Andhra Pradesh: కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు రూ.786 కోట్లు

24 Jan, 2022 03:17 IST|Sakshi

11వ వేతన సవరణతో ఏటా భారీగా లబ్ధి

ఇప్పటికే వీరికి వేతనాల రూపంలో ఏటా రూ. 2,521 కోట్లు చెల్లింపు 

తాజా పెంపుతో రూ. 3,307 కోట్లకు చేరనున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల వేతనాలు

ప్రభుత్వం ఉత్తర్వులు

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం 11వ వేతన సవరణలో భాగంగా కాంట్రాక్టు ఉద్యోగులతోపాటు ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది వేతనాలను కూడా పెంచింది. కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు పెంచిన వేతనాలను ఈ నెల నుంచే అమలు చేయనున్నట్లు ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌.ఎస్‌.రావత్‌ వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశారు. వేతనాల పెంపు ద్వారా కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు ఏటా అదనంగా రూ.786 కోట్ల మేర ప్రయోజనం చేకూరనుంది. 

దళారీ వ్యవస్థ లేకుండా..
రాష్ట్రంలో 1,00,996 మంది ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులున్నారు. దళారీ వ్యవస్థతో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇక్కట్లను గుర్తించిన వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్‌ కార్పొరేషన్‌ ఫర్‌ ఔట్‌ సోర్స్‌డ్‌ సర్వీసెస్‌ (ఏపీసీఓఎస్‌)ను ఏర్పాటు చేసింది. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులందరినీ ఈ కార్పొరేషన్‌ కిందకు తీసుకురావడమే కాకుండా ప్రతీ నెలా 1వ తేదీనే వేతనాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంది. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు లప్రస్తుతం వేతనాల రూపంలో ఏటా రూ.1,860 కోట్లు చెల్లిస్తున్నారు. ఇప్పుడు 11వ వేతన సవరణ ప్రకారం ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల వేతనాలను పెంచడంతో ఏడాదికి అదనంగా రూ.430 కోట్ల మేర ప్రయోజనం పొందనున్నారు. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను మూడు కేటగిరిలుగా వర్గీకరించి వేతనాలను పెంచుతూ ఆర్ధిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 

మినిమమ్‌ టైమ్‌ స్కేల్‌ అమలు..
కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా 11వ వేతన సవరణ ప్రకారం మినిమమ్‌ టైమ్‌ స్కేలును అమలు చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు వెలువరించింది. వేల సంఖ్యలో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులకు వేతనాల రూపంలో రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.661 కోట్లు చెల్లిస్తోంది. ఈ నెల నుంచి పెరిగిన వేతనాల ద్వారా కాంట్రాక్టు ఉద్యోగులకు ఏటా రూ.356 కోట్ల మేర అదనపు ప్రయోజనం చేకూరనుంది. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నవారు, యూనివర్సిటీలు, సొసైటీలు, కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులందరికీ వేతనాల పెంపు వర్తిస్తుందని ఆర్ధిక శాఖ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. పూర్తి సమయం, ఎన్‌ఎంఆర్, రోజువారీ వేతనం, కన్సాలిడేటెడ్‌ పే, పార్ట్‌ టైం ఉద్యోగులకు కూడా 11వ వేతన సవరణ మేరకు మినిమమ్‌ టైమ్‌ స్కేలు అమలు చేస్తూ ఆర్థిక శాఖ మరో ఉత్తర్వులను కూడా ఇచ్చింది. వీరికి కూడా ఈ నెల నుంచే మినిమమ్‌ టైమ్‌ స్కేలును వర్తింప చేయనున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపింది.

ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు కేటగిరీల వారీగా పెరిగిన వేతనాలు
కేటగిరి–1 (పెరిగిన నెల వేతనం రూ. 21,500) సీనియర్‌ అసిస్టెంట్, సీనియర్‌ స్టెనో,సీనియర్‌ అకౌంటెంట్, ట్రాన్స్‌లేటర్,డేటా ప్రాసెసింగ్‌ ఆఫీసర్‌    
కేటగిరి–2 (పెరిగిన నెల వేతనం రూ. 18,500) డ్రైవర్, జూనియర్‌ అసిస్టెంట్, జూనియర్‌ స్టెనో, టైపిస్ట్, టెలిఫోన్‌ ఆపరేటర్, స్టోర్‌ కీపర్, ఫొటోగ్రాఫర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, డేటా ప్రాసెసింగ్‌ అసిస్టెంట్‌ ఎలక్ట్రీషియన్, మెకానిక్, ఫిట్టర్, లైబ్రేరియన్, ల్యాబ్‌ అసిస్టెంట్, సూపర్‌వైజర్, మేనేజర్‌    
కేటగిరి–3 (పెరిగిన నెల వేతనం రూ. 15,000) ఆఫీస్‌ సబార్టినేట్, వాచ్‌మెన్, కుక్, వాచ్‌మెన్, కుక్‌ చౌకీదార్, సైకిల్‌ ఆర్డర్లీ, లిఫ్ట్‌ ఆపరేటర్, ల్యాబ్‌ అసిస్టెంట్, దఫేదార్, జిరాక్స్‌ ఆపరేటర్, రికార్డ్‌ అసిస్టెంట్‌  

మరిన్ని వార్తలు