930 మద్యం సీసాలు స్వాధీనం

1 Dec, 2021 04:01 IST|Sakshi
స్వాధీనం చేసుకున్న మద్యం సీసాలు

ప్రభుత్వ వైన్‌షాపు సూపర్‌వైజర్, మరో వ్యక్తి అరెస్ట్‌ 

హనుమాన్‌ జంక్షన్‌ రూరల్‌: ప్రభుత్వ వైన్‌ షాపు ఉద్యోగి అక్రమార్కులతో చేతులు కలిపి భారీ మొత్తంలో మద్యం సీసాలు తరలిస్తుండగా హనుమాన్‌ జంక్షన్‌ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసు వివరాలు నూజివీడు డీఎస్పీ బి.శ్రీనివాసులు మంగళవారం మీడియాకు చెప్పారు. స్థానిక గుడివాడ రోడ్డులోని వేగిరెడ్డి థియేటర్‌ వద్ద ఉన్న ప్రభుత్వ వైన్‌షాపు నుంచి భారీ మొత్తంలో మద్యం సీసాలను కారులో తరలిస్తున్నట్లుగా సోమవారం రాత్రి పోలీసులకు సమాచారం అందింది.

హనుమాన్‌జంక్షన్‌ ప్రధాన కూడలిలో సీఐ కె.సతీష్, ఎస్‌ఐలు పామర్తి గౌతమ్‌కుమార్, కార్తిక ఉషారాణి వాహనాల తనిఖీ చేపట్టారు. తనిఖీల్లో గుడివాడ నుంచి నూజివీడు వైపు వెళ్తున్న మారుతీ కారులో రూ.1,39,500 విలువ చేసే 930 మద్యం బాటిళ్లు గుర్తించారు. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు ప్రశ్నించటంతో సరైన సమాచారం చెప్పకుండా వారు పారిపోయేందుకు యత్నించారు. దీంతో పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.

ప్రభుత్వ వైన్‌షాపులో సూపర్‌వైజర్‌గా పనిచేస్తోన్న పశ్చిమగోదావరి జిల్లా అప్పనవీడు గ్రామానికి చెందిన మద్దాల రమేష్‌ కొంతకాలంగా హనుమాన్‌జంక్షన్‌కు చెందిన మొవ్వ ప్రసాద్‌తో చేతులు కలిపి అడ్డదారిలో మద్యం సీసాలు తరలిస్తున్నట్లు నిర్థారించారు. వీరి నుంచి 930 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకోవటంతో పాటుగా నిందితులను అరెస్ట్‌ చేసి మంగళవారం నూజివీడు కోర్టులో హాజరుపర్చినట్లు తెలిపారు. సీఐ కె.సతీష్, ఎస్‌ఐలు పామర్తి గౌతమ్‌కుమార్, కార్తిక ఉషారాణి, సహకరించిన కానిస్టేబుళ్లను డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. వీరికి రివార్డులు అందించేందుకు సిఫార్సు చేస్తున్నట్లు ప్రకటించారు.  

మరిన్ని వార్తలు