర్త్‌’ను 2019లో అందుకుంది. ఈ దేశంలో 2021 నుంచి 80 శాతం ప్రకృతికి హాని చేయనివి, పునర్‌ వినియోగించదగ్గ వస్తువులను మాత్రమే వినియోగిస్తున్నట్టు ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. 
► జమైకా 2019 నుంచి సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ దిగుమతిని నిషేధించింది. ఈ దేశంలో పర్యావరణ అనుకూలం వస్తువులనే తయారు చేస్తున్నారు.
► ఆఫ్రికాలోని దాదాపు 34 దేశాలు ప్లాస్టిక్‌ బ్యాగులను నిషేధించాయి. రువాండా పదేళ్ల క్రితమే ప్లాస్టిక్‌ సంచులను నిషేధించింది.
► ఇండోనేసియా 2018 నుంచి ప్లాస్టిక్‌ బ్యాగ్‌లు, స్ట్రాలను నిషేధించింది. 2025 నాటికి ప్లాస్టిక్‌ బ్యాగుల వినియోగం 70 శాతం తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
► న్యూజిలాండ్‌ దేశం 2019లోనే సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ బ్యాగులను పూర్తిగా నిషేధించింది. లోరల్, కోకొకోలా, నెస్లే వంటి 12 అంతర్జాతీయ కంపెనీలు 2025 నాటికి 100 శాతం కంపోస్ట్‌ చేయదగిన ప్యాకేజింగ్‌ను అమలు చేస్తామని ఆ ప్రభుత్వానికి హామీనిచ్చాయి.
► జర్మనీ 56.1 శాతం ప్లాస్టిక్‌ వ్యర్థాలను రీసైక్లింగ్‌ చేస్తూ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా 53.8 శాతం, దక్షిణ కొరియా 53.7 శాతం, వేల్స్‌ 52.2 శాతం, స్విట్జర్లాండ్‌ 49.7 శాతం రీసైక్లింగ్‌ చేస్తున్నాయి.

ఢిల్లీదే అగ్రస్థానం
ప్లాస్టిక్‌ వ్యర్థాల ఉత్పత్తిలో ఢిల్లీ మహానగరం మొదటి స్థానంలోఉంది. ఇక్కడ ఏటా 2,51,850 టన్నుల  వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. 1,56,767 టన్నులతో కోల్‌కతా రెండో స్థానంలో ఉంది. చెన్నై 1,56,731 టన్నులతో తర్వాతి స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో 2020–21 నాటికి ప్లాస్టిక్‌ వ్యర్థాలు 70 వేల టన్నులుగా గుర్తించారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి వద్ద 124 ప్లాస్టిక్‌ తయారీ యూనిట్లు, ఆరు రీసైక్లింగ్‌ పరిశ్రమలు నమోదు చేసుకున్నాయి. కానీ అనధి కారిక తయారీ సంస్థలు 400 వరకు ఉంటాయని అంచనా. పక్క రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతు న్న సరుకుపై లెక్కలు లేవు. అనధికారిక ప్లాస్టిక్‌ తయారీ పరిశ్రమలు బీహార్‌లో అత్యధికంగా 43 శాతం, తమిళనాడులో 26 శాతం, మహరాష్ట్రలో 13 శాతం ఉన్నాయి. ఇవి విచ్చలవిడిగా సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి.

12 శాతమే రీసైక్లింగ్‌
ప్లాస్టిక్‌ వ్యర్థాలలో 12 శాతం మాత్రమే రీసైక్లింగ్‌ చేస్తున్నారని, 20 శాతం బహిరంగ ప్రదేశాల్లో తగులబెడుతున్నట్టు సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ (సీఎస్‌ఈ) నివేదిక తెలిపింది. మిగిలిన 68 శాతం భూమిలో, నీటిలో కలుస్తున్నట్టు తేల్చింది. చట్ట ప్రకారం ప్లాస్టిక్‌ తయారీ సంస్థలు అవి ఉత్పత్తి చేస్తున్న వాటిలో 70 శాతం వ్యర్థాలను రీసైక్లింగ్‌ చేయాలి. కానీ ఈ నిబంధన సరిగా అమలు కావడంలేదు. దేశంలో సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌పై నిషేధం ఉన్నప్పటికీ, దాని వాడకంపై నియంత్రణ లేదు. దీంతో జూలై 1వ తేదీ నుంచి 75 మైక్రాన్లు, ఆపై మందం గల ప్లాసిక్‌ సంచులు, బయో డిగ్రేడబుల్‌ కవర్లను మాత్రమే ఉత్పత్తి చేయాలని కేంద్రం ఆదేశించింది. ఈ ఏడాది డిసెంబర్‌ 31 నుంచి 120 మైక్రాన్లు, ఆపై మందం గలవాటినే ఉత్పత్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

