అక్కచెల్లెమ్మలకు అగ్రపీఠం

17 Mar, 2023 04:58 IST|Sakshi

మహిళలు, చిన్నారుల సంక్షేమానికి కేటాయింపులు ఘనం 

మహిళా సంక్షేమం, అభివృద్ధికి రూ.77,914 కోట్లు 

చిన్నారుల కోసం రూ.20,592 కోట్లు 

ఆది నుంచి మహిళా సాధికారతకు జగన్‌ ప్రభుత్వం కృషి 

కాంట్రాక్టు, నామినేటెడ్‌ పోస్టుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం 

స్థానిక సంస్థల్లో 50 శాతానికి మించి పదవులను మహిళలకే 

రాజకీయ పదవుల్లోనూ మహిళలకే ప్రాధాన్యం 

సాక్షి, అమరావతి: తొలి నుంచి మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మహిళాభ్యున్నతికి బడ్జెట్‌లో అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. 2023–24 బడ్జెట్‌లోని జెండర్‌ బడ్జెట్‌లో మహిళల సంక్షేమానికి, అభివృద్ధికి కేటాయింపులు ఘనంగా చేసింది. కేవలం మహిళల అభివృద్ధికి రూ.77,914 కోట్లు కేటాయించింది. దీనిని రెండు ప్రధాన విభాగాలుగా చేసింది.

ప్రత్యేకంగా నూరు శాతం మహిళల కోసమే ఉద్దేశించిన (పార్ట్‌–ఎ) పథకాలకు రూ.31,825 కోట్లు కేటాయించింది. మహిళలకు 30 నుంచి 99 శాతం వరకు లబ్ధి కలిగేలా ఉద్దేశించిన పథకాలు పార్ట్‌–బి ప్రోగ్రామ్‌లో రూ.46,088.7 కోట్లు కేటాయించింది. గతేడాది జెండర్‌ బడ్జెట్‌లో రూ.55,015 కోట్లు కేటాయించగా, ఈ ఏడాది దాదాపు రూ.23 వేల కోట్లు అదనంగా కేటాయించడం విశేషం. లింగ ఆధారిత బడ్జెట్‌ కేటాయింపులతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాలతోపాటు అన్ని ప్రభుత్వ శాఖల పరిధిలో మహిళా సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం ఈ నిధులను ఖర్చు చేయనుంది.

మహిళా సాధికారతకు దోహదం చేసే సంక్షేమ కార్యక్రమాలు, స్వయం ఉపాధి, ఆర్థిక సాయం, మౌలిక సదుపాయాలు వంటి అనేక కార్యక్రమాలు చేపట్టనుంది. నైపుణ్యాభివృద్ధి శిక్షణతో ఆర్థిక వనరులను అభివృద్ధి చేసుకునేలా ప్రోత్సాహం అందించనుంది. నీతి ఆయోగ్‌ సిఫారసుల మేరకు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (ఎస్‌డీజీ) సాధించే దిశగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పయనిస్తోంది. 

మహిళా సాధికారతలో అగ్రగామిగా 
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలతో మహిళా సాధికారతను సాధించడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ అగ్రగామిగా నిలుస్తోంది. మహిళలకు కాంట్రాక్టు, నామినేటెడ్‌ పోస్టుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రత్యేకంగా చట్టమే తెచ్చింది.

మహిళలు రాజకీయ రంగంలో రాణించేలా ప్రోత్సహిస్తోంది. పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఆమోదానికి నోచుకోకుండా దశాబ్దాలుగా కాలయాపన జరుగుతున్నప్పటికీ,  ఎవరూ అడగకుండానే స్థానిక సంస్థల్లో 50 శాతానికి మించి పదవులను మహిళలకే కట్టబెట్టిన సీఎం వైఎస్‌ జగన్‌ దేశంలోనే కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. స్థానిక సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు, గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చారు. 

చిన్నారుల సంక్షేమానికి రూ.20,592.57 కోట్లు 
రాష్ట్రంలో చిన్నారుల సంక్షేమానికి గతేడాది రూ.16,903 కోట్లు కేటాయించగా, ప్రస్తుత బడ్జెట్‌లో రూ.20,592.­57 కోట్లు కేటాయించడం విశేషం. గతేడాది కంటే ఈ సారి దాదాపు రూ.4వేల కోట్లు అదనంగా కేటాయించింది. నూరు శాతం పిల్లలకే ఉద్దేశించిన పథకాలు (పార్ట్‌–ఎ)లో రూ.13,187 కోట్లు కేటాయించింది.

30 నుంచి 99 శాతం వరకు పిల్లలు లబ్దిదారులుగా ఉండే పథకాల్లో రూ.7,405.57 కోట్లు కేటాయించింది. చిన్నారులకు అంగన్‌వాడీల్లో వైఎస్సార్‌ పోషణ, వైఎస్సార్‌ పోషణ ప్లస్‌ పథకాల ద్వారా పోషకాహారాన్ని అందిస్తున్న సంగతి తెల్సిందే. చిన్నారులకు నాణ్యమైన విద్యను అందించడంలో ప్రభుత్వం చేస్తున్న కృషి ప్రశంసనీయం.

‘దిశ’తో మహిళా భద్రత 
రాష్ట్రంలోని మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రాధాన్యత ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం దిశ బిల్లు తేవడంతో నేర నిరూపణ, శిక్షల్లో గణనీయమైన ఫలితాలు సాధిస్తోంది. 2019లో అసెంబ్లీలో ఆమోదించిన దిశ బిల్లుతో 21 రోజుల్లోనే కేసు దర్యాప్తు, నేర విచారణతో శిక్షలు పడేలా చేయగలుగుతున్నారు.

18 దిశ పోలీస్‌ స్టేషన్లు (అప్‌గ్రేడ్‌ చేసిన మహిళా పోలీస్‌ స్టేషన్లు), మహిళలు, పిల్లల భద్రతకు దిశ యాప్, దిశ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లు, ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేశారు. మహిళల కోసం 13 వన్‌ స్టాప్‌ కౌన్సెలింగ్‌ సెంటర్లు, మధ్యంతర లీగల్‌ షెల్టర్లు, హెల్ప్‌ డెస్‌్కల ఏర్పాటు, దిశ పెట్రోలింగ్‌ వాహనాలతో ప్రభుత్వం రాష్ట్రంలో మహిళలకు భద్రత కల్పిస్తోంది. 

మరిన్ని వార్తలు