రూ.కోట్ల ఆస్తులు ఉన్నా.. అనాథే..!

8 May, 2021 08:57 IST|Sakshi
మూటా ముల్లెతో వచ్చి ఆవేదన వెలిబుచ్చుతున్న సత్యనారాయణ 

ఎనిమిది మంది సంతానమున్నా తండ్రిని ఆదరించని వైనం 

పట్టించుకోని కొడుకులు

ఆదుకోవాలని 80 ఏళ్ల వృద్ధుడి వేడుకోలు

ఎనిమిది మంది సంతానం.. ఒకరికి మించి ఒకరిపై ప్రేమను పొంగించాడు. అందరినీ గుండెలపై పెట్టుకుని పెంచాడు... వృద్ధాప్యంలో ఎవరో ఒకరు తమ గుండె గుడిసెలో కాస్త చోటిస్తారనుకున్నాడు. చదువులు, పెళ్లిళ్ల బాధ్యతల బరువులను ఆనందంగా మోశాడు. ఇంటి దీపాలైన ఆరుగురు ఆడ బిడ్డలు వివాహమై వెళ్తుంటే కళ్ల నిండా నీటి ఒత్తులు వెలిగించుకున్నాడు.

కొన్నాళ్లకు తన తోడు తనను ఒంటరిని చేసి వెళ్లిపోతే.. ఆయనిప్పుడు నీడ లేని వాడయ్యాడు. ఎనిమిది మంది సంతానానికి ఎక్కువై చివరకు అనాథాశ్రమంలో అన్నీ ఉన్నా అనాథగా మారాడు. కరోనా రక్కసి వికటాట్టాహాసానికి అనాథాశ్రమమూ ముఖం చాటేయడంతో ఏ దిక్కూలేక నడిరోడ్డుపై నీరింకిన కళ్లతో బేలగా చూస్తున్నాడు. దయ గల మారాజులెవరైనా ఆదరిస్తారేమోనని..  

సత్తెనపల్లి: సత్తెనపల్లికి చెందిన గోపవరపు సత్యనారాయణ వయసు ఎనిమిది పదులు పైనే. ఆయనకు ఆరుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులున్నారు. భార్య కొన్ని సంవత్సరాల క్రితం ఆయనను ఒంటరి వాడిని చేసి అనంతలోకాలకు వెళ్లింది. ఉండటానికి, తినడానికీ లోటు లేకపోయినా కన్నపేగు బంధమే కాదు పొమ్మంది. ఎనిమిది మంది సంతానంలో ఒక కుమార్తె మరణించింది. మిగిలిన వారిలో ఇద్దరు విజయవాడలో, ఒకరు గుంటూరులో, ఒకరు తిరుపతిలో, మరొకరు సత్తెనపల్లిలో ఉంటున్నారు.

కుమారులు మల్లేశ్వరరావు, ప్రసాద్‌ విజయవాడలో స్థిరపడ్డారు. వారెవరూ తండ్రిని చూసేందుకు ముందుకు రావడం లేదు. కాలే కడుపుకి పిడికెడు అన్నం పెట్టడానికి వీరికి మనసు రావడం లేదు. రూ.కోట్ల ఆస్తులు ఉన్నప్పటికీ ఒంటరిగా జీవించలేక సత్యనారాయణ ఏడాదిన్నర క్రితం పేరేచర్లలోని కొండప్రోలు బసవ పున్నయ్య అనాథా ఆశ్రమంలో చేరాడు. అక్కడే కాలం వెళ్లదీస్తున్న ఆయనకు కరోనా మళ్లీ పరీక్ష పెట్టింది.

కరోనాతో మళ్లీ రోడ్డుపైకి...
ఎనిమిది మంది సంతానం ఉండి కూడా అనాథగా మారాననే దిగులు నిత్యం వెంటాడుతుండే సత్యనారాయణకి ఆశ్రమంలో చేరాక కాస్త మనసు కుదుట పడింది. ఇంతలో కరోనా రూపంలో ఆయనకు జీవితం మరోసారి పరీక్ష పెట్టింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆశ్రమాన్ని నిర్వాహకులు మూసేశారు. దీంతో సత్యనారాయణ మళ్లీ రోడ్డున పడ్డాడు. శుక్రవారం సత్తెనపల్లి వచ్చిన ఆయన ఓ లాడ్జి వద్దకు వచ్చి దీనంగా కూర్చొని ఉన్నాడు.

తన వారెవరూ ఆదరించడం లేదని, ఆస్తులు ఉన్నా ఒంటరిని చేశారని వాపోయాడు. సత్తెనపల్లిలో సొంత ఇల్లు ఉన్నప్పటికీ అద్దెకు చేరిన వ్యాపారవర్గానికి చెందిన ఓ వ్యక్తి ఇంటిని ఖాళీ చేయడం లేదు. కడుపున పుట్టిన బిడ్డలు పట్టించుకోవడం లేదు. లాడ్జిలోనైనా తలదాచుకుందామంటే కరోనాకు భయపడి నిర్వాహకులు రూములు ఇవ్వడం లేదని ఆయన కన్నీటి పర్యంత మవుతున్నాడు. ఈ విపత్కర పరిస్థితుల్లో తన ఇంటిని ఖాళీ చేయించి కాస్తంత నీడ చూపించాలని వేడుకుంటున్నాడు.

చదవండి: బద్వేలులో దారుణం: పెళ్లయిన నాలుగు నెలలకే..   
మెడి‘కిల్స్‌’: ప్రాణాల మీదకు తెస్తున్న సొంత వైద్యం

మరిన్ని వార్తలు