నూతన ఆవిష్కరణల పేటెంట్లకు 80 శాతం ఫీజు రాయితీ

10 Jan, 2023 08:13 IST|Sakshi

80 శాతం ఫీజు రాయితీలతో కేంద్రం వెన్నుదన్ను

నూతన ఆవిష్కరణలకు ఆర్థిక సహకారం

మేథో సంపత్తిని పెంచేలా కార్యాచరణ

క్రమేణా కేంద్ర ఉన్నత విద్యా సంస్థల్లో పెరుగుతున్న పేటెంట్ల సంఖ్య

వాటికి తీసిపోని రీతిలో పోటీపడుతున్న ప్రైవేటు వర్సిటీలు

ఫెసిలిటేటర్ల సర్వీస్‌ ఛార్జీల నుంచి వర్సిటీలకు మినహాయింపు

ఏటా 10వేల పేటెంట్ల లక్ష్యంగా ప్రోత్సాహకాలు

సాక్షి, అమరావతి : కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని జాతీయ ఉన్నత విద్యాసంస్థలతో పాటు ప్రైవేటు యూనివర్సిటీలు, విద్యాసంస్థలు పేటెంట్ల విషయంలో పోటీపడుతున్నాయి. వీటిల్లో పరిశోధనా కార్యక్రమాలను మరింత పగడ్బందీగా కొనసాగిస్తుండడంతో కొత్త ఆవిష్కరణలతో స్వయం సమృద్ధికి వీలుగా మేథో సంపత్తి హక్కుల (ఇంటెలెక్యువల్‌ ప్రాపర్టీ రైట్స్‌) సాధనలో పురోగతి సాధిస్తున్నాయి. కేంద్రం కూడా ఈ ఉన్నత విద్యా సంస్థల్లో చేపట్టే ఆవిష్కరణలకు పేటెంట్లు కల్పించడంలో 80 శాతం ఫీజు రాయితీలు ఇవ్వడం కూడా నూతన ఆవిష్క­రణలకు కారణమవుతున్నాయి. ఫలితంగా ఈ సంస్థలలో పేటెంట్ల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. 

నిజానికి.. ఏదైనా సంస్థ పేటెంట్‌ దాఖలు చేయాలంటే ముందుగా రూ.20వేల ఖర్చుపెట్టాలి. ఆ తరువాత వాటి పరిశీలన తదితర ప్రక్రియలలో మరికొంత మొత్తాన్ని ఛార్జీలుగా చెల్లించాలి. దీనికి అదనంగా.. పేటెంట్‌ చేసే వ్యక్తి 20 ఏళ్లపాటు దాని నిర్వహణ రుసుమును కూడా జమచేయాల్సి ఉంటుంది. దీనివల్ల ఇప్పటివరకు ఉన్నత విద్యాసంస్థల్లో పేటెంట్లపై ఆసక్తి కనబర్చలేదు. అయితే, కేంద్ర ప్రభుత్వం పరిశోధన, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించే దిశగా చట్టాన్ని సవరించి 80 శాతం రాయితీలను ప్రకటించడంతో క్రమేణా పేటెంట్లు పెరిగేందుకు ఆస్కారమేర్పడుతోంది.

నూతన జాతీయ విద్యావిధానం–2020లో కూడా ఉన్నత విద్యా సంస్థల్లో నూతన ఆవిష్కరణలకు పెద్దపీట వేయాలని.. వాటి ద్వారా ఆయా సంస్థలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించేందుకు ప్రణాళికలు అమలుచేయాలని సూచించింది. సమగ్ర పరిశోధనలతో నూతన ఆవిష్కరణలు చేసే వారికి ఆర్థిక సహకారం కూడా అందించేలా మార్గనిర్దేశం చేసింది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఏటా అధ్యాపకులు, పరిశోధక అభ్యర్థులకు నిధులు కూడా ఇస్తోంది. ఇలా ఏటా 10వేల పేటెంట్ల లక్ష్యంగా ఈ ప్రోత్సాహకాలను అందిస్తోంది. పేటెంట్ల వాణిజ్యీకరణను ప్రోత్సహించడం ద్వారా ప్రపంచ పేటెంట్‌ ర్యాంకింగ్స్‌లో స్థానాన్ని మెరుగుపర్చుకు­నేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. 

ఏయూలో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు
ఈ పేటెంట్లను ప్రోత్సహించడానికి రాష్ట్రంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం తన క్యాంపస్‌లో మేథో సంపత్తి హక్కుల కోసం ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటుచేసింది. ఈ కేంద్రం డాక్యుమెంటేషన్‌ ప్రక్రియను పర్యవే„ìక్షించడంతో పాటు దాఖలుకు అయ్యే ఖర్చును కూడా భరిస్తోంది. అనేక విద్యాసంస్థల విద్యార్థులు తమ మెంటార్ల మార్గదర్శకత్వంలో వినూత్న ప్రాజెక్టుల పేటెంట్ల దాఖలుకు ఇప్పుడిప్పుడే ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు.. 2020–21లో విద్యాసంస్థలు, ఇతర పరిశోధనా సంస్థలు అందించిన పేటెంట్‌ దరఖాస్తులు 58,503గా ఉన్నాయి. అందులో ప్రధానంగా మహారాష్ట్ర 4,214, తమిళనాడు 3,945, కర్ణాటక 2,784, యూపీ 2,317, తెలంగాణ 1,662, పంజాబ్‌ 1,650, ఢిల్లీ 1,608, గుజరాత్‌ 921, హర్యానా 765, ఆంధ్రప్రదేశ్‌ 709, పశ్చిమ బెంగాల్‌ 505 రాజస్థాన్‌ 449, కేరళ 426, మధ్యప్రదేశ్‌ 398, ఒడిశా 144, పాండిచ్చేరి నుంచి 139 దరఖాస్తులు వచ్చాయి. 


పేటెంట్లలో ముందున్నవి ఇవే..
ఇక కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్, డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్, ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ వంటి పరిశోధనా సంస్థలు అత్యధిక సంఖ్యలో పేటెంట్‌లను దాఖలు చేయడంలో ముందున్నాయి. కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ పేటెంట్స్, డిజైన్, ట్రేడ్‌మార్క్‌ (సీజీపీడీటీఎం) నివేదిక ప్రకారం 2019–2020లో టాప్‌–10 విద్యాసంస్థలు అందించిన పేటెంట్ల సంఖ్య 2,533 కాగా.. 2020–21లో ఆ సంఖ్య 3,103కి పెరిగింది. 2019–20లో ఐఐటీలు 664 పేటెంట్లను దాఖలు చేశాయి. లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీ, చండీగఢ్‌ వర్సిటీ వంటి ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాలు తక్కిన పేటెంట్లకు దరఖాస్తు చేశాయి. అలాగే, 2020–21లో ఐఐటీలు 640 పేటెంట్లు ప్రకటించగా తక్కిన సంస్థల్లో అవి మరింత మెరుగుపడ్డాయి. ఈ వర్సిటీల్లో టెక్నాలజీ బిజినెస్‌ ఇంక్యుబేటర్లను ఏర్పాటుచేసి ఈ పేటెంట్లను దాఖలు చేశాయి.

ఇదీ చదవండి: AP: ఫ్యామిలీ డాక్టర్‌.. సరికొత్త ‘జీవన శైలి’

మరిన్ని వార్తలు