Krishna Water: 4 రోజుల్లో 3.301 టీఎంసీలు కడలిపాలు

7 Jul, 2021 11:54 IST|Sakshi
ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి విడుదలవుతున్న జలాలు

శ్రీశైలంలో నీటిని తోడేస్తున్న తెలంగాణ.. యథేచ్ఛగా విద్యుదుత్పత్తి

శ్రీశైలంలో 814 అడుగులకు పడిపోయిన నీటిమట్టం

సాగర్, పులిచింతల్లోనూ కరెంటు తయారీ

ప్రకాశం బ్యారేజీ నుంచి 9,400 క్యూసెక్కులు వృథాగా సముద్రంలోకి

సాక్షి, అమరావతి: కృష్ణానదిలో వరద ప్రవాహం లేదు. అయినా.. ప్రకాశం బ్యారేజీ నుంచి కేవలం 4 రోజుల్లోనే 3.301 టీఎంసీలు కడలిపాలయ్యాయి. దీనికి ప్రధాన కారణం తెలంగాణ సర్కారు అక్రమంగా నీటిని తోడేస్తూ విద్యుదుత్పత్తి చేస్తుండటమే. తెలంగాణ ప్రభుత్వం నిబంధనల మేరకు వ్యవహరించి ఉంటే.. 3.301 టీఎంసీల కృష్ణా జలాలు కడలిపాలయ్యేవి కాదు. ఈ నీటితో రెండు రాష్ట్రాల్లోను 40 వేల ఎకరాల్లో పంటలు పండించే అవకాశం ఉండేది. తెలంగాణ సర్కార్‌ వైఖరి వల్ల ఆ జలాలు ఆయకట్టు రైతులకు దక్కకుండా పోయాయి.

మంగళవారం శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ప్రవాహం రాలేదు. అయినా తెలంగాణ యథేచ్ఛగా విద్యుదుత్పత్తి కొనసాగించింది. 14,126 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తుండటంతో శ్రీశైలంలో నీటిమట్టం 814.53 అడుగులకు పడిపోయింది. నీటినిల్వ 37 టీఎంసీలకు తగ్గిపోయింది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. పూర్తిస్థాయి నీటినిల్వ 215.81 టీఎంసీలు. వీటిని పరిశీలిస్తే.. శ్రీశైలంలో నీటినిల్వలు అడుగంటిపోయినట్లు స్పష్టమవుతోంది. నాగార్జునసాగర్‌లోకి 12,197 క్యూసెక్కులు వస్తుండగా.. దిగువన సాగునీటి అవసరాలు లేకపోయినా సరే విద్యుదుత్పత్తి చేస్తూ 30,576 క్యూసెక్కులను వదిలేస్తోంది. దీంతో సాగర్‌లో నీటిమట్టం 531.99 అడుగులకు తగ్గిపోయింది.

నీటినిల్వ 172.08 టీఎంసీలకు పడిపోయింది. సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. పూర్తిస్థాయి నీటినిల్వ 312.04 టీఎంసీలు. పులిచింతల ప్రాజెక్టులోకి 33,394 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటినిల్వ 34.45 టీఎంసీలకు చేరింది. ఈ ప్రాజెక్టు నిండాలంటే ఇంకా 11.32 టీఎంసీలు అవసరం. కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలు లేకపోయినా సరే తెలంగాణ సర్కార్‌ అక్రమంగా పులిచింతల ప్రాజెక్టులో విద్యుదుత్పత్తి చేస్తూ 9,200 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తోంది. ప్రకాశం బ్యారేజీలోకి 8,964 క్యూసెక్కులు చేరుతున్నాయి.

బ్యారేజీలో నీటినిల్వ పూర్తిస్థాయి 3.07 టీఎంసీలకు చేరుకోవడంతో మిగులుగా ఉన్న 9,400 క్యూసెక్కుల నీటిని 20 గేట్లను అరడుగు మేర ఎత్తి వృథాగా సముద్రంలోకి విడుదల చేస్తున్నట్లు ఈఈ స్వరూప్‌ తెలిపారు. తెలంగాణ అక్రమంగా నీటిని తోడేస్తుండటం వల్ల గత 3 రోజుల్లో మంగళవారం ఉదయం 6 గంటల వరకు ప్రకాశం బ్యారేజీ నుంచి 2.921 టీఎంసీలు కడలిపాలయ్యాయి. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 0.38 టీఎంసీల నీరు సముద్రంలో కలిసింది.  

మరిన్ని వార్తలు