తొలిరోజే 92.59% మందికి పింఛన్లు

2 Apr, 2021 03:22 IST|Sakshi
కడప రవీంద్రనగర్‌లో మానసిక దివ్యాంగుడు రెడ్డిశేఖర్‌కు పెన్షన్‌ అందజేస్తున్న వలంటీర్‌ గౌసియా

వలంటీర్ల ద్వారా లబ్ధిదారుల ఇళ్ల వద్దే.. 

రూ.1,355.63 కోట్లు పంపిణీ 

నేడు, రేపు కొనసాగనున్న పంపిణీ   

సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా గురువారం పింఛన్ల పంపిణీ కార్యాక్రమం కోలాహలంగా కొనసాగింది. వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛను డబ్బులు పంపిణీ చేశారు. ప్రస్తుత నెలకు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 61,12,784 మందికి రూ.1,472.95 కోట్ల మేర పింఛను డబ్బులు విడుదల చేయగా.. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు 56,59,585 మందికి రూ.1,355.63 కోట్లు పంపిణీ చేశారు. తొలిరోజు 92.59% పంపిణీ పూర్తయింది.

శుక్ర, శనివారాల్లో కూడా వలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ కొనసాగనుంది. వివిధ కారణాల వల్ల గత రెండు మూడు నెలలుగా పింఛన్లు తీసుకోని వారికి బకాయిలతో కలిపి పంపిణీ చేశారు. 1,65,872 మందికి ఒక నెల బకాయితో కలిపి, 15,814 మందికి రెండు నెలల బకాయిలతో కలిపి ఈ నెల డబ్బులను అందజేశారు. ఐదుగురికి మూడు నెలలు, ఇద్దరికి నాలుగు నెలల బకాయిలు కూడా కలిపి పంపిణీ చేసినట్టు సెర్ప్‌ అధికారులు వెల్లడించారు. 

దీక్షగా పంపిణీ..
వలంటీర్లు తెల్లవారుజామునే పింఛన్ల పంపిణీ ప్రారంభించారు. చికిత్స పొందుతున్న వారికి ఆస్పత్రులకే వెళ్లి సొమ్ము అందజేశారు. తన పెళ్లి ముహూర్తం సమీపిస్తున్నా.. పింఛను పంపిణీ చేసి మరీ వివాహ వేదికకు వెళ్లారు ఒక వలంటీరు. అనారోగ్యం కారణంగా విశ్రాంతి తీసుకుంటూ.. పింఛన్ల పంపిణీ కర్తవ్యాన్ని నిర్వర్తించారు మరో వలంటీరు.

మరిన్ని వార్తలు