APSRTC: పరుగందుకుంటున్న ప్రగతి రథ చక్రాలు

2 Sep, 2021 04:21 IST|Sakshi

75 శాతం ఆర్టీసీ బస్సు సర్వీసులు పునఃప్రారంభం

70 శాతానికి చేరిన ఆక్యుపెన్సీ

రోజుకు రూ.10 కోట్లకు చేరిన రాబడి

రాష్ట్రంలో ప్రగతి రథ చక్రం మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటోంది. కరోనా రక్కసిని దాటుకొని జనజీవనాన్ని గమ్యస్థానాలకు చేర్చేందుకు పదపదమని ప్రయాణిస్తోంది. సగానికిపైగా సర్వీసులు నిలిచిపోయిన పరిస్థితి నుంచి ముప్పావు శాతం బస్సులు కదిలాయి. కోవిడ్‌ జాగ్రత్తలు తీసుకుంటూనే రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రజలకు మరింత చేరువవుతోంది.     
– సాక్షి, అమరావతి

రోజుకు 7,800 సర్వీసులు..
రోజుకు 10,600 షెడ్యూల్‌ బస్‌ సర్వీసులు నిర్వహించే సామర్థ్యం ఆర్టీసీకి ఉంది. వాటిలో 8,200 ఆర్టీసీ సొంత బస్సులు కాగా 2,400 అద్దె బస్సులు. ప్రస్తుతం ఆర్టీసీ సొంత బస్సుల్లో రోజుకు 7,800 సర్వీసులు నిర్వహిస్తోంది. రాష్ట్రంలో పల్లె వెలుగు, డీలక్స్, సూపర్‌ డీలక్స్‌ సర్వీసులతోపాటు అంతర్రాష్ట్ర సర్వీసులను నిర్వహిస్తోంది. తిరుమల–తిరుపతి ఘాట్‌ రోడ్డులోనూ, దూరప్రాంత, అంతర్రాష్ట్ర ఏసీ సర్వీసుల్లోనే దాదాపు 1,600 బస్సులు మినహా మిగిలిన అన్ని బస్సులు యథాతథంగా నిర్వహిస్తోంది. ఈ నెలాఖరుకు ఆ 1,600 బస్‌ సర్వీసులనూ క్రమంగా ప్రవేశపెట్టాలని ఆర్టీసీ భావిస్తోంది. అద్దె బస్సులను బుధవారం నుంచి క్రమంగా ప్రవేశపెడుతోంది. అద్దె బస్సుల యజమానులు తమ వాహనాల బీమా సర్టిఫికెట్లు, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంది. పత్రాలను పరిశీలించి ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్లు, డిపో మేనేజర్లు అద్దె బస్సులను ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇస్తారు. పది రోజుల్లో మొత్తం 2,400 అద్దె బస్సుల సర్వీసులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి.

పుంజుకున్న ఆక్యుపెన్సీ
జనజీవనం క్రమంగా గాడిలో పడుతుండటంతో ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేటు పుంజుకుంది. ప్రస్తుతం సగటున దాదాపు 70 శాతానికి చేరడం విశేషం. ఆక్యుపెన్సీ రేటులో అనంతపురం జిల్లా (76 శాతం) మొదటి స్థానం, కర్నూలు జిల్లా (74 శాతం) రెండోస్థానంలో ఉండగా.. కృష్ణా జిల్లా (60 శాతం) చివరి స్థానంలో ఉంది. సంస్థకు రాబడి కూడా పెరుగుతోంది. ప్రస్తుతం రోజుకు సగటున రూ.10 కోట్ల వరకు రాబడి వస్తోంది. ఈ నెల రెండోవారం ముగిసేసరికి సాధారణ లక్ష్యం రోజుకు రూ.15 కోట్ల రాబడి వచ్చే అవకాశం ఉందని ఆర్టీసీ ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. కోవిడ్‌ మొదటి వేవ్‌ సమయంలో ఆర్టీసీకి దాదాపు రూ.2,300 కోట్లు, ఈ ఏడాది రెండో వేవ్‌ తీవ్రంగా ఉన్న ఏప్రిల్‌–జూలైలలో రూ.1,200 కోట్ల వరకు ఆర్టీసీ రాబడికి గండిపడింది. ప్రస్తుతం కోవిడ్‌ తీవ్రత తగ్గి ఆర్టీసీ పూర్తిస్థాయి సర్వీసులను ప్రవేశపెడుతుండటంతో పూర్వవైభవం సాధించవచ్చని ఉన్నతాధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

క్రమంగా పూర్తిస్థాయి సేవలు
ఆర్టీసీ బస్సు సర్వీసులను క్రమంగా పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తాం. కోవిడ్‌ మార్గదర్శకాలను పాటిస్తూనే ప్రజలకు విస్తృత స్థాయిలో ఆర్టీసీ సేవలు అందిస్తాం. సంస్థను మళ్లీ పుంజుకొనేలా అన్ని చర్యలు తీసుకుంటున్నాం.
– సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు, ఏపీఎస్‌ ఆర్టీసీ ఎండీ 

మరిన్ని వార్తలు