ప్లాస్టిక్‌తో కొన్ని నష్టాలివీ..
► భూసారం పెరగకుండా అడ్డుపడుతుంది
► క్లోరినేటెడ్‌ ప్లాస్టిక్‌తో మట్టిలో విష రసాయనాలు చేరుతున్నాయి. అ వి భూగర్భ జలాల్లో కలిసి మానవాళి, ప్రాణికోటికి హానిచేస్తున్నాయి.
► ఏటా పక్షులు, చేపలు, జంతువులు ప్లాస్టిక్‌ వల్ల చనిపోతున్నాయి. అంతరించిపోతున్న ప్రాణుల్లో దాదాపు 700 జాతులు ప్లాస్టిక్‌ వల్ల ప్రభావితమైనట్లు గుర్తించారు.
► మనం తినే జలచరాల్లో మైక్రో ప్లాస్టిక్, నానో ఫైబర్‌ వ్యర్థాలను కూడా కనుగొన్నారు.
► బహిరంగ ప్రదేశాల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాలను మండించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా 20 మిలియన్‌ టన్నుల కార్బన్‌ డై ఆక్సైడ్‌ ఉత్పత్తి అవుతోంది. ఇది 60 లక్షల మంది మరణాలకు కారణమ వుతున్నట్టు అంచనా. బహిరంగ ప్రదేశాల్లో కాల్చడం వల్ల శ్వాసకోశ రుగ్మతలు వస్తున్నాయి. ప్లాస్టిక్‌ పాలిమర్‌ అవశేషాలతో క్యాన్సర్, ఎండోక్రైన్‌ గ్రంధి దెబ్బతినడం, చర్మవ్యాధులు సోకుతున్నాయి. 
► ప్లాస్టిక్‌లో బిస్‌ఫినాల్‌–ఏ, థాలేట్స్, డయాక్సిన్స్, పాలీసైక్లిక్‌ ఆరోమాటిక్‌ హైడ్రోకార్బన్‌ (పీఏహెచ్‌), పాలీక్లోరినేటెడ్‌ బైఫినైల్స్‌ (పీసీబీస్‌), స్టైరిన్‌ మోనోమర్, నానిల్ఫెనాల్‌ వంటి విష పదార్థాలు ఉంటాయి. ఇవి మానవుల్లో ఈస్ట్రోజన్‌ ఉత్పత్తిని నిరోధిస్తాయి.  పునరుత్పత్తి సామర్థ్యాన్ని  దెబ్బతీస్తాయి. 

దేశానికి సిక్కిం ఆదర్శం
ప్లాస్టిక్‌ నిషేధంలో సిక్కిం రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచింది. దేశంలోనే మొదటిసారిగా సిక్కిం రాష్ట్రం 1998లోనే ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్‌ను నిషేధించింది. ప్లాస్టిక్‌ బాటిళ్లను నిషేధించిన మొదటి రాష్ట్రం కూడా ఇదే. 2016లో ప్రభుత్వ కార్యాలయాలు, కార్యక్రమాలలో ప్యాకేజ్డ్‌ డ్రింకింగ్‌ వాటర్‌ వాడకాన్ని నిషేధించింది. దీంతో ఈ రాష్ట్రంలో ప్యాస్టిక్‌ వ్యర్థాలు 5.99 టన్నులకు తగ్గిపోయింది. దీని తర్వాత మిజోరాం(13.30 టన్నులు), త్రిపుర 26.2 టన్నులు), మేఘాలయ (1,263 టన్నులు) ఉన్నాయి. 

మరిన్ని వార్తలు