అరచేతిలో పోలీస్‌ స్టేషన్‌!

11 Sep, 2020 07:07 IST|Sakshi

అడుగు కదపకుండానే 87 రకాల పోలీస్‌ సేవలు

త్వరలో ప్రారంభించనున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: పోలీస్‌ స్టేషన్‌ పేరు వింటేనే కొంత జంకు, బెరుకు సహజం. పోలీసులు స్నేహహస్తం చాస్తున్నా అందుకునేందుకు ప్రజలు వెనకడుగు వేస్తున్నారు. దేశంలో తొలిసారిగా రాష్ట్ర పోలీసు శాఖ ఈ సమస్యకు పరిష్కారాన్ని అన్వేషించింది. రాష్ట్రంలోని 964 పోలీస్‌ స్టేషన్లను అనుసంధానిస్తూ స్టేషన్‌ గడప తొక్కకుండానే ప్రజలు 87 రకాల సేవలను పొందేలా ప్రత్యేకంగా ‘ఏపీ పోలీస్‌ సేవ’ మొబైల్‌ యాప్‌ సిద్ధమైంది. పోలీసు వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు నాంది పలకనున్న ఈ యాప్‌ త్వరలోనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. (చదవండి: అంతర్వేది ఘటన సీబీఐకి..

అరచేతిలో అన్ని సేవలు.. 
పోలీసు స్టేషన్‌ ద్వారా లభించే అన్ని సేవలను ఈ మొబైల్‌ యాప్‌ ద్వారా కూడా పొందవచ్చు. అన్ని రకాల నేరాలపై ఫిర్యాదులు చేయవచ్చు. ఈ యాప్‌ ఫిర్యాదులు స్వీకరించడమే కాదు రశీదు కూడా జారీ చేస్తుంది.  
దర్యాప్తు పురోగతి, అరెస్టులు, ఎఫ్‌ఐఆర్‌లు, రికవరీలు,  రహదారి భద్రత, సైబర్‌ భద్రత, మహిళా భద్రత, వివిధ కార్యక్రమాలకు అనుమతులు, ఎన్‌వోసీలు, లైసెన్సులు, పాస్‌పోర్ట్‌ సేవలు, ఇతర వెరిఫికేషన్లు ఇలా అన్ని పోలీసు సేవలను యాప్‌ ద్వారా పొందవచ్చు.  
ఈ యాప్‌ నుంచే వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు. అత్యవసర సమయాల్లో  వీడియో కాల్‌ చేస్తే పోలీస్‌ కంట్రోల్‌ రూంకు వెంటనే సమాచారం వెళ్తుంది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యే సమాచారాన్ని నిర్థారించుకునే అవకాశం కూడా ఉంది. 

ప్రజలకు చేరువలో పోలీస్‌ సేవలు 
పోలీస్‌ స్టేషన్‌కు రావాల్సిన అవసరం లేకుండానే ప్రజలకు పోలీసు సేవలను సత్వరమే పూర్తిస్థాయిలో అందించడమే లక్ష్యం. జవాబుదారీతనంతో పోలీసు వ్యవస్థను తీర్చిదిద్దుతున్నాం. సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ రూపొందించిన ‘ఏపీ పోలీస్‌ సేవ’ యాప్‌ను సీఎం వైఎస్‌ జగన్‌ త్వరలో ప్రారంభిస్తారు.
– గౌతమ్‌ సవాంగ్, డీజీపీ

ఆరు విభాగాల్లో 87 రకాల సేవలు
శాంతి భద్రతలు.. 
నేరాలు, వేధింపులపై ఫిర్యాదులు 
ఎఫ్‌ఐఆర్‌ స్థితిగతులు, డౌన్‌లోడ్‌ 
దొంగతనం ఫిర్యాదులు/ రికవరీలు 
తప్పిపోయిన కేసులు /దొరికిన వారు/గుర్తు తెలియని మృతదేహాలు 
అరెస్టుల వివరాలు 
వాహనాల వివరాలు 

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సేవలు.. 
ఇంటి పర్యవేక్షణ(లాక్‌మానిటరింగ్‌ సర్వీసు(ఎల్‌ఎంఎస్‌) , ఇ–బీట్‌) 
ఇ–చలానా స్టేటస్‌ 

పబ్లిక్‌ సేవలు.. 
నేరాలపై ఫిర్యాదులు 
సేవలకు సంబంధించిన దరఖాస్తులు 
ఎన్‌వోసీ, వెరిఫికేషన్లు 
లైసెన్సులు, అనుమతులు 
పాస్‌పోర్ట్‌ వెరిఫికేషన్‌  

రహదారి భద్రత.. 
బ్లాక్‌ స్పాట్లు 
యాక్సిడెంట్‌ మ్యాపింగ్‌ 
రహదారి భద్రత గుర్తులు 
బ్లడ్‌ బ్యాంకులు, డయాలసిస్‌ కేంద్రాలు, ఆసుపత్రులు, మందుల దుకాణాల వివరాలు 

ప్రజా సమాచారం.. 
పోలీస్‌ డిక్షనరీ 
సమీపంలోని పోలీస్‌స్టేషన్‌ 
టోల్‌ఫ్రీ నంబర్లు 
వెబ్‌సైట్ల వివరాలు 
న్యాయ సమాచారం 
ఎమర్జెన్సీ కాంటాక్ట్‌ నంబర్లు 

పబ్లిక్‌ ఔట్‌ రీచ్‌.. 
సైబర్‌ భద్రత 4 మహిళా భద్రత 
సోషల్‌ మీడియా 
కమ్యూనిటీ పోలీసింగ్‌ 
స్పందన వెబ్‌సైట్‌ 
ఫ్యాక్ట్‌ చెక్‌  

మరిన్ని వార్తలు