మూడు సార్లు గుండె ఆగినా.. ప్రాణాలు నిలిపారు

10 Nov, 2022 15:33 IST|Sakshi
బాలుడు వరుణ్‌తో తల్లిదండ్రులు, వైద్యులు  

అరుదైన మయోకార్డియాటీస్‌తో బాధపడుతున్న బాలుడు  

వైద్యం చేసే సమయంలో మూడు సార్లు ఆగిన గుండె 

మెరుగైన వైద్యంతో ప్రాణాలు నిలిపిన వైద్యులు

సాక్షి, కర్నూలు (హాస్పిటల్‌): తెలంగాణ రాష్ట్రం గద్వాలకు చెందిన వరుణ్‌ అనే 8 ఏళ్ల బాలుడికి ఇన్ఫెక్షన్‌ కారణంగా మూడు సార్లు గుండె ఆగిపోయింది. ఇలాంటి స్థితిలో వైద్యులు.. బాలుడికి సీపీఆర్‌ చేసుకుంటూ మెరుగైన వైద్యం అందించడంతో తిరిగి ప్రాణం పోసుకున్నాడు. వివరాలను బుధవారం కర్నూలులోని మెడికవర్‌ హాస్పిటల్‌ పీడియాట్రిక్‌ ఇంటెన్సివిస్ట్‌ డాక్టర్‌ మురార్జీ వివరించారు.

వరుణ్‌ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో తల్లిదండ్రులు మెడికవర్‌ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆ సమయానికి అతనికి కార్డియాక్‌ అరెస్ట్‌ రావడంతో ఎంతో శ్రమించి వైద్యులు అతని గుండెను పునఃప్రారంభింపజేశారు. పరీక్షలు నిర్వహించిన అనంతరం.. బాబుకు ఇన్ఫెక్షన్‌ సోకడంతో గుండె సామర్థ్యం మందగించిందని తెలుసుకున్నారు. వైద్యం చేసే సమయంలోనే బాలుడి గుండె మూడు సార్లు ఆగిపోయింది.

ఆ సమయంలో మెదడుకు రక్త సరఫరాలో ఇబ్బంది తలెత్తి పక్షవాతం వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. మెరుగైన వైద్యం కారణంగా పక్షవాతం రాలేదు. పిల్లల గుండెకు ఇన్షెక్షన్‌ సోకి గుండె పనితీరు మందగించడం చాలా అరుదుగా జరుగుతుందని, దీనిని వైద్య పరిభాషలో మయోకార్డియారెస్ట్‌ అంటారని డాక్టర్‌ మురార్జీ తెలిపారు. మయోకార్డియాటీస్‌ ఉన్నప్పుడు తక్కువ మంది పిల్లలకు తీవ్రమైన గుండె సమస్యలు తలెత్తుతాయని, వారికి ఇంట్రావీనస్‌ ఆయనోట్రోఫిక్‌ సపోర్ట్, మెకానికల్‌ వెంటిలేషన్‌తో ఇంటెన్సివ్‌ కేర్‌ థెరపీ అవసరం ఉంటుందని డాక్టర్‌ మురార్జీ వివరించారు. 

చదవండి: (బతికుండగా పదిమందికి పట్టెడన్నం.. చనిపోతూ ఐదుగురికి ప్రాణదానం)

మరిన్ని వార్తలు